ఎఫ్ఆర్వో హత్యకు కేసీఆర్​ తీరే కారణం: రఘునందన్​రావు

ఎఫ్ఆర్వో హత్యకు కేసీఆర్​ తీరే కారణం: రఘునందన్​రావు
  •     కేసీఆర్​ తీరే ఎఫ్ఆర్వో హత్యకు కారణం.. దాడులు ఎందుకు జరుగుతున్నాయో ఆలోచించాలి
  •     చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం కరెక్ట్​ కాదు: రఘునందన్​రావు

హైదరాబాద్, వెలుగు: పోడు భూములకు పట్టాలిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్​ మాట తప్పారని, అందువల్లే పోడు  లొల్లులు జరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్​రావు ఫైర్​ అయ్యారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్​ శ్రీనివాసరావు హత్య దారుణమని, దీనిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని అన్నారు. గొత్తికోయలకు, ఆదివాసీలకు పోడు భూముల్లో పట్టాలివ్వకపోవడం అన్యాయమేనని, అలా అని చెప్పి వారు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇలాంటి దాడులకు పాల్పడడం కూడా సరైనది కాదని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలకు సీఎం కేసీఆరే కారణమని అన్నారు. సంవత్సర కాలంగా ఇలాంటి దాడులు ఎందుకు జరుగుతున్నాయో ఒకసారి ఆలోచించుకోవాలని సూచించారు. బుధవారం బీజేపీ  స్టేట్ ఆఫీసులో రఘునందన్ రావు  మీడియాతో మాట్లాడారు. 

మల్లారెడ్డి ​ఫోన్​ను డస్ట్​బిన్​లో దాసుడేంది?

మంత్రి మల్లారెడ్డిపై జరుగుతున్న ఐటీ దాడుల విషయంలో రాజకీయ విమర్శలు చేయడం సరైంది కాదని రఘునందన్​రావు అన్నారు. పదవులను అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేస్తూ పన్ను ఎగవేసే ప్రజా ప్రతినిధులపైనే ఐటీ దాడులు జరుగుతాయనే విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. ‘‘మంత్రి మల్లారెడ్డి నిజాయితీగా పన్నులు చెల్లించినట్లయితే ఆయన సెల్ ఫోన్​ను డస్ట్ బిన్​లో దాయడం ఏమిటి? ఫైళ్లను పక్కింట్లోకి తరలించడం ఏమిటి? గంగుల, మల్లారెడ్డిపైనే ఐటీ దాడులు జరిగాయి. అదే టీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు మాణిక్ రెడ్డి, రసమయి బాలకిషన్, పద్మా దేవేందర్ రెడ్డి, క్రాంతి కిరణ్​పై జరగడం లేదు కదా? ఐటీ దాడులు పన్ను ఎగవేతదారులపైనే జరుగుతాయనే విషయం గుర్తుంచుకోవాలి” అని అన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి కూడా తనపై ఐటీ దాడులు జరగొచ్చనే అనుమానాన్ని వ్యక్తం చేయడంపై రఘునందన్ స్పందిస్తూ.. ‘‘ఆయనకు ఉన్న పది కాలేజీల్లో కొన్ని  కాలేజీలకు సంబంధించిన పన్నులు చెల్లించకపోవచ్చు. వైట్ మనీ కాకుండా బ్లాక్ మనీ ఉంటే దాడులు జరుగవా?” అని ప్రశ్నించారు. బీజేపీ జాతీయ నేత బీఎల్ సంతోష్ నోటీసుల కేసు కోర్టులో ఉన్నందున తాను ఒక అడ్వకేట్​గా దానిపై వ్యాఖ్యానించడం సరైంది కాదని ఆయన అన్నారు.

దుబ్బాకపై రాష్ట్ర సర్కార్​ వివక్ష

దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి వివక్షను చూపుతున్నదని స్థానిక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మండిపడ్డారు. ఇంతటి వివక్షను ఆంధ్ర పాలకుల హయాంలో కూడా ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు, తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు ఎదుర్కోలేదని సీఎం కేసీఆర్​కు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఖర్చు చేయాల్సిన నియోజకవర్గ అభివృద్ధి నిధులను జిల్లా మంత్రి ఖర్చు చేయడం ఏమిటని అందులో ప్రశ్నించారు. ఇది దుబ్బాక ప్రజలను అవమానించడమేనని అన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేను అయినందుకు తనపై ఇంత కక్ష సాధింపు చర్యలేమిటని ఫైర్ అయ్యారు. ఇది రాజ్యాంగాన్ని కాలరాయడమేనని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని దుయ్యబట్టారు. వారం రోజుల్లో దీనిపై కేసీఆర్ స్పందిస్తారని ఆశిస్తున్నానని, ఒకవేళ సీఎం నుంచి సానుకూలత రాని పక్షంలో ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటానని మీడియా సమావేశంలో రఘునందన్​ తెలిపారు.

‘‘నా నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఎమ్మెల్యేగా నేను ఖర్చు చేయాల్సి ఉండగా, వాటిని జిల్లా మంత్రి.. ఇతర ప్రజాప్రతినిధుల ద్వారా ఖర్చు చేయించి నాపై పెత్తనం చెలాయించడం ఏమిటి? దుబ్బాక నియోజకవర్గం సీఎం జిల్లాలో లేదా? ఈ నియోజకవర్గ అభివృద్ధి నిధులను ఖర్చు చేసే అధికారం నాకు లేకుండా, జిల్లా మంత్రి ఖర్చు చేస్తున్న విషయం సీఎం దృష్టిలో ఉందో.. లేదో తేలాల్సి ఉంది. గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి దుబ్బాకలో ఎందుకు జరగడం లేదు, ప్రతిపక్ష ఎమ్మెల్యేను అయినందుకు నాపై ఇంత వివక్ష చూపడమేంది?” అని ప్రశ్నించారు. మొత్తం ఐదు కోట్ల రూపాయల నియోజకవర్గ అభివృద్ధి నిధుల్లో  రూ. 2 కోట్లు మన ఊరు..మన బడి ప్రోగ్రామ్​కు ఖర్చు చేయగా, మిగిలిన రూ. 3 కోట్లను తాను చేసే వివిధ ప్రతిపాదనలకు మంజూరు చేయాలన్నారు.