ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే పెద్దఎత్తున ఉద్యమం చేస్తాం: ఆర్ కృష్ణయ్య

ఆర్టీసీని ప్రైవేట్ పరం చేస్తే పెద్దఎత్తున ఉద్యమం చేస్తాం: ఆర్ కృష్ణయ్య

బడుగులు, బలహీన వర్గాలు అధికంగా ఉన్న ఆర్టీసీని ప్రైవేట్‌‌పరం చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌‌.కృష్ణయ్య హెచ్చరించారు. ఆర్టీసీని ప్రైవేట్‌‌కు ఇవ్వకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలతో కలిసి తీవ్ర స్థాయిలో అడ్డుకుంటామన్నారు. ఈ మేరకు గురువారం సీఎం కేసీఆర్‌‌కు ఆయన లేఖ రాశారు. రాజ్యాంగ రక్షణ ఉన్నా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరుగుతోందన్నారు. జాతీయ బీసీ కమిషన్, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ జోక్యం చేసుకొని, ఈ వర్గాల ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ ప్రైవేటీ పరం చేస్తే అందులో పని చేస్తున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఉద్యోగాలు పోతాయన్నారు. ఆర్టీసీ మొత్తం 49,500 మంది ఉద్యోగులు ఉన్నారని, ఇందులో 25,342 మంది బీసీలు, 9495 మంది ఎస్సీలు, 3,180మంది ఎస్టీలు, 6,900 మైనారిటీ ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. మొత్తం ఉద్యోగుల్లో బలహీనవర్గాల ఉద్యోగులు 91 శాతం మంది ఉన్నారని వివరించారు. వీరంతా జీతాలపై ఆధారపడి పని చేస్తున్నారని, ప్రైవేటీకరణ చేస్తే వీరి జీవితాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు భవిష్యత్తులో అత్యధిక ఉద్యోగ, ఉపాధి కల్పించే ఈ సంస్థలో రిక్రూట్‌‌మెంట్ జరగదని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఉద్యోగాలు రావన్నారు.