
రాఘవ లారెన్స్ హీరోగా కతిరేసన్ రూపొందించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘రుద్రుడు’. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్. ఠాగూర్ మధు తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నారు. ఈ నెల 14న సినిమా విడుదలవుతున్న సందర్భంగా రాఘవ లారెన్స్ ఇలా ముచ్చటించారు.
- ఇదొక మదర్ సెంటిమెంట్ మూవీ. నా ప్రతి సినిమాలో ఉన్నట్టుగానే ఇందులోనూ అమ్మా నాన్నల గురించి ఓ మంచి మెసేజ్ ఉంది. అలాగే యాక్షన్, కామెడీ, ఫన్, రొమాన్స్ లాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. క్లాస్, మాస్, ఫ్యామిలీస్‌ను అలరించే కంటెంట్ బేస్డ్ సినిమా ఇది. అమ్మని ఇష్టపడే వాళ్ళంతా ‘రుద్రుడు’ని ఇష్టపడతారు.
- ఎవరో కావాలని క్రియేట్ చేసిన సమస్య నుండి బయటపడేందుకు ఓ కామన్ మ్యాన్ ఎదురు తిరిగితే ఎలా ఉంటుందనేదే ‘రుద్రుడు’. ఐటీ ఉద్యోగం చేసుకునే మిడిల్ క్లాస్ కుర్రాడిని పరిస్థితులు ఎలా మాస్‌గా మార్చాయనేది ఆసక్తికరంగా ఉంటుంది. మాస్ అంటే ఎమోషన్. ఎమోషన్ ఉంటేనే మాస్ వస్తుంది. ఇందులోని ఎమోషన్‌ని నమ్ముతున్నా. ఇది వందశాతం రీచ్ అవుతుంది.
- నన్ను కొత్తగా చూపించాలనే దర్శకుడు కతిరేసన్ తపన నచ్చింది. ఇందులో హీరోయిన్ ప్రియా భవాని శంకర్ క్యారెక్టర్‌కు కూడా సెంటిమెంట్ టచ్ ఉంటుంది. ఆమె ఈ సినిమాకు చాలా ప్లస్. ఇక నా పాత్ర ఎంత పవర్ ఫుల్‌గా వుంటుందో.. శరత్ కుమార్ గారి పాత్ర కూడా అంతే పవర్ ఫుల్‌గా వుంటుంది.
- ‘అఖండ’ ఫైట్స్ నచ్చి శివ మాస్టర్‌ని తీసుకున్నాం. కథకు తగ్గట్టుగా యాక్షన్ సీన్స్ డిజైన్ చేశారు. జీవీ ప్రకాష్ కుమార్‌తో పనిచేయడం ఇదే ఫస్ట్ టైమ్. చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అలాగే సామ్ సి.ఎస్ అద్భుతంగా బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. మధు గారు నాకు లక్కీ ప్రొడ్యూసర్. నా మీద ఆయనకి చాలా నమ్మకం. ఆ నమ్మకాన్ని ఈ చిత్రం మరోసారి నిలబెట్టుకుంటుంది.
- ఓ వైపు సినిమాలు, మరోవైపు సేవా కార్యక్రమాలు.. రెండింటినీ బ్యాలెన్స్ చేయడం కష్టమే. కానీ అలవాటైపోయింది. షూటింగ్‌లో ఎంత బిజీగా ఉన్నా, హాస్పిటల్‌లో పిల్లల ఆపరేషన్స్ సక్సెస్ అయ్యి తిరిగివచ్చేవరకూ టెన్షన్‌లోనే వుంటాను. దాదాపు 150 ఆపరేషన్స్ చేయించా. అందరూ ఆరోగ్యంగా వున్నారు. పిల్లల తల్లితండ్రుల కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు చాలా సంతోషంగా వుంటుంది. సినిమా హీరోగా కంటే.. రియల్ లైఫ్‌లో హీరోగా ఉండాలనేది నా కోరిక. అది దేవుడు నాకు ఇచ్చిన వరం.
- ప్రస్తుతం చంద్రముఖి 2, జిగర్తండా 2 చిత్రాల్లో నటిస్తున్నా. అలాగే లోకేష్ కనకరాజ్ కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ నిర్మిస్తున్న ఓ చిత్రం ఉండబోతోంది.