ఆ మండలాల్లో బీసీలకు ఒక్క ఊరూ దక్కలే!

ఆ మండలాల్లో బీసీలకు ఒక్క ఊరూ దక్కలే!
  • జిల్లా యూనిట్ గా రిజర్వేషన్లు ఖరారు చేయడం, రొటేషన్​ పద్ధతి వల్లే సమస్య

హైదరాబాద్/ ఖమ్మం, వెలుగు: గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్ల కేటాయింపులో చిత్ర విచిత్రాలు బయటపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 46  ప్రకారం సర్పంచ్, వార్డు మెంబర్​రిజర్వేషన్ల ప్రక్రియను ఇప్పటికే పూర్తి చేసిన ఆఫీసర్లు.. జిల్లాల వారీగా గెజిట్లు విడుదల చేశారు. 

కాగా, జిల్లాను యూనిట్ గా తీసుకొని రిజర్వేషన్లను ఖరారు చేయడం, రొటేషన్​ పద్ధతి అవలంబించడం, బీసీ డెడికేటెడ్​ కమిషన్​ సిఫార్సుల వల్ల ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 27  మండలాల్లో బీసీలకు ఒక్క సర్పంచ్ స్థానం కూడా దక్కలేదు. అత్యధికంగా మహబూబాబాద్​ జిల్లాలోని ఆరు మండలాల్లో.. ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లోని ఐదేసి మండలాల్లో బీసీలకు ఒక్కసీటూ దక్కలేదు. దీంతో ఆయా జిల్లాల్లో బీసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

సోమవారం మంచిర్యాల జిల్లా భీమారం, జన్నారంలో బీసీలు ధర్నా నిర్వహించగా.. కోటపల్లిలో బీజేపీ నేతలు కలెక్టర్​ను కలిసి బీసీలకు ఒకటి, రెండైనా సర్పంచ్​స్థానాలు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. పలు మండలాల్లో ఎస్సీలకు, ఎస్టీలకు కూడా  ఒక్క గ్రామం కూడా రిజర్వ్​చేయకపోవడంతో ఆయా చోట్ల   ఆందోళన నెలకొంది. 

అంతా నిబంధనల ప్రకారమే..!

సర్పంచ్  రిజర్వేషన్ల ప్రక్రియను ఆర్డీవోల ఆధ్వర్యంలో పూర్తి చేయగా, వార్డు స్థానాలను ఎంపీడీవోలు ఖరారు చేశారు. 2011 జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు సర్పంచ్ స్థానాలను కేటాయించగా.. బీసీ రిజర్వేషన్లకు సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే (ఎస్​ఈఈఈపీసీ) ను పరిగణనలోకి తీసుకున్నారు. ప్రతి జిల్లాలో.. రాష్ట్రపతి నోటిఫై చేసిన షెడ్యూల్డ్​గ్రామాలతోపాటు100 శాతం గిరిజన జనాభా ఉన్న గ్రామాల్లో సర్పంచ్​, వార్డు మెంబర్​స్థానాలను పూర్తిగా ఎస్టీలకే కేటాయించారు.

 ఇక నాన్ షెడ్యూల్డ్ గ్రామాల్లో సర్పంచ్​, వార్డు మెంబర్​స్థానాల్లో ఎస్టీలకు 10, ఎస్సీలకు 17, బీసీలకు 23 శాతానికి అటు ఇటుగా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. సర్పంచ్​రిజర్వేషన్ల కోసం ఎస్టీ, ఎస్సీ, బీసీ జనాభా ఎక్కువ ఉన్న గ్రామాలను(అవరోహణ క్రమంలో) పరిగణనలోకి తీసుకున్నారు. రొటేషన్​పద్ధతిలో గతంలో రిజర్వ్​అయిన గ్రామాలను ఈ లిస్టుల్లోంచి తొలగించారు. దీని వల్ల కొన్ని మండలాల్లో బీసీలకు ఎక్కువ గ్రామాలు (జనాభా ఎక్కువగా ఉండడం, రొటేషన్​ పద్ధతిలో కలిసిరావడం వల్ల) రిజర్వ్​ కాగా.. కొన్ని మండలాల్లో ఒకటి, రెండు గ్రామాలే దక్కాయి.  

ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం 27 మండలాల్లోనైతే బీసీలకు ఒక్క సర్పంచ్​ స్థానమూ దక్కలేదు. గతంలోనూ ఇదే పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారయ్యాయని, అప్పట్లోనూ బీసీలకు రిజర్వ్​కాని మండలాలు ఉండేవని అధికారులు చెప్తున్నారు.  కానీ ప్రస్తుతం బీసీ ఉద్యమం బలంగా ఉండడం వల్లే ఈ విషయంపై చర్చ జరుగుతున్నదని పేర్కొంటున్నారు.  

46 జీవోకు అనుగుణంగానే రిజర్వేషన్లు 

రాజ్యాంగం, పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం, పంచాయతీరాజ్​ శాఖ ఇచ్చిన 46 జీవోలోని మార్గదర్శకాలకకు తగ్గట్టు  రిజర్వేషన్లు ఖరారు చేశాం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు.. కులగణన సర్వే, బీసీ డెడికేటెడ్ కమిషన్ రికమండేషన్స్ ఆధారంగా బీసీ రిజర్వేషన్ల ప్రక్రియ చేపట్టాం. 

భీమారం మండలంలో ఎస్సీలు 30.2 శాతం, ఎస్టీలు 20.15 శాతం, మొత్తం 50.35 శాతం పాపులేషన్ ఉంది. నిబంధనల ప్రకారం ఆ రెండు వర్గాలకే 50 శాతం రిజర్వేషన్  దాటుతున్నది. దీంతో అక్కడ బీసీలకు రిజర్వేషన్లు కేటాయించలేకపోయాం.
– కుమార దీపక్, మంచిర్యాల కలెక్టర్​

ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం
జిల్లాల్లో  ఒక్క సర్పంచ్ స్థానం కూడా
బీసీలకు దక్కని మండలాలు - 27 
జిల్లా    మండలాలు
 ఖమ్మం    రఘునాథపాలెం, తిరుమలాయపాలెం 
నల్గొండ     దామరచర్ల, నేరేడుగొమ్ము 
 సూర్యాపేట     చివ్వెంల, పాలకీడు 
మంచిర్యాల    భీమారం, కాసిపేట, కోటపల్లి,
మందమర్రి, నెన్నెల 
 ఆదిలాబాద్    బజార్​హత్నూర్, మావల, నేరడిగొండ, సాత్నాల, సొనాల, సిరికొండ 
 భూపాలపల్లి     మహాముత్తారం, పలిమెల 
 మహ బూబాబాద్      కేసముద్రం, కురవి, ఇనుగుర్తి,
సీరోలు, డోర్నకల్, మరిపెడ 
ఆసిఫాబాద్     బెజ్జూర్ 
నాగర్ కర్నూల్    అచ్చంపేట 
రంగారెడ్డి    ఆమనగల్లు