Allu Arjun-Rashmika: జపాన్‌ను ఊపేస్తున్న 'పుష్ప2' మేనియా.. టోక్యో వీధుల్లో 'తగ్గేదే లే' అంటున్న అల్లు అర్జున్, రష్మిక!

 Allu Arjun-Rashmika: జపాన్‌ను ఊపేస్తున్న 'పుష్ప2' మేనియా.. టోక్యో వీధుల్లో 'తగ్గేదే లే' అంటున్న అల్లు అర్జున్, రష్మిక!

ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఇండియన్ మూవీ పేరు వినబడితే టక్కున గుర్తొచ్చే పేర్లలో 'పుష్ప' ఒకటి. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సృష్టించిన రికార్డులు అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆ మ్యాజిక్‌ను గ్లోబల్ లెవల్‌లో కొనసాగిస్తూ, సీక్వెల్ 'పుష్ప 2: ది రూల్' జపాన్ గడ్డపై అడుగుపెట్టింది. జనవరి 16న 'పుష్ప కున్రిన్' (Pushpa Kunrin) పేరుతో గ్రాండ్ గా రిలీజ్ అయింది. ఈ సినిమా కోసం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మిక టోక్యోలో చేస్తున్న హడావిడి ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది.

జపనీస్ డైలాగ్‌తో అదరగొట్టిన ఐకాన్ స్టార్

టోక్యోలో జరిగిన గ్రాండ్ ప్రీమియర్‌లో అల్లు అర్జున్ తనదైన శైలిలో ఎంట్రీ ఇచ్చి అభిమానులను ఆశ్చర్యపరిచారు. "తగ్గేదే లే" అనే మ్యానరిజంను ప్రదర్శిస్తూ..  జపనీస్ భాషలో పుష్ప డైలాగ్‌ను లైవ్‌లో చెప్పడంతో థియేటర్ మొత్తం ఈలలు, కేకలతో మారుమోగిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం ఎక్స్ లో వైరల్ అవుతోంది. కేవలం భాష తెలియకపోయినా, ఆయన మేనరిజమ్స్ , ఆ స్వాగ్‌కు అక్కడి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.

 

భారీ స్థాయిలో విడుదల

సాధారణంగా జపనీస్ ప్రేక్షకులకు ఇండియన్ సినిమాలు, ముఖ్యంగా  'ఆర్ఆర్ఆర్' తర్వాత తెలుగు సినిమాలపై విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.  దీనిని దృష్టిలో ఉంచుకుని  జపాన్ పంపిణీ సంస్థలు గీక్ పిక్చర్స్, షోచికు సంయుక్తంగా ఈ చిత్రాన్ని దాదాపు 250 స్క్రీన్‌లలో విడుదల చేస్తున్నాయి.  ఒక భారతీయ మాస్ ఎంటర్టైనర్‌కు జపాన్‌లో ఈ స్థాయిలో థియేటర్లు దక్కడం ఒక రికార్డు అనే చెప్పాలి. అల్లు అర్జున్‌తో పాటు 'శ్రీవల్లి' రష్మిక మందన్న కూడా టోక్యోలో సందడి చేస్తున్నారు. జపనీస్ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ, సినిమా విశేషాలను పంచుకుంటున్నారు. 

గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద 'వైల్డ్ ఫైర్'

'పుష్ప 2' ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించింది. కేవలం హిందీ బెల్ట్ లోనే 800 కోట్ల రూపాయలు, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1800 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను సాధించి భారతీయ సినిమా సత్తాను చాటింది. సుకుమార్ రూపొందించిన ఈ మాస్ యాక్షన్ డ్రామా, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ప్రపంచవ్యాప్తంగా ఒక కల్ట్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. "పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా.. ఫైర్!" అనే డైలాగ్ ఇప్పుడు టోక్యో వీధుల్లో కూడా వినిపిస్తోంది.

అట్లీతో క్రేజీ కాంబినేషన్

'పుష్ప2' ప్రమోషన్లు ముగిసిన తర్వాత అల్లు అర్జున్ తన తదుపరి ప్రాజెక్టుల మీద దృష్టి పెట్టనున్నారు. కోలీవుడ్ మాస్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఆయన తన 22వ సినిమా (AA22) చేయబోతున్నారు. ఇందులో బాలీవుడ్ క్వీన్ దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. ఈ కాంబినేషన్ అనౌన్స్‌మెంట్ నుండే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెంచేసింది. ఈ మూవీ తాత్కాలికంగా AA22xA6 అని పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్, అట్లీ గత చిత్రం 'జవాన్' కంటే భారీ స్థాయిలో ఉండబోతోందని సినీ వర్గాల అంచనా వేస్తున్నాయి..

జపాన్ ప్రేక్షకులకు భారతీయ సినిమాలంటే ఎంతో ఇష్టం. గతంలో 'ముత్తు', 'RRR' సినిమాలకు నీరాజనాలు పట్టిన జపనీయులు, ఇప్పుడు 'పుష్ప రాజ్' స్వాగ్‌ను ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. ఖచ్చితంగా 'పుష్ప కున్రిన్' జపాన్ బాక్సాఫీస్ వద్ద కొత్త చరిత్ర సృష్టిస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pushpa (@pushpamovie)