రెండో రౌండ్‌లో ఫొగ్నినిపై నడాల్‌‌ గెలుపు

రెండో రౌండ్‌లో ఫొగ్నినిపై నడాల్‌‌ గెలుపు

 

  • రాకెట్‌ తగిలి ముక్కుకు గాయం
  • రక్తం వచ్చినా ఆట కొనసాగింపు
  •  మూడో రౌండ్​లో రబ్లెవ్​, సబలెంకా

న్యూయార్క్‌‌‌‌: అనుకోకుండా తనను తాను గాయపరుచుకొని స్టేడియంలో రక్తం చిందించినప్పటికీ యూఎస్‌‌ ఓపెన్‌‌లో స్పెయిన్‌‌ టెన్నిస్‌‌ లెజెండ్‌‌ రఫెల్‌‌ నడాల్‌‌ మూడో రౌండ్‌‌కు దూసుకెళ్లాడు. శుక్రవారం జరిగిన మెన్స్‌‌ సింగిల్స్‌‌ రెండో రౌండ్‌‌లో నడాల్‌‌ 2–6, 6–4, 6–2, 6–1తో ఫాబియో ఫోగ్నిని (ఇటలీ)పై నాలుగు సెట్లలో విజయం సాధించాడు. దాంతో, ఈ ఏడాది గ్రాండ్‌‌స్లామ్‌‌ టోర్నీల్లో విజయాల రికార్డును 21–0కి పెంచుకున్నాడు. తాజా టోర్నీలో  నెగ్గి తన గ్రాండ్‌‌స్లామ్స్‌‌ సంఖ్యను 23కి పెంచుకోవాలని చూస్తున్నాడు. మరోవైపు పోలాండ్‌‌ స్టార్‌‌ హుబర్ట్‌‌ హర్కాజ్‌‌ రెండో రౌండ్‌‌లోనే ఇంటిదారి పట్టాడు. ఎనిమిదో సీడ్‌‌ హర్కాజ్‌‌ 4–6, 6–4, 5–7 (5/7), 3–6తో ఇల్య ఇవష్క (బెలారస్) చేతిలో కంగుతిన్నాడు. తొమ్మిదో సీడ్‌‌ ఆండ్రీ రబ్లెవ్‌‌ (రష్యా)  6–3, 6–0, 6–4తో సూన్‌‌ వూ (సౌత్‌‌ కొరియా)ను చిత్తు చేశాడు. 14వ సీడ్‌‌ ష్వార్జ్‌‌మన్​, 19వ సీడ్‌‌ డెనిస్‌‌ షపవలోవ్‌‌ కూడా మూడో రౌండ్‌‌ చేరుకున్నారు. ఇక, విమెన్స్‌‌ సింగిల్స్‌‌ రెండో రౌండ్‌‌లో ఆరో సీడ్‌‌ సబలెంకా (బెలారస్‌‌) 2–6, 7–6 (10/8), 6–4తో కయా కనెపి (ఇస్తోనియా)పై గెలిచింది.  తొమ్మిదో సీడ్‌‌  గార్బిన్‌‌ ముగురుజా (స్పెయిన్‌‌) 6–0, 6–4తో లిండా ఫ్రువిట్టోవాను చిత్తు చేయగా.. 22వ సీడ్‌‌ కరోలినా ప్లిస్కోవా (చెక్‌‌) 6–3, 6–2తో బౌజ్కోవా (చెక్‌‌)ను ఓడించి మూడో రౌండ్‌‌ చేరింది. 

బోపన్న జోడీ ఓటమి
మిక్స్‌‌డ్‌‌ డబుల్స్‌‌లో ఇండియా స్టార్‌‌ రోహన్‌‌ బోపన్నకు తొలి రౌండ్‌‌లోనే చుక్కెదురైంది. ఆరో సీడ్‌‌ బోపన్న–యాంగ్‌‌ జవొగ్జువన్‌‌ (చైనా) జంట 5–7, 5–7తో మ్యాక్స్‌‌ పర్సెల్‌‌ (ఆస్ట్రేలియా)–దబ్రౌస్కీ (కెనడా) ద్వయం చేతిలో పోరాడి ఓడింది. కాగా, విమెన్స్‌‌ డబుల్స్‌‌లో సెరెనా విలియమ్స్‌‌–వీనస్‌‌ విలియమ్స్‌‌ జోడీ తొలి రౌండ్‌‌లోనే ఓడింది. 

కంగారు పెట్టిన రఫా
ఈ మ్యాచ్​ లో నడాల్‌‌ తొలి సెట్‌‌ కోల్పోయినా వెంటనే పుంజుకొని తర్వాతి రెండు సెట్లు గెలిచాడు. అయితే, నాలుగో సెట్‌‌లో 3–0తో నిలిచి గేమ్‌‌ పాయింట్‌‌ కోసం సర్వ్‌‌ చేసిన టైమ్‌‌లో అనూహ్య సంఘటన జరిగింది. ఫోగ్నిని షాట్‌‌ను  కుడివైపునకు వంగి బ్యాక్‌‌ హ్యాండ్‌‌తో రిటర్న్‌‌ చేస్తుండగా అతని రాకెట్‌‌ గ్రౌండ్‌‌కు తగిలి బౌన్స్‌‌ అయి ముక్కుకు బలంగా తాకింది. ముక్కు పై భాగంలో చీలిక ఏర్పడి రక్తం వచ్చింది. వెంటనే రాకెట్‌‌ పడేసి సైడ్‌‌లైన్‌‌కు వెళ్లిపోయిన నడాల్‌‌ కండ్లు తిరగడంతో కాసేపు కింద పడుకుండిపోయాడు. దాంతో, స్టేడియంలోని ఫ్యాన్స్‌‌ అంతా కంగారు పడ్డారు. కాసేపటికి డాక్టర్‌‌ వచ్చి ముక్కుపై బ్యాండేజ్‌‌ వేశాడు. ఐదు నిమిషాల తర్వాత ఆట కొనసాగించిన రఫెల్‌‌ మ్యాచ్‌‌ గెలిచాడు. రాకెట్‌‌ గట్టిగా తగలడంతో ముక్కు విరిగిపోయిందని అనుకున్నానని మ్యాచ్‌‌ తర్వాత నడాల్‌‌ చెప్పాడు. 

బెలారస్‌‌‌‌‌‌ స్టార్ అజరెంకాతో షేక్‌‌‌‌హ్యాండ్‌‌‌‌కు ఉక్రెయిన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ నో
సాఫీగా సాగుతున్న యూఎస్‌‌‌‌ ఓపెన్‌‌‌‌లో ఉక్రెయిన్‌‌‌‌–రష్యా యుద్ధం చర్చకు వచ్చింది. బెలారస్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ విక్టోరియా అజరెంకాకు షేక్‌‌‌‌ హ్యాండ్‌‌‌‌ ఇచ్చేందుకు ఉక్రెయిన్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ కొస్త్యుక్‌‌‌‌ నిరాకరించడం చర్చనీయాంశమైంది. గురువారం జరిగిన రెండో రౌండ్​లో అజరెంకా 6–2, 6–3తో కొస్త్యుక్​ను ఓడించింది. ఆనవాయితీగా ప్రత్యర్థితో  కరచాలనం చేసేందుకు అజరెంకా ముందుకొచ్చింది. కానీ, కొస్త్యుక్​ చేయి ఇవ్వకుండా తన రాకెట్ తో అజరెంకా రాకెట్‌‌‌‌ను టాప్‌‌‌‌ చేసింది. ఉక్రెయిన్​పై యుద్ధాన్ని,  బెలారస్​ ప్రభుత్వ చర్యలను ఆ దేశానికి చెందిన ప్లేయర్లెవ్వరూ ఖండించడం లేదని, అందుకే షేక్​ హ్యాండ్​ ఇవ్వలేదని కొస్త్యుక్‌‌‌‌ చెప్పింది.