సంగీత దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన రఘు కుంచె, నటుడిగా తనలోని మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ చేసిన లేటెస్ట్ మూవీ ‘గేదెల రాజు’. చైతన్య మోటూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, టైటిల్ నుండే ఆసక్తిని రేకెత్తించింది. ‘‘చూస్తే ఒకటే నిజం.. చూడకపోతే వంద అనుమానాలు’’ అనే ట్యాగ్‌లైన్‌కు తగ్గట్టుగానే, ఒక మర్డర్ మిస్టరీతో మూవీ రూపొందింది. టీజర్, ట్రైలర్తో అంచనాలు పెంచిన మూవీ ఎలా ఉంది? ప్రేక్షకులకు థ్రిల్ ఇచ్చిందా? లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
స్టోరీ బ్యాక్డ్రాప్..
కాకినాడ కేంద్రంగా సాగే ఈ కథలో గేదెల రాజు (రఘు కుంచె) ఒక పవర్‌ఫుల్ రౌడీ షీటర్. కేవలం సెటిల్‌మెంట్లకే పరిమితం కాకుండా, కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసి రాజకీయాల్లో చక్రం తిప్పాలని కలలు కంటాడు. అతనికి స్థానిక ఎమ్మెల్యే అండదండలు కూడా తోడవుతాయి. అయితే అదే టికెట్‌ను ఆశిస్తున్న దుర్గ (శ్రీకాంత్ అయ్యంగార్), రాజుకు ప్రధాన శత్రువుగా మారతాడు. వీరి మధ్య రాజకీయ పోరు నడుస్తుండగానే, ఒక రాత్రి గేదెల రాజు దారుణంగా హత్యకు గురవుతాడు.
ఈ మర్డర్ కేసును ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులకు సవాలక్ష ప్రశ్నలు ఎదురవుతాయి. దుర్గ మీద అనుమానం ఉన్నా, ఆధారాలు దొరకవు. మరోవైపు రాజు తమ్ముడు శ్యాంబాబు ప్రవర్తన కూడా అనుమానాస్పదంగానే ఉంటుంది. అసలు రాజును చంపింది ఎవరు? ఈ కథలోకి రిచ్-మీరా, విజయ్-సత్య అనే జంటలు ఎలా వచ్చారు? వీరందరికీ రాజు హత్యతో ఉన్న లింక్ ఏంటి? అనే ఉత్కంఠభరిత అంశాలతో సినిమా సాగుతుంది.
రఘు కుంచె విశ్వరూపం..
ఈ సినిమాకు అసలైన బలం, ప్రాణం రఘు కుంచె. ఒక రౌడీ షీటర్‌గా ఆయన మేకోవర్, బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా గోదావరి యాసలో ఆయన పలికించిన డైలాగులు థియేటర్లో ఈలలు వేయిస్తాయి. ఒక వైపు కరుడుగట్టిన రౌడీగా కనిపిస్తూనే, మరోవైపు రాజకీయ ఆకాంక్షలు ఉన్న వ్యక్తిగా ఆయన చూపిన హావభావాలు సినిమాను నిలబెట్టాయి. రఘు కుంచె కెరీర్‌లో ఇది ఒక బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పవచ్చు.
ఇక ఇతర నటీనటుల్లో వికాస్, రామచంద్రం, టీనా శ్రావ్య తమ పాత్రలకు న్యాయం చేశారు. శ్రీకాంత్ అయ్యంగార్ తన మార్కు నటనతో ఆకట్టుకోగా, శివయ్య పాత్రలో రవి ఆనంద్ సర్ప్రైజ్ చేశారు.
దర్శకత్వ ప్రతిభ – టెక్నికల్ వాల్యూస్
దర్శకుడు చైతన్య మోటూరి ఎంచుకున్న నాన్-లీనియర్ స్క్రీన్ ప్లే సినిమాకు మెయిన్ హైలైట్. కథను నేరుగా చెప్పకుండా, పజిల్‌లా పేర్చుకుంటూ వెళ్లడం వల్ల ప్రేక్షకుడు ఎక్కడా బోర్ ఫీలవ్వడు. ముఖ్యంగా ద్వితీయార్థంలో మహాభారతంలోని ‘కణిక నీతి’ని ప్రస్తుత రాజకీయ క్రైమ్ ప్లాట్‌కు అనువదించిన తీరు మెచ్చుకోదగ్గది.
రఘు కుంచె స్వయంగా అందించిన నేపథ్య సంగీతం (BGM) సినిమాలోని సస్పెన్స్‌ను రెట్టింపు చేసింది. సీన్ మూడ్‌ను ఎలివేట్ చేయడంలో మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది. సినిమాటోగ్రఫీ కాకినాడ పరిసరాలను, నైట్ షాట్స్‌ను సహజంగా బంధించింది. ఎడిటింగ్ క్రిస్పీగా ఉండటం వల్ల కథనం వేగంగా సాగింది.
విశ్లేషణ..
సినిమాలో అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు నెమ్మదించినట్లు అనిపించినా, క్లైమాక్స్‌లో వచ్చే అన్-ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్ వాటన్నింటినీ మర్చిపోయేలా చేస్తుంది. రెగ్యులర్ క్రైమ్ డ్రామాల్లా కాకుండా, హంతకుడు ఎవరనే విషయాన్ని చివరి నిమిషం వరకు సస్పెన్స్‌గా ఉంచడంలో చిత్ర యూనిట్ విజయం సాధించింది. 'గేదెల రాజు' కేవలం ఒక మర్డర్ మిస్టరీ మాత్రమే కాదు, రఘు కుంచెలోని పరిపూర్ణ నటుడిని పరిచయం చేసే చిత్రం. సస్పెన్స్ థ్రిల్లర్లను ఇష్టపడే వారికి ఈ వీకెండ్‌లో ఇదొక బెస్ట్ ఛాయిస్.

