టీకాలు వేసుకోని ఉద్యోగులకు బలవంతపు సెలవులు

టీకాలు వేసుకోని ఉద్యోగులకు బలవంతపు సెలవులు

పంజాబ్: కరోనావైరస్ తో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. ఇప్పుడిప్పుడే కొలుకుంటున్న రాష్ట్రాలు.. కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ దిశగానే పంజాబ్ ప్రభుత్వం కూడా ఒక కఠిన నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఒక్క డోసు టీకా కూడా వేయించుకోని ప్రభుత్వ ఉద్యోగులను సెలవుపై పంపాలని నిర్ణయం తీసుకుంది. రాబోయే పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న కోవిడ్ ఆంక్షలను సెప్టెంబర్ 30 వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. శుక్రవారం అధికారులతో వర్చువల్‎గా నిర్వహించిన కోవిడ్ అత్యున్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.

‘ప్రభుత్వ ఉద్యోగుల కోసం టీకా కేంద్రాలు కూడా ఏర్పాటుచేశాం. అయినా కొంతమంది ఒక్క డోసు కూడా తీసుకోలేదు. అలా తీసుకోని వారందరినీ సెలవుపై పంపాలని నిర్ణయించాం. కనీసం ఒక్క డోసు అయినా తీసుకున్న వారిని మాత్రమే విధులకు అనుమతిస్తాం. బోధన మరియు బోధనేతర పాఠశాల సిబ్బంది నాలుగు వారాల క్రితం ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకొని తమ రిజల్ట్ సమర్పించారు. కాబట్టి వారిని విధులకు అనుమతించబడింది. తాజా నిర్ణయం ప్రకారం.. ఎవరికైనా ఇతర అనారోగ్య సమస్యలుంటే.. వారు రెండు డోసుల టీకాలు వేసుకున్న తర్వాత మాత్రమే విధులలోకి అనుమతిస్తాం’ అని సీఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది.