ఈ ముగ్గురిలో గెలిచేదెవరు?.. ఇంకో 20 రోజుల్లో తేలబోతోంది

ఈ ముగ్గురిలో గెలిచేదెవరు?.. ఇంకో 20 రోజుల్లో తేలబోతోంది
  • ఎలాగైనా గెలవాలన్న కసిలో సిద్ధూ, అమరీందర్, భగవంత్ మన్
  • పరువు, ప్రతీకారం కోసం అమరీందర్ సింగ్
  • సీఎం పదవే లక్ష్యంగా సిద్ధూ వ్యూహాలు
  • చాన్స్‌‌‌‌‌‌‌‌ను అందిపుచ్చుకునేందుకు భగవంత్ మన్ ప్రయత్నం

చండీగఢ్: ఎన్నిక ఏదైనా గెలిచినోళ్లే హీరోలు.. ఓడినోళ్లు జీరోలు.. ‘నైతిక విజయాలు’ పదవిని ఇవ్వవు. గెలిచామా లేదా అన్నదే లెక్క. ఒక్క గెలుపు అందలం ఎక్కిస్తే.. ఒకే ఓటమి పాతాళానికి తొక్కేస్తుంది. ఇప్పు డు ఈ రెండింటి మధ్యే ఉన్నారు ముగ్గురు నేతలు. పరువు, ప్రతీకారం కోసం అమరీందర్ సింగ్.. సీఎం పదవే లక్ష్యంగా నవ్‌‌‌‌‌‌‌‌జోత్ సింగ్ సిద్ధూ.. వచ్చిన చాన్స్‌‌‌‌‌‌‌‌ను అందిపుచ్చుకునే ప్రయత్నంలో భగవంత్ మన్ ఉన్నారు. అమరీందర్, సిద్ధూకి ఇవి చావోరేవో లాంటి ఎన్నికలు. ఒకప్పుడు ఇద్దరూ ఒకే పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నప్పటికీ.. ఇప్పుడు ప్రత్యర్థులు. కాంగ్రెస్ గెలిస్తే అది సిద్ధూ ఖాతాలోకి, ఓడితే అమరీందర్ ఖాతాలోకి పోతుంది. వీరిద్దరూ కాకుండా ఆప్ గెలుస్తే.. భగవంత్ పంట పండుతుంది. ఓడినా భగవంత్‌‌‌‌‌‌‌‌కు పెద్దగా జరిగే నష్టంలేకున్నా.. మిగతా ఇద్దరి రాజకీయ జీవితాలపై పెను ప్రభావమే పడుతుంది. మరి ఈ ముగ్గురిలో గెలిచేదెవరు? ‘పంజా’బ్ విసిరేదెవరు? ఇంకో 20 రోజుల్లో తేలబోతోంది.
కెప్టెన్ సత్తాకు పరీక్ష
మొన్నటిదాకా పంజాబ్ కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కు పెద్దదిక్కులా ఉన్నారు మాజీ సీఎం, కెప్టెన్ అమరీందర్ సింగ్. ఇప్పుడు ఆ పార్టీనే ఓడించాలని కంకణం కట్టుకున్నారు. సిద్ధూతో గొడవలు, సీఎం పదవి నుంచి పార్టీ తప్పించడం, తన బాధను పట్టించుకోకపోవడంతో.. ‘పంజాబ్ లోక్ కాంగ్రెస్’ పేరుతో సొంత కుంపటి పెట్టుకున్నారు. బీజేపీతో జతకట్టి బరిలోకి దిగుతున్నారు. పాటియాలా అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సోమవారం నామినేషన్ వేశారు. నిజానికి కెప్టెన్‌‌‌‌‌‌‌‌కు ఈ ఎన్నికలు డూ ఆర్ డై లాంటివి. ఇన్నేళ్ల రాజకీయ చదరంగంలో ఇప్పుడే ఆయన అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఎన్నికల్లో గెలవడం ద్వారా.. తనను పదవి నుంచి తొలగించిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌పై ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా ఉన్నారు. ఒకవేళ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోతే.. ఆయన రాజకీయ జీవితం దాదాపు ముగిసినట్లే. వయసు మీద పడటం కూడా ఇందుకు మరోకారణం. 
ఆమ్ ఆద్మీ పవర్ ఎంత?
ఢిల్లీ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రం పంజాబ్. గత అసెంబ్లీ ఎన్నికల టైంలోనే ఇక్కడ ఆప్ గట్టి పోటీ ఇచ్చింది. దాదాపుగా అధికారం దక్కించుకున్నంత పనిచేసింది. ఈసారి మాత్రం వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోకూడదని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా సీఎం అభ్యర్థిగా భగవంత్ మన్‌‌‌‌‌‌‌‌ను ప్రకటించింది. వరుసగా రెండు సార్లు ఆప్​ నుంచి ఎంపీగా గెలిచారు మన్. నిజానికి పంజాబ్‌‌‌‌‌‌‌‌లో ప్రస్తుతం రాజకీయ గందరగోళం ఉంది. అంతర్గత కుమ్ములాటలతో అధికార కాంగ్రెస్ రచ్చకెక్కింది. సిద్ధూ, అమరీందర్ సింగ్ ఎపిసోడ్ తర్వాత కూడా ఆ పార్టీలో వ్యవహారాలు చక్కబడలేదు. అగ్రి చట్టాల టైం నుంచి పంజాబ్‌‌‌‌‌‌‌‌లో బీజేపీపై వ్యతిరేకత ఎక్కువగా ఉంది. దశాబ్దాలపాటు అధికారంలో ఉన్న శిరోమణి అకాళీదళ్.. పెద్దగా సప్పుడు చేయడం లేదు. దీంతో ‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు’ అని ఆప్ భావిస్తోంది. పంజాబ్‌‌‌‌‌‌‌‌ను కైవసం చేసుకునేందుకు ఇదే సరైన టైమని భావించిన కేజ్రీవాల్.. ముందుగానే మన్‌‌‌‌‌‌‌‌ను సీఎం అభ్యర్థిగా ఎంపిక చేశారు. ఒపీనియన్ పోల్స్ కూడా ఆప్‌‌‌‌‌‌‌‌కు అనుకూలంగానే వచ్చాయి. ఒకేవేళ పంజాబ్‌‌‌‌‌‌‌‌లో అధికారం దక్కించుకుంటే.. అక్కడ అమలుచేసే కార్యక్రమాలతో దేశమంతటా పార్టీని విస్తరించాలని కేజ్రీవాల్ భావిస్తున్నారు.
కలహాల సిద్ధూ.. ఏం చేస్తరో?
ముందు నుంచీ వివాదాస్పదుడిగా ఉన్న నవ్‌‌‌‌‌‌‌‌జోత్ సింగ్ సిద్ధూకి ఇవి కీలక ఎన్నికలు. కొన్నేళ్ల కిందట బీజేపీ నుంచి బయటికి వచ్చారు. ఇప్పుడు పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌గా ఎన్నికలను లీడ్ చేస్తున్నారు. సొంత ప్రభుత్వంపైనే తరచూ విమర్శలు చేసి, అమరీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ను పదవి నుంచి, పార్టీ నుంచి తప్పించేలా చేశారు. ముఖ్యమంత్రి అవ్వాలని భావిస్తున్న ఆయన.. ఇప్పుడు తనను తాను నిరూపించుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికి చరణ్‌‌‌‌‌‌‌‌జిత్ సింగ్ చన్నీనే సీఎంగా ఉన్నప్పటికీ.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే సిద్ధూ సీఎం అయ్యే అవకాశాలు లేకపోలేదు. అయితే చన్నీకి కూడా పార్టీ పెద్దల నుంచి మద్దతు గట్టిగానే ఉంది. అమరీందర్ సింగ్‌‌‌‌‌‌‌‌తో గొడవ, సొంత ప్రభుత్వంపైనే విమర్శల వల్ల పార్టీపై, ప్రభుత్వంపై కాస్త వ్యతిరేకత వచ్చింది. ఒకవేళ పార్టీ ఓడితే ఈ కారణాల వల్ల సిద్ధూనే దోషిగా తేలే అవకాశం ఉంది. గెలిస్తే సీఎం అవ్వొచ్చు.. కాకపోవచ్చు.. కానీ ఓడితే మాత్రం సిద్ధూ పొలిటికల్ కెరియర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై పెద్ద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది.