
టోక్యో ఒలింపిక్స్‌లో 41 ఏళ్ల తర్వాత భారత్‌కు పతకం సాధించిన పురుషుల హాకీ జట్టు ఆటగాళ్లకు అరుదైన గౌరవం కల్పించనుంది పంజాబ్ ప్రభుత్వం.ఒలింపిక్స్‌లో పాల్గొన్న హాకీ జట్టులో పంజాబ్ నుంచే అత్యధిక మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. ఈ క్రమంలో ఆ రాష్ట్రంలోని 10 ప్రభుత్వ స్కూళ్లకు స్థానిక ఆటగాళ్ల పేర్లను మార్చాలని నిర్ణయించింది. దీనికి సంబంధించి సీఎం అమరిందర్ సింగ్ అంగీకారం తెలిపినట్లు పంజాబ్ విద్యాశాఖ మంత్రి విజయ్ ఇందర్ సింగ్లా తెలిపారు.
మిథాపూర్ జలంధర్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలకు హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ పేరును ఖరారు చేసినట్లు చెప్పారు. అమృత్‌సర్‌లోని తిమ్మోవల్ పాఠశాల పేరును వైస్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ పేరుతో మార్చనున్నట్లు చెప్పారు. అట్టారి స్కూల్ పేరును ఒలింపియన్ శంషర్ సింగ్ ప్రభుత్వ సీనియర్ సెకండరీ స్కూల్‌గా.. ఫరీద్‌కోట్‌లోని బాలికల పాఠశాల పేరును ఒలింపియన్ రూపిందర్‌పాల్ సింగ్ ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలగా మారుస్తామన్నారు. ఖుస్రోర్‌పూర్ స్కూల్ పేరును ఒలింపియన్ హార్దిక్ సింగ్ స్కూల్ అని, గురుదాస్‌పూర్‌లోని చాహల్ కలాన్ పాఠశాల పేరును ఒలింపియన్ సిమ్‌రంజిత్ సింగ్ ప్రభుత్వ పాఠశాలగా మార్చనున్నట్లు మంత్రి విజయ్ ఇందర్ చెప్పారు.