మామ అల్లుడు మెదక్ కు చేసిందేమీ లేదు : రఘునందన్ రావు

మామ అల్లుడు మెదక్ కు చేసిందేమీ లేదు : రఘునందన్ రావు

నర్సాపూర్, వెలుగు: మామ అల్లుడు మెదక్ జిల్లాకు చేసిందేమీ లేదని మాజీ ఎమ్మెల్యే బీజేపీ నాయకుడు రఘునందన్ రావు విమర్శించారు. ఆదివారం నర్సాపూర్ పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రతినిధి రాణీరుద్రమదేవి తో కలిసి ఆయన మాట్లాడారు. పేదలకు ఇచ్చే డబుల్ బెడ్ రూమ్స్​ కంప్లీట్ కాలేదు గానీ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ఆరు నెలల్లో పూర్తి చేసుకున్నారని విమర్శించారు.

పీఎం మోదీ చేస్తున్న అభివృద్ధిని చూసి బీజేపీకి ఓటేయాలని ప్రజలు డిసైడ్ అయ్యారన్నారు.  అది చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్​, బీజేపీ ఒక్కటేనని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ17 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేస్తుందని, మెదక్ ఎంపీ సీటు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మురళీ యాదవ్, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లేశ్ గౌడ్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు రమేశ్ గౌడ్, కౌన్సిల్ మెంబర్ రాజేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సురేశ్, బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ పాల్గొన్నారు.

గిరిజనులను గుర్తించిన ఏకైక పార్టీ బీజేపీయే

శివ్వంపేట: దేశంలో గిరిజనులను గుర్తించిన ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్​రావు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న విజయ్​సంకల్ప యాత్రలో భాగంగా జిల్లాలోని శివ్వంపేట మండలం చిన్న గొట్టిముక్కుల గ్రామ పరిధిలో ఉన్న చాకరిమెట్ల ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రఘునందన్ రావు మాట్లాడుతూ.. గిరిజన మహిళ ద్రౌపది ముర్మును  రాష్ట్రపతిని చేసిన ఘనత బీజేపీకే దక్కుతుందన్నారు. కమలం గుర్తుకు ఓటు వేసి మూడోసారి నరేంద్ర మోదీని ప్రధానమంత్రి చేయాలని గిరిజనులకు పిలుపునిచ్చారు.