దొంగల ముఠా@100 చోరీలు

దొంగల ముఠా@100 చోరీలు
  • శివారు ప్రాంతాలే టార్గెట్..పెళ్లిళ్లు జరిగే కాలనీల్లో రెక్కీ
  • ఇద్దరు దొంగలు, ఓ రిసీవర్ ని అరెస్టు చేసిన రాచకొండ పోలీసులు
  • 980 గ్రాముల బంగారం,9.5కిలోల వెండి రూ.10 వేల డబ్బు స్వాధీనం

‘క్యాలెండర్ లో పెళ్లి ముహూర్తాలున్న రోజులను ఎంచుకుని చోరీలు చేశారు. శివారు ప్రాంతాలను టార్గెట్ చేసి వరుస చోరీలు చేసి జైలుకెళ్లారు. అక్కడి నుంచి విడుదలయ్యాక కూడా మళ్లీ దోపిడీలకు ప్లాన్ వేశారు. ఇప్పటివరకు వందకు పైగా దొంగతనాలు చేసిన ఈ ముఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నారు.

హైదరాబాద్,వెలుగు: తెలుగు రాష్ట్రాల్లో వరుస చోరీలు చేస్తూ తప్పించుకు తిరుగుతున్న దొంగలు నాగసాయి(28) మంచెం శ్రీనివాస్(28)తో పాటు రిసీవర్ కంచ నరేశ్(29) ను రాచకొండ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.28.13లక్షల విలువ చేసే 980 గ్రాముల బంగారం, 9.5 కిలోల వెండి,రూ.10వేల డబ్బు, యమహా బైక్ స్వాధీనం చేస్తున్నారు. ఈ రాబరీ గ్యాంగ్ వివరాలను నేరేడ్ మెట్ కమిషనరేట్ లో  రాచకొండ సీపీ మహేశ్ భగవత్ శుక్రవారం వెల్లడించారు.

11 ఏళ్లలో 98 దొంగతనాలు

బుల నాగసాయి అలియాస్ సాయి,అనిల్, అజయ్, కృష్ణ(28) సొంతూరు ఏపీ గాజువాకలోని సింగరేణి కాలనీ. నాగసాయి ప్రస్తుతం జీడిమెట్ల రాజీవ్ గృహకల్పలో  ఉంటున్నాడు. ఇంటర్ వరకు చదివిన నాగసాయి 17 ఏళ్ళకే హోమ్ థియేటర్ దొంగిలించి అరెస్ట్ అయ్యాడు. జూవెనల్ హోమ్ లో కొంతకాలం గడిపాడు. అక్కడి నుంచి విడుదలైన తర్వాత నాగసాయి హైదరాబాద్ కి మకాం మార్చాడు. చర్లపల్లిలోని హెచ్.పి గోదాంలో 3 నెలల పాటు పనిచేసి తిరిగి గాజువాక వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మళ్ళీ వరుస చోరీలు చేస్తూ పోలీస్ రికార్డుల్లోకి ఎక్కాడు. గాజువాక పరిసర ప్రాంతాలతో పాటు వైజాగ్ లో నాగసాయి 90కి పైగా చోరీలు చేశాడు. వీటిలో 15 కేసుల్లో శిక్షను అనుభవించాడు.ఈ ఏడాది మే 12న ఏలూరు జిల్లా జైలు నుంచి విడుదల అయ్యాడు.

కొట్టేసిన బైక్​లపై రెక్కీ

జైలులో శిక్ష అనుభవిస్తు్న్న సమయంలో మరో దొంగ మంచెం శ్రీనివాస్(28)తో  నాగసాయికి దోస్తానీ ఏర్పడింది. పశ్చిమ గోదావరి జిల్లా దొడ్డిపట్లకు చెందిన శ్రీనివాస్  కూడ నాగసాయితో కలిసి రాజీవ్ గృహకల్పలో ఉంటున్నాడు. శ్రీనివాస్ కూడా వరుస చోరీలు చేసి పోలీసులకు చిక్కాడు. ఏపీ,తెలంగాణలో ఇతడిపై 20కి పైగా కేసులు ఉన్నాయి. గతంలో పోలీసులకు చిక్కిన శ్రీనివాస్ ఈ ఏడాది ఏప్రిల్ లో పెద్దాపురం సబ్ జైలు నుంచి విడుదల అయ్యాడు. ఆ తర్వాత నాగసాయి, శ్రీనివాస్ ఇద్దరూ కలిసి వరుస చోరీలకు ప్లాన్ వేశారు. రాజమండ్రిలో దొంగిలించిన యమహా బైక్ పై రెక్కీ వేస్తూ హైదరాబాద్ సహా ఏపీలోని సిటీలను టార్గెట్ చేసి 8 చోరీలు చేశారు. పెళ్లిళ్లు ఎక్కువగా ఉండే రోజులను ఎంచుకుని.. శివారు ప్రాంతాల్లోని కాలనీల్లో వరుస దోపిడీలకు ఈ ముఠా ప్లాన్ చేసింది. ఐరన్ రాడ్,స్క్రూ డ్రైవర్,కటింగ్ ప్లేయర్ ను చోరీలకు ఉపయోగించేవారు. నాగసాయి దోపిడీ చేయాలనుకున్న ఇంట్లోకి ప్రవేశించి అందినకాడికి దోచుకునేవాడు. శ్రీనివాస్ ఆ ఇంటి బయట కాపలా ఉండి..నాగసాయిని అలర్ట్ చేసేవాడు.

ఇలా దొరికారు

ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో హైదరాబాద్ శివారు ప్రాంతాలను టార్గెట్ చేసిన నాగసాయి, శ్రీనివాస్..  దొంగిలించిన బైక్ పై రెక్కీ వేసి వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 4 చోరీలు చేశారు. దీంతో పాటు ఒంగోలు, నర్సాపురం,రాజమండ్రిలో వరుస చోరీలు చేశారు. దొంగిలించిన బంగారం,వెండిని చాంద్రాయణ గుట్ట కుమ్మర బస్తీకి చెందిన కంచ నరేశ్​(29)కి  అమ్మి సొమ్ము చేసుకునేవారు. వనస్థలిపురంలో జరిగిన వరుస చోరీలతో ఈ ముఠా కదలికలపై రాచకొండ స్పెషల్ ఆపరేషన్ టీమ్ నిఘా పెట్టింది. ఎస్ వోటీ డీసీపీ సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలోని ఎస్సైలు రవికుమార్, ఏఏ రాజు, వనస్థలిపురం డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్ జి.జగన్నాథ్​ టీమ్ తనిఖీలు చేపట్టింది. వనస్థలిపురంలోన అనుమానాస్పదంగా తిరుగుతున్న నాగసాయి, శ్రీనివాస్ ను శుక్రవారం పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో రిసీవర్ నరేశ్​ను చాంద్రాయణగుట్టలో అరెస్టు చేసినట్టు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ చెప్పారు.