కెనడాలో పంజాబీ యువతి హత్య.. భారత్‎కు పరారైన అనుమానితుడు

కెనడాలో పంజాబీ యువతి హత్య.. భారత్‎కు పరారైన అనుమానితుడు

వాంకోవర్: కెనడాలో హత్యకు గురైన పంజాబీ యువతి అమన్ ప్రీత్ సైనీ కేసులో బ్రాంఫ్టన్‎కు చెందిన మన్ ప్రీత్ సింగ్‎ను అక్కడి పోలీసులు అనుమానితుడిగా పేర్కొన్నారు. కేసు విచారణ కోసం అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, అమన్ ప్రీత్ సైనీని హత్య చేసిన వెంటనే మన్ ప్రీత్ ఇండియాకు పారిపోయాడని అధికారుల పరిశోధనలో తేలింది. 

పంజాబ్‌‎లోని సంగ్రూర్‌‎కు చెందిన 27 ఏండ్ల మన్ ప్రీత్ సింగ్ కొన్నేండ్లుగా టొరంటోలో నివసిస్తున్నాడు. గతవారం అమన్ ప్రీత్ సైనీ లింకన్‌‌ ఏరియాలోని ఓ పార్కులో విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పాట్ కు చేరుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహంపై తీవ్ర గాయాలను గుర్తించిన పోలీసులు.. సైనీది హత్యేనని తేల్చారు. 

భారతీయ యువకుడు మన్ ప్రీత్ సింగ్‎ను అనుమానితుడిగా పేర్కొన్నారు. అతడిని వాటెండ్‌‎గా ప్రకటించి గాలింపు చర్యలు చేపట్టారు. అతడి ఫొటోను కూడా విడుదల చేశారు. అయితే, ఇప్పటికే అతడు దేశం విడిచి పారిపోయినట్టుగా అనుమానిస్తున్నారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతున్నది. మన్‌‌ ప్రీత్‌‌ ఆచూకీ కోసం కెనడా అధికారిక వర్గాలు భారత ప్రభుత్వాన్ని సంప్రదించినట్టు తెలుస్తోంది.