Purushaha Review: పెళ్లయిన మగాళ్లకు కనెక్ట్ అయ్యే కథ.. ‘పురుష:’ ఎలా ఉందంటే?

Purushaha Review: పెళ్లయిన మగాళ్లకు కనెక్ట్ అయ్యే కథ.. ‘పురుష:’ ఎలా ఉందంటే?

భార్యాభర్తల మధ్య గిల్లికజ్జాలు, కోర్టుల చుట్టూ తిరిగే విడాకుల గొడవలు ఎవర్ గ్రీన్ కాన్సెప్ట్. దీనికి కాస్త వినోదం, ఇంకొంచెం సెంటిమెంట్ జోడించి 'కళ్యాణ్ ప్రొడక్షన్స్' బ్యానర్‌పై బత్తుల కోటేశ్వరరావు నిర్మించిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘పురుష:’(Purushaha). 

వీరు వులవల దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ బత్తుల హీరోగా పరిచయమవుతూ.. సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, వెన్నెల కిషోర్ వంటి భారీ కామెడీ బలగంతో ఇవాళ (మే 22, 2026న) థియేటర్లలోకి వచ్చింది. టీజర్, ట్రైలర్ తోనే సినిమాపై క్యూరియాసిటీ పెంచారు మేకర్స్. మరి ఆ అంచనాలను పురుష: అందుకుందా? ప్రేక్షకులను ఏ మేరకు నవ్వించిందో, ఆలోచింపజేసిందో రివ్యూలో చూద్దాం.

విడాకుల ట్రాక్‌లో మూడు జంటల కథ:

గోవింద్ (పవన్ కళ్యాణ్), శ్రీను (కసిరెడ్డి), సత్తి (సప్తగిరి) చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. వీరి గ్యాంగ్‌లోనే క్రియేటివ్ కిస్సు అలియాస్ కిషోర్ (వెన్నెల కిషోర్) కూడా ఉంటాడు. అయితే కథలో అసలు ట్విస్ట్ ఏంటంటే.. ప్రాణ స్నేహితులైన గోవింద్, శ్రీను, సత్తి ముగ్గురికీ పెళ్లయిన ఏడాదికే భార్యలతో గొడవలు జరిగి విడాకుల కోసం కోర్టు మెట్లెక్కుతారు.

గోవింద్‌ను ప్రాణంగా ప్రేమించిన కమల (రాయంచ), భర్త ప్రాబ్లమ్ తెలిసికూడా అండగా నిలిచిన గీత (విషిక), బిజినెస్‌లో లాస్ అయినా సత్తిని వదలని లక్ష్మీ (హాసిని సుధీర్).. అసలు ఎందుకు విడాకులు కావాలంటారు? వీరి సంసారాల్లో నిప్పులు పోసిన ఆ 'క్రియేటివ్ కిస్సు' ఎవరు? చివరికి ఈ జంటలు ఎలా ఒకటయ్యాయి అనేదే మిగతా కథ.

ఎలా ఉందంటే:

ఈ మధ్య కాలంలో ప్యూర్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన అవుట్ అండ్ అవుట్ కామెడీ సినిమాలు చాలా తక్కువ వచ్చాయి. ఆ గ్యాప్‌ను భర్తీ చేయడంలో దర్శకుడు వీరు వులవల చాలా వరకు సక్సెస్ అయ్యాడు. పెళ్లయిన ప్రతి మగాడు ఈ కథకు ఈజీగా కనెక్ట్ అవుతాడు. 

ఫుల్ ఆన్ ఫన్.. ఎమోషనల్ రన్: ఫస్టాఫ్‌లో మూడు జంటల పరిచయం, కోర్టు సీన్లు, జడ్జ్ ముందు ఫ్లాష్‌బ్యాక్ ఓపెన్ అయ్యే ఎపిసోడ్స్ ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా ఇంటర్వెల్‌కు ముందు వచ్చే 20 నిమిషాల వెన్నెల కిషోర్ కామెడీ ఎపిసోడ్ థియేటర్లలో నవ్వుల పండగ తెస్తుంది. అక్కడే ఓ చక్కని ఎమోషనల్ టచ్‌తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది.

హౌస్ హజ్బెండ్ మ్యాజిక్: ఇక సెకండాఫ్‌లో హీరో వింటేజ్ లవ్ ట్రాక్, కసిరెడ్డి రాజకుమార్ మార్ కు  జంపింగ్ డైలాగ్స్ ప్రతీ చోటా పేలుతాయి. ‘హౌస్ హజ్బెండ్’ కాన్సెప్ట్ చుట్టూ అల్లిన సీన్స్ ఆడియన్స్‌ను బాగా ఎంటర్‌టైన్ చేస్తాయి. ప్రీ-క్లైమాక్స్ ట్విస్ట్, క్లైమాక్స్‌లో భార్యాభర్తల బంధం గొప్పతనాన్ని వివరించిన తీరు సినిమాకు పర్ఫెక్ట్ ఎండింగ్‌ను ఇచ్చాయి. కథ ఊహకందేలా సాగినప్పటికీ.. ఎక్కడా బోర్ కొట్టకుండా కామెడీ ట్రాక్‌తో మేనేజ్ చేశారు.

నటీనటులు:

హీరోగా మొదటి సినిమానే అయినా పవన్ కళ్యాణ్ చాలా చోట్ల మెచ్యూర్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. డాన్సులు కూడా పర్వాలేదనిపించాడు.  కాకపోతే యాక్టింగ్‌లో ఇంకాస్త మెరుగులు దిద్దుకుంటే ముందు ముందు మంచి భవిష్యత్తు ఉంటుంది. హీరోయిన్స్ గా నటించిన వాళ్ళు పర్లేదు. వెన్నెల కిషోర్ వన్-మాన్ షో చేయగా.. సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్ జోడి థియేటర్ అంతటా నవ్వులు పూయించింది.

వీటీవీ గణేష్, అనంత శ్రీరామ్ తమ పాత్రల పరిధి మేర మెప్పించారు. సాంకేతికంగా చూస్తే.. కొత్త ప్రొడక్షన్ అయినా నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. పాటలు, విజువల్స్ బాగున్నాయి. భార్యాభర్తల బాండింగ్ పై రాసిన డైలాగ్స్ మనసుకు హత్తుకుంటాయి.

ఫైనల్గా: కొంచెం లవ్, కాస్త ఎమోషన్, బోలెడంత కామెడీ కలగలిపిన 'పురుష:' చిత్రం ఈ వీకెండ్‌లో ఫ్యామిలీతో కలిసి హాయిగా నవ్వుకోవడానికి ఒక బెస్ట్ ఆప్షన్.