ఆసిఫాబాద్​ టూ హస్తిన

ఆసిఫాబాద్​ టూ హస్తిన
  • టికెట్ల కోసం కాంగ్రెస్ ​ఆశావహుల క్యూ..
  • గాడ్​ఫాదర్​ల ద్వారా చివరి ప్రయత్నాలు
  • హైదరాబాద్​ కేంద్రంగా చక్రం తిప్పుతున్న ఇంకొందరు

ఆసిఫాబాద్, వెలుగు : మరికొన్ని రోజుల్లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం ఎవరికి టికెట్లు ఇస్తారోనని కాంగ్రెస్ నేతలు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసి నెల రోజులు గడిచిపోయినా కాంగ్రెస్ పార్టీ టికెట్ల ఖరారు కొలిక్కి రాలేదు. జిల్లా నాయకులు స్క్రీనింగ్ కమిటీకి తమ అభిప్రాయాలు వినిపించారు. అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను మాత్రం ఏఐసీసీ స్ర్కినింగ్ కమిటీ సిద్ధం చేస్తోంది.

aఇదిలా ఉండగా.. ఆశావహులు మాత్రం టికెట్​కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ తమకే వస్తుందంటే తమకే వస్తుందని ప్రజల్లో, సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. కొందరు ఢిల్లీకి చేరుకొని పార్టీ పెద్దలను కలిసి ప్రయత్నాలు చేస్తుండగా.. మరికొందరు హైదరాబాద్ లో ఉండే తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. 

ఉత్కంఠలో శ్రేణులు

సిర్పూర్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, బీఎస్పీ పార్టీలు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. బీఆర్​ఎస్​ నుంచి సిట్టింగ్​ఎమ్మెల్యే కోనేరు కోనప్పకే బీఆర్​ఎస్​ టికెట్​ఇవ్వగా.. సిర్పూర్ ​నుంచే తాను పోటీలో ఉంటానని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్​ప్రవీణ్​కుమార్​ ప్రకటించిన విషయం తెలిసిందే. బీజేపీ నుంచి పాల్వాయి హరీశ్​బాబు, కొత్తపల్లి శ్రీనివాస్ తదితరులు​ టికెట్లు ఆశిస్తుండగా.. ఈ అభ్యర్థులను ఎదుర్కోవడం కాంగ్రెస్​కు సవాలుగా మారనుంది. దీంతో ఇక్కడి అభ్యర్థి ఎంపిక కోసం కాంగ్రెస్​ఆచితూచి అడుగులు వేస్తోంది.

కాంగ్రెస్​టికెట్​ కోసం కోరళ్లు కృష్ణారెడ్డి, రావి శ్రీనివాస్ నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నారు. ఎలాగైనా టికెట్ దక్కించుకునేందుకు హైదరాబాద్ కేంద్రంగా పైరవీలు కొనసాగిస్తున్నారు. రావి శ్రీనివాస్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో, కోరళ్ల కృష్ణా రెడ్డి బట్టి విక్రమార్కతో పైరవీలు చేస్తూ టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అధిష్ఠానం ఎవరివైపు మొగ్గు చూపుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఢిల్లీ వెళ్లిన శ్యాం నాయక్​

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని ఎస్టీ నియోజకవర్గమైన ఆసిఫాబాద్, జనరల్ నియోజకవర్గమైన సిర్పూర్ కాగజ్ నగర్ స్థానానికి కాంగ్రెస్ టికెట్ల కోసం పోటీ పెరిగింది. ఆసిఫాబాద్ నుంచి శ్యామ్ నాయక్, మర్సుకోల సరస్వతి, గణేశ్ రాథోడ్ టికెట్​ రేసులో ఉన్నారు. ఈ ముగ్గురూ టికెట్​కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. శ్యాం నాయక్ ఏకంగా దేశ రాజధాని ఢిల్లీకి చేరుకొని పైస్థాయిలో పైరవీలు కొనసాగించి మళ్లీ హైదరాబాద్​కు చేరుకున్నారు. ఇక మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ అండతో గణేశ్ రాథోడ్.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భరోసాతో మర్సుకోల సరస్వతి టికెట్ కోసం హైదరాబాద్​లో పైరవీలు కొనసాగిస్తున్నారు.