బీసీ సంక్షేమ శాఖను కేటీఆర్కు ఇవ్వండి : ఆర్ కృష్ణయ్య

బీసీ సంక్షేమ శాఖను కేటీఆర్కు ఇవ్వండి : ఆర్ కృష్ణయ్య

ప్రభుత్వ ఉద్యోగులందరికి జీతాలు పెంచిన తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల మెస్ చార్జీలు పెంచడంలో నిర్లక్ష్యం వహిస్తోందని బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. విద్యానగర్ లోని బీసీ భవన్ లో విద్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా విద్యార్థుల మెస్ చార్జీలను రూ.1500 నుండి 3000 లకు పెంచడంతో పాటు గురుకుల పాఠశాలలకు సొంత భవనాలను నిర్మించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు కల్పించాలని అన్నారు.

మంత్రి, అధికారులు బీసీ సంక్షేమం గురించి అసలు పట్టించుకోవడం లేదని ఆర్. కృష్ణయ్య ఆరోపించారు. ముఖ్యమంత్రి దీనిపై ఆలోచించి బీసీ సంక్షేమ శాఖను కేటీఆర్ కు కేటాయించాలని కోరారు. భావిభారత పౌరుల గురించి ప్రభుత్వం ఆలోచించి వారి సమస్యలను తొందరగా పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో బీసీ సంఘాలతో పాటు అన్ని విద్యార్థి సంఘాలతో కలిసి పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.