వెలుగు స్పెషల్: కొలీజియం సిఫారసులు  ఎప్పుడూ స్పష్టత కరువే! 

వెలుగు స్పెషల్:  కొలీజియం సిఫారసులు  ఎప్పుడూ స్పష్టత కరువే! 

సెప్టెంబర్‌‌‌‌ 28, 2026న సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమై వివిధ రాష్ట్రాలలో పనిచేస్తున్న ముగ్గురు  ప్రధాన న్యాయమూర్తులను సుప్రీంకోర్టుకు న్యాయమూర్తులుగా  పదోన్నతి కల్పించాలని  సుప్రీంకోర్టు  స్టేట్‌‌మెంట్‌‌ని ప్రకటించింది.  జస్టిస్‌‌ సునీతా అగర్వాల్‌‌ గుజరాత్  హైకోర్టు  ప్రధాన  న్యాయమూర్తి,  జస్టిస్‌‌ డీకే ఉపాధ్యాయ్​ ఢిల్లీ హైకోర్టు  ప్రధాన న్యాయమూర్తి, జస్టిస్‌‌ అపరేశ్‌‌ కుమార్‌‌‌‌ సింగ్‌‌ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. ఈ ముగ్గురూ ఈ నెల 6వ తేదీన  సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా  ప్రమాణం చేశారు.జస్టిస్‌‌  సునీతా అగర్వాల్‌‌,  జస్టిస్‌‌  ఉపాధ్యాయ్‌‌లు  వాస్తవానికి  అలహాబాద్‌‌ హైకోర్టుకు చెందినవారు.జస్టిస్‌‌ అపరేశ్‌‌ కుమార్‌‌‌‌ సింగ్‌‌ జార్ఖండ్‌‌ హైకోర్టుకు చెందిన వ్యక్తి. ఈ ముగ్గురూ జాతీయ సీనియారిటీ జాబితాలో  వరుసగా  నాలుగు,  ఐదు, ఆరవ స్థానాల్లో ఉన్నారు. ఈ  ముగ్గురి నియామకం వల్ల ముగ్గురు సీనియర్‌‌‌‌  ప్రధాన న్యాయమూర్తులైన జస్టిస్‌‌ హరీశ్ టాండన్‌‌,  సౌమెన్‌‌ సేన్‌‌,  జి.ఎస్‌‌ సందవాలియాలు సుప్రీంకోర్టుకు ఎలివేట్‌‌ కాలేకపోయారు.
 
ఈ విధంగా కొంతమంది న్యాయమూర్తులని అధిగమించి జూనియర్‌‌‌‌లకు ఈ పదోన్నతి కల్పించడం ద్వారా ఎప్పుడూ కొన్ని ప్రశ్నలు తలెత్తుతూనే ఉంటాయి.  
కొలీజియంపై ఉన్న ప్రధాన విమర్శ పారదర్శకత లేమి.  గతంలో  కొంతమంది  ప్రధాన  న్యాయమూర్తులు ఈ  పారదర్శకత  లేమిని పరిష్కరించే ప్రయత్నంలో కొంత పారదర్శకమైన విధానాన్ని అవలంబించారు. సీజేఐ సూర్యకాంత్‌‌  బాధ్యతలు చేపట్టిన తరువాత కొలీజియం  ప్రకటనల్లో ఎలాంటి వివరాలు ఉండటం లేదు. అత్యంత నిరాడంబరంగా అవి ఉంటున్నాయి. కొలీజియం ప్రకటనలు ఎక్కువ శాతం అస్పష్టంగానే ఉంటున్నాయి. మాతృ హైకోర్టు ప్రాతినిధ్యం విషయంలో,  లింగ ప్రాతినిధ్యం విషయంలో, పదవీకాలం విషయంలో మనకు స్పష్టత కనిపించదు. అవి నిలకడగా కూడా ఉండవు. 

సుప్రీంకోర్టులో ప్రాతినిధ్యంలేని 7 రాష్ట్రాలు


మాతృ హైకోర్టు విషయానికి వస్తే అలహాబాద్ హైకోర్టు నుంచి ఇప్పటికే ఇద్దరు న్యాయమూర్తులు జస్టిస్‌‌ విక్రమ్‌‌నాథ్‌‌, మనోజ్‌‌ మిశ్రాలు సుప్రీంకోర్టులో ఉన్నారు. అదేవిధంగా జార్ఖండ్‌‌ హైకోర్టు నుంచి జస్టిస్‌‌ చంద్రశేఖర్‌‌‌‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మాతృ హైకోర్టుల ప్రాతినిధ్యం కొలీజియం నిర్ణయంలో ఒక అంశం అయితే దాన్ని  సమతుల్యం చేయడానికి ఏ ఇతర కొలమానాలు ఉపయోగించారో స్పష్టత లేదు.  ప్రస్తుత పరిస్థితి ప్రకారం మాతృ హైకోర్టు ప్రాతినిధ్యంలో ముగ్గురు న్యాయమూర్తులతో అలహాబాద్‌‌ హైకోర్టు అగ్రస్థానంలో ఉంది. జార్ఖండ్‌‌ నుంచి ఇద్దరు న్యాయమూర్తులు ఉన్నారు.  అదేవిధంగా బొంబాయి, కలకత్తా, ఢిల్లీ, కర్నాటక,  మద్రాస్‌‌, రాజస్తాన్‌‌ హైకోర్టుల నుంచి కూడా ఇద్దరేసి న్యాయమూర్తులు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌‌, చత్తీస్‌‌గఢ్‌‌,  కేరళ,  పాట్నా,  గౌహతి, తెలంగాణ, మణిపూర్‌‌‌‌ల నుంచి ఒక్కో న్యాయమూర్తి సుప్రీంకోర్టులో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో సుప్రీంకోర్టులో ప్రాతినిధ్యం లేని రాష్ట్రాలు 7. అవి  హిమాచల్‌‌ప్రదేశ్‌‌,  జమ్మూ కాశ్మీర్‌‌‌‌,  లడఖ్, మేఘాలయ, ఒడిస్సా,  సిక్కిం, త్రిపుర, ఉత్తరాఖండ్‌‌. సుప్రీంకోర్టు న్యాయ నియామకాల్లో సమతుల్యత లేనప్పుడు, అది నిజమైన ప్రాతినిధ్య న్యాయస్థానం అనిపించుకోగలదా?  ఇది ‘బార్‌‌‌‌ అండ్‌‌ బెంచ్‌‌’ లేవనెత్తిన ప్రశ్నలు.

స్పష్టత లేని కొలీజియం అంశాలు

28 సెప్టెంబర్‌‌‌‌ 2026న కొలీజియం జారీచేసిన  ప్రకటన వారి సిఫారసుల వెనుక ఉన్న అంశాలను కొలీజియం పరిగణనలోకి తీసుకున్న అంశాలు  గురించి స్పష్టత ఇవ్వలేదు. జస్టిస్‌‌ సూర్యకాంత్‌‌ నేతృత్వంలోని కొలీజియం జారీచేసిన రెండో ప్రకటన ఇది. అభ్యర్థుల వివరాలు ఇవ్వకపోవడం ఇప్పుడు మామూలు విషయంగా మారిపోయింది. న్యాయమూర్తుల ఎంపికకు కారణాలు, వారి  విషయ పరిజ్ఞానం విషయాలను గతంలోని ప్రకటనలు తెలియజేసేవి.  చూసేవాళ్లకు కొంతమందిని ఎందుకు ఎంపిక చేశారో, మరి కొంతమందిని  ఎందుకు  విస్మరించారో అర్థం చేసుకోవడానికి అవకాశం ఉండేది. అలహాబాద్‌‌ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టులో నలుగురు న్యాయమూర్తులు ప్రాతినిధ్యం వహించడం, అదే సమయంలో ఏడు హైకోర్టులకు  ప్రాతినిధ్యం లేకపోవడం అనేది ప్రాంతీయ సమతుల్యత, ప్రతిభ, సీనియారిటీల మధ్య జరుగుతున్న చర్చ మళ్లీ తెరపైకి వచ్చింది. సుప్రీంకోర్టు మన దేశానికి అత్యున్నత ధర్మాసనం.  ప్రతి ప్రాంతానికి  చెందిన  న్యాయమూర్తులు ఉండటం వల్ల ఆ ప్రాంత సామాజిక, సాంస్కృతిక పరిస్థితులు తెలియడానికి అవకాశం ఉంటుంది. అది ఫెడరల్‌‌ స్ఫూర్తిని బలపరుస్తుంది.  ప్రాతినిధ్యం లేని రాష్ట్రాల న్యాయవాదులకి,  ప్రజలకు అసంతృప్తి ఏర్పడే అవకాశం ఉంది.   అసమతుల్యత భావన ఏర్పడే  అవకాశం ఉంది.

న్యాయవ్యవస్థపై విశ్వసనీయత

కొలీజియం నియామకాలను చేపట్టేటప్పుడు ఆల్‌‌ ఇండియా సీనియారిటీని, ప్రతిభకి, సమగ్రతకి ప్రాతినిధ్యం  ఇస్తారు.  అలా  ఇవ్వనప్పుడు కారణాలు ఇస్తే కొంత ఉపశమనంగా ఉంటుంది. వివరణ ఇవ్వడం వల్ల న్యాయవ్యవస్థపై విశ్వసనీయత మరింత పెరుగుతుంది.  జస్టిస్‌‌ అపరేశ్‌‌కుమార్‌‌‌‌ సింగ్‌‌కి జూనియర్‌‌‌‌ అయిన అదే రాష్ట్రానికి చెందిన న్యాయమూర్తి జస్టిస్‌‌ చంద్రశేఖర్‌‌‌‌ని గత రౌండులో సీజేఐ సూర్యకాంత్‌‌ నేతృత్వంలోని కొలీజియం సిఫారసు చేసింది. ఆయన సిఫారసును  కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.  ఇది అసాధారణమేమీ కాదు. సంస్థాగత కారణాల వల్ల  గతంలో  కూడా  సీనియారిటీని  సుప్రీంకోర్టు  కొలీజియం పక్కనపెట్టింది. ఈసారి జస్టిస్‌‌ అపరేశ్‌‌ కుమార్‌‌‌‌ సింగ్‌‌కి పదోన్నతి కల్పిస్తూ సిఫారసు చేసింది.

కేంద్ర ప్రభుత్వం ఆ సిఫారసుని ఆమోదించింది.  ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేశారు. అప్పుడు ఎందుకు విస్మరించారో,  ఇప్పుడు ఎందుకు సిఫారసు చేశారో తెలియదు. వారి మెటర్నల్‌‌ గ్రాండ్​ఫాదర్‌‌‌‌ కీ.శే. జస్టిస్‌‌ భువనేశ్వర్‌‌‌‌ ప్రసాద్‌‌ సిన్హా. ఆయన భారత సుప్రీంకోర్టులో 6వ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. అదేవిధంగా మేనమామలు జస్టిస్‌‌ బిస్వేశ్వర్‌‌‌‌ ప్రసాద్‌‌ సింగ్‌‌, జస్టిస్‌‌ శివశక్తి సింగ్‌‌లు కూడా సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పనిచేశారు. వారి ఇంకో తాతగారైన కీ.శే. శంభుప్రసాద్‌‌ సింగ్‌‌ పాట్నా హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. తెలంగాణ హైకోర్టులో వారు వెలువరించిన తీర్పుల దృష్ట్యా పదోన్నతి కల్పించి ఉంటారేమో.

 

కొలీజియం సమతుల్యత పాటించడం అవసరం


న్యాయమూర్తుల ఎంపిక మెరిట్‌‌ పైనే జరిగినా న్యాయమూర్తుల కుటుంబాల నుంచి ఎక్కువమంది న్యాయమూర్తులు ఎంపిక జరగడం ఎంతమాత్రం ఆమోదయోగ్యంగా అనిపించదు. ఈ వలయం నుంచి ఎప్పుడు న్యాయవ్యవస్థ  బయటపడుతుందో చెప్పలేని పరిస్థితి. మెరిట్‌‌ ఉన్న న్యాయవాదులు లేరా అన్న ప్రశ్న పరిస్థితి.  మరోవైపు  మెరిట్‌‌ ఉన్న న్యాయవాదులు లేరా అన్న ప్రశ్న కూడా తరచూ యువ న్యాయవాదులు లేవనెత్తుతున్నారు.  కొలీజియం సిఫారసుల వెంట వివరణ  ఉండటం అవసరమని పిస్తుంది. ప్రాంతీయ సమతుల్యత, వైవిధ్యాలని, లింగ వైవిధ్యాలను, మైనారిటీ అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. చిన్న హైకోర్టులకి, చిన్న రాష్ట్రాలకి తగు ప్రాతినిధ్యం లభించే విధంగా కొలీజియం సమతుల్య విధానాన్ని పాటించడం అత్యంత అవశ్యం. 

‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డా.మంగారి రాజేందర్​
జిల్లా జడ్జి (రిటైర్డ్)

 

ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ 
[email protected]
రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని 
హామీ తప్పనిసరి రాయాలి. 
స్వీయ రచన అయి ఉండాలి. 
రచన 700 పదాలకు మించరాదు.