బీసీల డిమాండ్లు పరిష్కరిస్తామని అమిత్ షా హామీ: కృష్ణయ్య

బీసీల డిమాండ్లు పరిష్కరిస్తామని అమిత్ షా హామీ: కృష్ణయ్య

న్యూఢిల్లీ, వెలుగు : త్వరలోనే కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేస్తామని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్  షా హామీ ఇచ్చారని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య వెల్లడించారు. బీసీలకు పెద్ద ఎత్తున బడ్జెట్ పెంచుతామని కూడా మంత్రి భరోసా ఇచ్చారని ఆయన తెలిపారు. శుక్రవారం బీసీ సంఘాల ప్రతినిధులతో కలిసి కృష్ణయ్య ఢిల్లీలో అమిత్ షాతో భేటీ అయ్యారు. సుదీర్ఘ కాలం పెండింగ్ లో ఉన్న బీసీలకు సంబంధించిన దాదాపు 16 అంశాలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పార్లమెంట్​లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, చట్టసభల్లో వారికి 50 శాతం రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలని కోరామని కృష్ణయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ‘‘బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని విజ్ఞప్తి చేశాం. కేంద్రం చేపట్టబోయే జనగణన పట్టికలో 34 కాలమ్స్ ఉన్నాయని, అందులో అదనంగా కులగణనకు ఒక కాలం పెట్టాలని కోరాం. అలాగే రైల్వే, ఎల్ఐసీ, బ్యాంకింగ్  తదితర ప్రభుత్వ శాఖలను, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించవద్దని విజ్ఞప్తి చేశాం”  అని కృష్ణయ్య పేర్కొన్నారు.