రిజర్వేషన్ల అమలుకు జీవో జారీ చేయాలి : ఆర్. కృష్ణయ్య

రిజర్వేషన్ల అమలుకు జీవో జారీ చేయాలి : ఆర్. కృష్ణయ్య
  • బిహార్, తమిళనాడు ప్రభుత్వాల విధానాన్ని ఫాలో కావాలి
  • 26 బీసీ సంఘాలు, యువజన సంఘాల సమావేశంలో ఎంపీ ఆర్. కృష్ణయ్య

ముషీరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ రెండు బిల్లులు పాస్ చేయడం చరిత్రాత్మకమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ఈ బిల్లులను కేంద్రానికి పంపి రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకోకుండా చట్టం చేసి రెండు జీవోలు జారీ చేయాలని కోరారు. బిహార్, తమిళనాడు ప్రభుత్వాలు గతంలో అనుసరించిన విధాన ప్రక్రియను రాష్ట్రంలో కూడా పాటించాలని విజ్ఞప్తి చేశారు. 

ఆదివారం విద్యానగర్ లోని బీసీ భవన్ లో 26 బీసీ కుల సంఘాలు, యువజన సంఘాల సమావేశం ఓయూ జేఏసీ నాయకులు చెరుకు మణికంఠ, మలిదశ ఉద్యమకారుడు రాజు నేత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ‘బీసీ బిల్లులు పాస్.. కేంద్ర ప్రభుత్వ వైఖరి.. భవిష్యత్తు కార్యాచరణ’పై నాయకులు ప్రసంగించారు. ఈ సమావేశానికి ఆర్. కృష్ణయ్య హాజరై మాట్లాడారు. బిహార్, తమిళనాడులో రిజర్వేషన్లు పెంచినప్పుడు, బిల్లులు పాస్ చేయడానికి చట్టాలు చేసినప్పుడు మొదట జీవోలు జారీ చేసి ఉద్యోగాలు భర్తీ చేశారని తెలిపారు. తర్వాత కొంతమంది సుప్రీంకోర్టుకు వెళ్లిన కేసు నిలవలేదని అప్పుడు కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి రాజ్యాంగ సవరణ చేసిందని చెప్పారు. 

గతంలో దివంగత జయలలిత కూడా తమిళనాడు నుంచి అఖిలపక్షాన్ని తీసుకొని వెళ్లి ఢిల్లీలో బీసీ రిజర్వేషన్ల బిల్లు పాస్ అయ్యేంతవరకు ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే బాటలో నడవాలని కోరారు. బిల్లు పాస్ చేశాం ఢిల్లీకి పంపామని చేతులు దులుపు కోకుండా ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్లాలని సూచించారు. బీసీల డిమాండ్ మేరకు ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఓయూ జేఏసీ నాయకులు రాజు నేత మాట్లాడుతూ.. బీసీల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఢిల్లీకి వెళ్లి రిజర్వేషన్లు సాధించాలని డిమాండ్ చేశారు.