అధికారుల నిర్లక్ష్యం.. ప్రశ్నార్థకంగా మారిన రబీసాగు

అధికారుల నిర్లక్ష్యం.. ప్రశ్నార్థకంగా మారిన రబీసాగు

ఇరిగేషన్ శాఖ అధికారుల తీరుతో జగిత్యాల జిల్లా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వరదల సమయంలో పడిన గండ్లను పుడ్చకపోవడంతో రబీ సాగు ప్రశ్నార్థకంగా మారింది. సీజన్ దగ్గర పడుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి,బీర్ పూర్,మండలాల రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి.ఈ ఏడాది లో వర్షాలు సకాలంలో కురవడంతో పెద్ద ఎత్తున వరిసాగు చేశారు. పంట కలుపు వచ్చే దశలో అకాల వర్షాలు రావడంతో  పెద్దఎత్తున నష్టం జరిగింది. పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. వర్షాలకు బీర్పూర్ ధర్మపురి మండలాల రైతులకు సాగునీరు అందించే రోళ్ళ వాగు ప్రాజెక్టుకు గండి పడింది.ప్రాజెక్టులోని నీరంతా ఖాళీ కావడంతో రబీ సాగు ప్రశ్నార్థకంగా మారింది.

రెండు మండలాల్లో 20 వేల ఎకరాల సాగుకు  రోళ్ళ వాగు ప్రాజెక్టే ఆధారం.ఈ ప్రాజెక్టు పాత కట్టకు గండి పడటంతో ధర్మపురి మండలంలోని తాళ్ల ధర్మారం అరగొండలా ప్రాజెక్టులోకి నీళ్లు చేరాయి. పలు ప్రాంతాల్లో కట్ట తెగిపోయి వేలాది ఎకరాల్లోనూ సాగుకు నీరందకుండాపోయింది. దీంతో బీర్పూర్ మండలంలోని అన్ని గ్రామాలతో పాటు ధర్మపురి మండలంలోని 11 గ్రామాలకు సాగునీరు అందడం కష్టంగా మారింది. వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు అప్పులు తీర్చేదెలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ప్రాజెక్టు కు గండి పడటంతో  కాలువల ద్వారా నీళ్లు రావడం లేదంటున్నారు రైతులు.పొట్టదశలో ఉన్న వరి, ఇతర పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. ఖరీఫ్ చివరిలో పంటలకు నీరు అందక పోతే రబీ పంట ఎలా పండుతుంది ప్రశ్నిస్తున్నారు.  ప్రాజెక్టులపై ఆధారపడ్డ మత్స్యకారుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి.ప్రాజెక్టు పరిధిలోని బీర్పూర్ నర్సింహులపల్లి పోతారం గ్రామాలకు చెందిన 300 మంది మత్యకారులు ఉపాధి కోల్పోయారు. ప్రాజెక్టులోని నీళ్లతోపాటు  చేపలన్ని వెళ్ళిపోయాయి.మళ్లీ చేప పిల్లలు ఎదిగేందుకు కనీసం మూడు నుంచి ఐదేళ్లు పడుతుందంటున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ గండి పడిన ప్రాజెక్ట్ ను సందర్శించి రెండు నెలలు కావస్తున్నా సమస్యను పరిష్కరించేలేదంటున్నారు రైతులు. పంటలు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.

ప్రాజెక్టు ఆధునికరణ పనులను చేపట్టేందుకు 2016లో 60 కోట్లతో టెండర్ ప్రక్రియ ప్రారంభించగా పనులు ప్రారంభించేందుకు మరో ఏడాది పట్టింది. తరచూ అంతరాయంతో ఆరేళ్లు గడిచిన ఇప్పటికి పూర్తిస్థాయిలో పనులు జరగలేదు. అంచనా వ్యయం 135 కోట్లకు చేరింది. నిధులు రెట్టింపు అయినా  పనులు పూర్తి చేయకపోవడంతో పాతకట్ట తెగిపోయి ఆయకట్టు రైతులకు నీరందని పరిస్థితి ఏర్పడింది.