నన్ను చంపేందుకు కుట్ర.. ప్రజా ఆశీర్వాద యాత్రలో పుట్ట మధుకర్ 

నన్ను చంపేందుకు కుట్ర.. ప్రజా ఆశీర్వాద యాత్రలో పుట్ట మధుకర్ 

పలిమెల, వెలుగు : తన హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి తట్టుకోలేక ఇతర పార్టీ నాయకులు తనను హత్య చేయడానికి కుట్రపన్నుతున్నారని మంథని నియోజకవర్గ  బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్  అన్నారు. ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా శుక్రవారం జయశంకర్  భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో ఆయన పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

గ్రామస్తులను, కార్యకర్తలను పేరుపేరునా పలకరించారు. పలు గ్రామాలలో కాంగ్రెస్  పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మధుకర్  మాట్లాడుతూ బీఆర్ఎస్  పార్టీతోనే పలిమెల మండల అభివృద్ధి సాధ్యమైందని అన్నారు. కనీసం రోడ్డు సౌకర్యం కూడా లేని మండలంలో రోడ్డు సౌకర్యం కల్పించానన్నారు.

వర్షం పడితే వాగులు వంకలు పొంగి, వాగు దాటేటప్పుడు ప్రాణాలు కోల్పోయేవారని గుర్తుచేశారు. అలాంటి స్థితిలో బ్రిడ్జిల నిర్మాణం చేపట్టి ముకునూరు నుంచి గంటలో జిల్లా కేంద్రంలో ఉండే విధంగా రవాణా వ్యవస్థ ఏర్పాటు చేసిన ఘనత తమదేనని చెప్పారు. ఈసారి ఎన్నికల్లో తనను మంథని ఎమ్మెల్యేగా గెలిపించాలని  ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహర్షి , రాష్ట్ర నాయకుడు రాకేష్, మండల అధ్యక్షుడు జవ్వాజి తిరుపతి , సర్పంచ్ లు , టీఆర్ ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.