హైదరాబాద్​కు వరుసగా ఐదో ఓటమి

హైదరాబాద్​కు వరుసగా ఐదో ఓటమి

షార్జా: ఐపీఎల్‌‌–14లో హైదరాబాద్‌‌ పరాజయాల పరంపర కొనసాగుతోంది.  వరల్డ్‌‌ క్లాస్‌‌ స్టార్లు అందుబాటులో ఉన్నా.. అరబ్‌‌ గడ్డపై అదృష్టాన్ని మార్చుకోలేకపోతున్నారు. బ్యాటింగ్‌‌లో విఫలమైన హైదరాబాద్‌‌.. శనివారం జరిగిన లీగ్‌‌ మ్యాచ్‌‌లో 5 రన్స్‌‌ తేడాతో పంజాబ్‌‌ కింగ్స్‌‌ చేతిలో ఓడింది. దీంతో రైజర్స్​ వరుసగా ఐదో ఓటమిని మూటగట్టుకోగా, ఓవరాల్‌‌గా ఇది 8వ పరాజయం. టాస్‌‌ ఓడి బ్యాటింగ్‌‌కు దిగిన పంజాబ్‌‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 125 రన్స్‌‌ చేసింది. మార్‌‌క్రమ్‌‌ (27) టాప్‌‌ స్కోరర్‌‌. తర్వాత హైదరాబాద్‌‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 120 రన్స్‌‌కే పరిమితమైంది. జేసన్​హోల్డర్‌‌ (29 బాల్స్‌‌లో 5 సిక్సర్లతో 47 నాటౌట్‌‌) దుమ్మురేపినా టీమ్‌‌ను గెలిపించలేకపోయాడు. సాహా (31) ఫర్వాలేదనిపించాడు. హోల్డర్​కు ‘మ్యాన్‌‌ ఆఫ్‌‌ ద మ్యాచ్‌‌’ అవార్డు లభించింది. 

బౌలింగ్‌‌.. భేష్‌‌

ముందుగా బ్యాటింగ్‌‌కు దిగిన పంజాబ్‌‌ను హైదరాబాద్‌‌ బౌలర్లు బాగా కట్టడి చేశారు. దీంతో ఒక్కరంటే ఒక్కరు కూడా భారీ ఇన్నింగ్స్‌‌ ఆడలేకపోయారు. ముఖ్యంగా హోల్టర్‌‌ (3/19) కీలక వికెట్లు తీయడంతో స్టార్టింగ్‌‌లోనే పంజాబ్‌‌ స్కోరు కు అడ్డుకట్ట పడింది. ఐదో ఓవర్‌‌లో హోల్డర్‌‌ నాలుగు బాల్స్‌‌ తేడాలో ఓపెనర్లు రాహుల్‌‌ (21), మయాంక్‌‌ (5)ను ఔట్‌‌ చేసి వికెట్ల పతనాన్ని స్టార్ట్‌‌ చేశాడు. క్రిస్‌‌ గేల్‌‌ (14), మార్‌‌క్రమ్‌‌.. ఇన్నింగ్స్‌‌ను ఆదుకునే బాధ్యతను తీసుకున్నా.. కింగ్స్‌‌ కట్టుదిట్టమైన బౌలింగ్‌‌ ముందు నిలవలేకపోయారు. ఈ ఇద్దరు థర్డ్‌‌ వికెట్‌‌కు 30 రన్స్‌‌ జోడించారు. పవర్‌‌ప్లేలో 29/1 ఉన్న స్కోరు ఫస్ట్‌‌ టెన్‌‌లో 55/2గా మారింది. అయితే 11వ ఓవర్‌‌లో రషీద్‌‌ (1/17).. గేల్‌‌ను ఔట్‌‌ చేయడంతో భారీ స్కోరు ఆశలు సన్నగిల్లాయి. తర్వాత వచ్చిన బ్యాట్స్‌‌మెన్‌‌ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. పూరన్‌‌ (8), దీపక్‌‌ హుడా (13), నేథన్‌‌ ఇల్లిస్‌‌ (12) వరుస విరామాల్లో ఔట్‌‌ కావడంతో రన్‌‌రేట్‌‌ మందగించింది. చివర్లో హర్‌‌ప్రీత్‌‌ బ్రార్‌‌ (18 నాటౌట్‌‌) పోరాడే ప్రయత్నం చేసినా అప్పటికే ఓవర్లు ముగియడంతో పంజాబ్‌‌ లో స్కోరుకే పరిమితమైంది.  సందీప్‌‌, భువీ, రషీద్‌‌, సమద్‌‌ తలా ఓ వికెట్‌‌ తీశారు. 

హోల్డర్‌‌ ఒక్కడే..

చిన్న టార్గెట్‌‌ను ఛేదించే క్రమంలో హైదరాబాద్‌‌కు స్టార్టింగ్‌‌లోనే ఎదురుదెబ్బలు తగిలాయి. ఇన్నింగ్స్‌‌ మూడో బాల్‌‌కు వార్నర్‌‌ (2), థర్డ్‌‌ ఓవర్‌‌ సెకండ్‌‌ బాల్‌‌కు విలియమ్సన్‌‌ (1)ను ఔట్‌‌ చేసి షమీ (2/14) కోలుకోలేని షాకిచ్చాడు. ఈ దశలో సాహా, మనీశ్‌‌ పాండే (13) సింగిల్స్‌‌తో ముందుకెళ్లారు. దీంతో రన్‌‌రేట్‌‌ పడిపోవడంతో పవర్‌‌ప్లేలో స్కోరు 20/2గా మారింది. 8వ ఓవర్‌‌లో స్పిన్నర్‌‌ బిష్ణోయ్‌‌ (3/24) రావడంతోనే మనీశ్‌‌ను ఔట్‌‌ చేశాడు. ఫలితంగా థర్డ్‌‌ వికెట్‌‌కు 22  రన్స్​ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ ముగిసింది. కేదార్‌‌ జాదవ్‌‌ (12) నెమ్మదించడంతో ఫస్ట్‌‌ టెన్‌‌లో సన్‌‌రైజర్స్‌‌ 43/3 స్కోరుతో ఎదురీత మొదలుపెట్టింది. 13వ ఓవర్‌‌లో బిష్ణోయ్‌‌ హైదరాబాద్‌‌కు డబుల్‌‌ ఝలక్‌‌ ఇచ్చాడు. ఐదు బాల్స్‌‌ తేడాలో జాదవ్‌‌, సమద్‌‌ (1)ను పెవిలియన్‌‌కు చేర్చాడు. సాహా.. జాదవ్‌‌తో నాలుగో వికెట్‌‌కు 24 రన్స్‌‌ సమకూర్చాడు. ఇక చేయాల్సిన రన్‌‌రేట్‌‌ పెరుగుతున్న టైమ్‌‌లో హోల్డర్‌‌  నాలుగు బాల్స్‌‌ తేడాలో మూడు భారీ సిక్సర్లు సంధించాడు. దీంతో 16 ఓవర్లు ముగిసేసరికి హైదరాబాద్‌‌ స్కోరు 91/5కు చేరింది. ఇక లాస్ట్‌‌ 4 ఓవర్లలో 35 రన్స్‌‌ కావాల్సిన దశలో సాహా అనూహ్యంగా రనౌటయ్యాడు. దీంతో ఆరో వికెట్‌‌కు 31 రన్స్ పార్ట్‌‌నర్‌‌షిప్‌‌ బ్రేక్‌‌ అయ్యింది. అయినప్పటికీ హోల్డర్‌‌ మరో సిక్సర్‌‌ బాదాడు. రెండోఎండ్‌‌లో రషీద్‌‌ (3) నిరాశపర్చడంతో లాస్ట్‌‌ ఓవర్​లో 17 రన్స్‌‌ అవసరమయ్యాయి. భువీ (3 నాటౌట్‌‌)తో కలిసి హోల్డర్‌‌ సిక్సర్‌‌ బాదినా ఫలితం దక్కలేదు.