- ఆయనతో పాటు భార్య శైలజను విచారించిన ఆఫీసర్లు
- రాజకీయంగా అణగదొక్కేందుకే ఈ కేసులో మంత్రి శ్రీధర్‌బాబు మా పేర్లను చేర్పించారు: పుట్ట మధు
గోదావరిఖని, వెలుగు: హైకోర్టు అడ్వకేట్లు గట్టు వామన్ రావు, నాగమణి దంపతుల హత్య కేసులో సీబీఐ ఎదుట మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు, ఆయన భార్య శైలజ హాజరయ్యారు. సోమవారం రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆఫీస్‌లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు మూడు గంటల పాటు సీబీఐ ఆఫీసర్లు వారిని విచారించారు.
అనంతరం మధు మీడియాతో మాట్లాడారు. ఆఫీసర్లు అడిగిన ప్రతి ప్రశ్నకూ సమాధానం చెప్పామని, చట్టాలు, న్యాయస్థానాలపై తమకు పూర్తి నమ్మకం ఉందని తెలిపారు. అడ్వకేట్లు వామన్ రావు, నాగమణి హత్య జరిగిన తర్వాత వామన్ రావు తండ్రి కిషన్ రావు తమ గురించి ఎక్కడా మాట్లాడలేదని, తమను రాజకీయంగా అణగదొక్కేందుకే తర్వాత ఆయనపై ఒత్తిడి తీసుకువచ్చి ఈ కేసులో మా పేర్లను చేర్చారని ఆరోపించారు.
గట్టు కిషన్‌రావుకు సుప్రీంకోర్టుకు వెళ్లేంత పరిస్థితి లేదని, కేవలం శ్రీధర్‌బాబు ప్రోద్బలంతోనే ఆయన సుప్రీంకోర్టులో కేసు వేశారని పేర్కొన్నారు. తన మేనల్లుడు శ్రీనుకు ఈ కేసుతో సంబంధం ఉంటే తమనెందుకు ఈ కేసులోకి లాగారని ప్రశ్నించారు. గతంలో జరిగిన మంథని మధుకర్ హత్య కేసు హైకోర్టులో నడుస్తున్నదని, దీనిని బయటకు తేవడం లేదని, ఈ విషయమై శ్రీధర్‌బాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మంథని మధుకర్ హత్య కేసులో శ్రీధర్‌బాబు వెంట తిరిగే కాంగ్రెస్ పార్టీ లీడర్ల పేర్లు ఉన్నందునే ఆ కేసు బయటకు రావడం లేదన్నారు. మంథని రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండొద్దనే ఆలోచనతోనే మాపై ఈ అభియోగం మోపారని ఆరోపించారు. ప్రజా సేవ చేస్తున్న తమను సమాజం ముందు దోషులుగా ముద్రవేస్తున్నారని, బీసీ బిడ్డను కావడం వల్లనే తమను ఈ రకంగా వేధిస్తున్నారని తెలిపారు.
