సెమీస్‌‌లోకి అడుగు పెట్టిన నడాల్‌‌

సెమీస్‌‌లోకి  అడుగు పెట్టిన నడాల్‌‌

వింబుల్డన్‌‌ (ఇంగ్లండ్‌‌): ఆద్యంతం ఆధిపత్యం చేతులు మారుతూ వచ్చిన మ్యాచ్‌‌లో స్పెయిన్‌‌ స్టార్‌‌, వరల్డ్‌‌ నాలుగో ర్యాంకర్‌‌ రఫెల్‌‌ నడాల్‌‌ శ్రమించి విజయం సాధించాడు. ప్రత్యర్థి తనకంటే చిన్నవాడే అయినా.. ఐదు సెట్ల మ్యాచ్‌‌లో పెద్ద పోరాటమే చేశాడు. ఫలితంగా బుధవారం జరిగిన మెన్స్‌‌ సింగిల్స్‌‌ క్వార్టర్‌‌ఫైనల్లో రెండోసీడ్‌‌ నడాల్‌‌ 3–6, 7–5, 3–6, 7–5, 7–6 (10/4)తో 11వ సీడ్‌‌ టేలర్‌‌ ఫ్రిట్జ్‌‌ (అమెరికా)పై నెగ్గి సెమీస్‌‌లోకి ప్రవేశించాడు. 4 గంటలా 20 నిమిషాల పాటు జరిగిన మ్యాచ్‌‌లో ఫ్రిట్జ్‌‌.. నడాల్‌‌ను వణికించాడు. ఇద్దరు చెరో సెట్​ నెగ్గుతూ వెళ్లారు.ఐదో సెట్‌‌ టైబ్రేక్‌‌కు దారి తీసింది. కీలకమైన టైబ్రేక్‌‌లో నడాల్‌‌ సర్వీస్‌‌లకు ఫ్రిట్జ్‌‌ సరైన బదులు ఇవ్వలేకపోయాడు. బ్యాక్‌‌లైన్‌‌ ఆటతో పాటు డ్రాప్‌‌ షాట్స్‌‌లోనూ జోరు కొనసాగించిన స్పెయిన్‌‌ ప్లేయర్‌‌ మ్యాచ్‌‌ను చేజిక్కించుకున్నాడు. మ్యాచ్‌‌ మొత్తంలో ఫ్రిట్జ్‌‌ 19, నడాల్‌‌ 5 ఏస్‌‌లు సంధించారు. మరో మ్యాచ్‌‌లో కిరియోస్‌‌ (ఆస్ట్రేలియా) 6–4, 6–3, 7–6 (5)తో క్రిస్టియాన్‌‌ గారిన్‌‌ (చిలీ)పై నెగ్గాడు.  విమెన్స్‌‌ సింగిల్స్‌‌ క్వార్టర్‌‌ఫైనల్లో సిమోనా హలెప్‌‌ (రొమేనియా) 6–2, 6–4తో అలవోకగా అమండా అనిసిమోవా (అమెరికా)పై గెలిచింది. మూడేళ్ల కిందట ఇదే వేదికపై విజేతగా నిలిచిన హలెప్‌‌.. గత రెండేళ్లుగా టోర్నీలో ఆడలేదు. 2020లో కరోనాతో టోర్నీ జరగకపోయినా, 2021లో కాలిపిక్క గాయంతో హాలెప్‌‌ టోర్నీకి దూరమైంది. మరో మ్యాచ్‌‌లో రెబాకినా (కజకిస్తాన్‌‌) 4–6, 6–2, 6–3తో టొమల్జోనోవిచ్‌‌ (ఆస్ట్రేలియా)పై నెగ్గి సెమీస్‌‌లోకి అడుగుపెట్టింది.