ఎల్బీనగర్, వెలుగు: పొగ తాగడం వల్ల ఊపిరితిత్తులకు క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్(సీవోపీడీ) సోకి ప్రాణాలు పోతాయని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు అన్నారు. మంగళవారం ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి ఆధ్వర్యంలో సీవోపీడీపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీపీ గెస్ట్‌గా హాజరై ఈ నెల 18 నుంచి 22 వరకు నిర్వహిస్తున్న పల్మనాలజిస్ట్ కన్సల్టెన్సీ ప్యాకేజీని ఆవిష్కరించి మాట్లాడారు.
ధూమపాన మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చాలా మంది స్టైల్ కోసం సిగరెట్ తాగి ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నారని వాపోయారు. కామినేని ఆస్పత్రి సీనియర్ కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రవీందర్ రెడ్డి, కామినేని అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధీర్ బాబు పడ్గుల్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ అంజయ్య కనుసోలి పాల్గొన్నారు.
రోడ్ సేఫ్టీపై సీపీ రివ్యూ
హైదరాబాద్ సిటీ: చలికాలం రోడ్డు ప్రమాదాల నివారణపై రాచకొండ సీపీ సుధీర్ బాబు మంగళవారం పోలీసు అధికారులతో సమీక్షించారు. ఉదయం, రాత్రివేళల్లో పొగమంచు కారణంగా రోడ్లపై ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. బ్లాక్ స్పాట్లను గుర్తించాలని ఆదేశించారు.
