మూసేవాలా హత్యకేసులో సూత్రధారి బిష్ణోయ్ కు7రోజుల రిమాండ్

 మూసేవాలా హత్యకేసులో సూత్రధారి బిష్ణోయ్ కు7రోజుల రిమాండ్

సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యకేసులో ప్రధాన సూత్రధారి, గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కు మాన్సా కోర్టు 7 రోజుల రిమాండ్ విధించింది . ఢిల్లీ నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య తీసుకొచ్చిన బిష్ణోయ్ ను... మాన్సా చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ముందు పంజాబ్ పోలీసులు హాజరుపరిచారు. 10 రోజుల కస్టడీని పోలీసులు కోరగా.. 7 రోజుల మాత్రమే ఇచ్చింది కోర్టు. బిష్ణోయ్ ను ప్రశ్నించేందుకు...అతడిని మొహాలీకి తీసుకురానున్నారు. సిద్ధూ హత్య కేసులో లారెన్స్ బిష్ణోయ్ పాత్రకు సంబంధించి.. టాస్క్ ఫోర్స్ ఇతర ఏజెన్సీలతో కూడిన ప్రత్యేక బృందం ప్రశ్నించనుంది.

సిద్ధూ హత్య కేసులో బిష్ణోయ్ ప్రమేయంపై తగిన ఆధారాలను పంజాబ్ పోలీసులు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు ముందు ఉంచడంతో.. ట్రాన్సిట్ రిమాండ్ కు అనుమతి లభించింది. ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టుకు హాజరైన పంజాబ్ అడ్వొకేట్ జనరల్..  బిష్ణోయ్ కు రిమాండ్ విధించాలని డిమాండ్ చేశారు. కానీ బిష్ణోయ్ న్యాయవాదులు పంజాబ్ పోలీసుల అభ్యర్థనను వ్యతిరేకించారు. అయితే లారెన్స్ బిష్ణోయ్ భద్రతకు సంబంధించిన పూర్తి బాధ్యతను పంజాబ్ ప్రభుత్వం చూసుకుంటుందని హామీ ఇవ్వడంతో పటియాలా కోర్టు రిమాండ్ కు అనుమతిచ్చింది .