బాసర ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్ కలకలం

బాసర ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్ కలకలం

నిర్మల్‌ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ మరోమారు వార్తల్లో నిలిచింది. మొన్నటి వరకూ  వసతులు సరిగ్గా లేవంటూ కొన్నిరోజులు పాటు విద్యార్థులు ఆందోళన చేయగా.. తాజాగా బాసర ట్రిపుల్ ఐటీలో ర్యాగింగ్ కలకలం సృష్టిస్తోంది. యూనివర్సిటీలోని యూపీసీ మొదటి సంవత్సరం విద్యార్థులను రెండో సంవత్సరం విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. గత మూడు రోజులుగా జూనియర్లను సీనియర్లు వేధిస్తున్నారని పీఎస్ లో డీన్ ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేసిన బాసర పోలీసులు.. ఐదుగురు సీనియర్ విద్యార్థులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ర్యాగింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ర్యాగింగ్ కు యూనివర్సిటీలో అవకాశమే లేదని ఇంచార్జ్ వీసీ వెంకటరమణ హెచ్చరించారు. 

బాసర ట్రిపుల్ ఐటీ గురించి ఏ వార్త వచ్చినా ఇటీవల చర్చనీయాంశంగా మారుతోంది. ఆ మధ్య ఫెసిలిటీస్ సరిగా లేవని, ఫుడ్ సరిగ్గా పెట్టడం లేదని విద్యార్థులు ఆరోపించారు. అంతకు ముందు కళాశాలలో సిబ్బంది కొరతపైనా పలుమార్లు నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడేమో ర్యాగింగ్. చిలికి చిలికి గాలివానగా మారిన రాగింగ్‌ కాస్త ఇరువర్గాలు మధ్య వాగ్వివాదంగా తలెత్తి అనంతరం గొడవకు దారి తీసింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది.