మా దేశ మైనింగ్లో పెట్టుబడులు పెట్టండి..సింగరేణి సంస్థకు ఘనా దేశం ఆహ్వానం

మా దేశ మైనింగ్లో పెట్టుబడులు పెట్టండి..సింగరేణి సంస్థకు ఘనా దేశం ఆహ్వానం
  • సీఎండీతో ఆ దేశ ప్రతినిధుల భేటీ
  • కీలక ఖనిజాల్లో భాగస్వామ్యంపై ప్రకటన  
  • సింగరేణి విస్తరణకు ఇది శుభారంభం: సీఎండీ బలరామ్  

హైదరాబాద్, వెలుగు: వజ్రాలు, బంగారం, బాక్సైట్, మాంగనీస్, లిథియం ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందిన ఘనా దేశం సింగరేణి సంస్థను తమ దేశ ఖనిజ రంగంలో పెట్టుబడులకు ఆహ్వానించింది. శనివారం హైదరాబాద్‌‌లోని సింగరేణి భవన్‌‌లో ఘనా ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం సీఎండీ ఎన్‌‌ బలరామ్‌‌తో చర్చలు జరిపింది. ఈ సందర్భంగా ఘనా ప్రతినిధులు మాట్లాడుతూ.. తమ దేశంలో ఖనిజ తవ్వకాలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని, విదేశాలకు ఎగుమతులు చేస్తున్నామని తెలిపారు. 

ఉత్పత్తి పెంచేందుకు పెట్టుబడులు అవసరమని, మైనింగ్‌‌లో అనుభవం ఉన్న సింగరేణిని ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. బొగ్గు గనుల్లోనూ సహకరించాలని కోరారు. సీఎండీ బలరామ్‌‌ స్పందిస్తూ.. విదేశాల్లోని ఖనిజ రంగంలో ప్రవేశించేందుకు సంస్థ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నదని, ఘనా అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. కీలక ఖనిజాలకు ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. మరో నెలలో ఘనా సాంకేతిక బృందం కేంద్ర ప్రభుత్వంతో సమావేశమైన తర్వాత మరోసారి చర్చలు జరపాలని, సింగరేణి బృందాన్ని ఘనాకు పంపాలని ప్రతినిధులు కోరారు. 

దీనికి బలరామ్‌‌ సానుకూలంగా స్పందించి అధికారుల బృందాన్ని పంపుతామని హామీ ఇచ్చారు. సమావేశంలో డైరెక్టర్లు వెంకటేశ్వర్లు, గౌతమ్‌‌ పొట్రు, జీఎంటీ. శ్రీనివాస్‌‌, ఘనా తరఫున అబ్దుల్‌‌ సలాం మోర్గాన్‌‌ అగ్బోటు, మాలి రాయబారి అహ్మద్‌‌ ఉమర్‌‌ సాండా, మైకేల్‌‌ మహామ, మొగ్తారి హుడు, అగ్రే ఎలిషమా ఫ్రెడరిక్‌‌, అంగా మ్వైన్‌‌ సైతాసలిఫు, అగ్బెంకోర్‌‌ ఎడ్నా ఈడెం, పరుల్‌‌ కక్కర్‌‌ తదితరులు పాల్గొన్నారు.