- నిందితుడు అశ్విని కుమార్ అరెస్ట్.. పిస్టల్ స్వాధీనం, అతడి ఇల్లు కూల్చివేత
- మెడికల్ స్టోర్‌కు నిప్పుపెట్టిన పర్విందర్ మద్దతుదారులు
- న్యాయం జరిగే వరకు అంత్యక్రియలు చేయమంటున్న కుటుంబ సభ్యులు
చండీగఢ్: పంజాబ్‌లో జరిగిన యాంటీ -డ్రగ్ యాక్టివిస్ట్ పర్విందర్ సింగ్ జోటా హత్య కేసులో ప్రధాన నిందితుడు అశ్విని కుమార్ ఇంటిపై ఆప్ ప్రభుత్వం బుల్డోజర్ చర్యకు దిగింది. బుధవారం మాన్సాలోని గురుద్వారా రోడ్డులో ఉన్న నిందితుడి ఇంటిని ప్రభుత్వం బుల్డోజర్ తో కూల్చేసింది.
పర్విందర్ హత్య తర్వాత ఆగ్రహానికి గురైన ఆయన మద్దతుదారులు, స్థానికులు అశ్విని కుమార్ మెడికల్ స్టోర్‌లోకి ప్రవేశించి.. నిషేధిత ప్రిగబాలిన్ క్యాప్సూల్స్‌ను బయటకు విసిరేశారు. అంతేగాక, ఆగ్రహంతో మెడికల్ స్టోర్‌కు నిప్పు అంటించి దాన్ని పూర్తిగా దగ్ధం చేశారు.
జోటా హత్య తర్వాత నిందితుడు అశ్విని కుమార్ పారిపోగా..అతడిని పంజాబ్, రాజస్తాన్ పోలీసులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. రాజస్తాన్‌లోని సాలాసర్లో ఉన్న బాలాజీ ఆలయం దగ్గరున్న ఒక ధర్మశాలలో అశ్విని కుమార్ తన వేషాన్ని మార్చుకుని తలదాచుకున్నాడు. అయినప్పటికీ పోలీసులు అతడిని గుర్తించి, అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి హత్యకు వాడిన పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. అశ్విని కుమార్ పారిపోవడానికి సహాయం చేసిన మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
హత్యపై రాజకీయ దుమారం
యాంటీ -డ్రగ్ యాక్టివిస్ట్ పర్విందర్ సింగ్ హత్య పంజాబ్‌లో తీవ్ర రాజకీయ దుమారం రేపింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ఆప్ ప్రభుత్వం చేపట్టిన ‘యుధ్ నషా విరుధ్(డ్రగ్స్‌కు వ్యతిరేకంగా యుద్ధం)’ అనే యాంటీ-డ్రగ్ క్యాంపెయిన్ పూర్తిగా విఫలమైందని ప్రతిపక్ష కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) నేతలు విమర్శించారు. డ్రగ్స్ మాఫియాను ఎదిరించేవారికే భద్రత లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రభుత్వాన్ని నిలదీశారు.
మరోవైపు, నిందితుడికి తగిన శిక్ష పడే వరకు, న్యాయం జరిగే వరకు జోటా మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేది లేదని ఆయన కుటుంబ సభ్యులు, మద్దతుదారులు తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో ఈ నెల15న 'పంజాబ్ బంద్'కు కూడా పిలుపునిచ్చారు. కాగా..హత్య, మెడికల్ స్టోర్ దగ్ధం ఘటనలతో మాన్సా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు భారీగా మోహరించారు.
