రఘుపతి గుట్ట జాతర ప్రారంభం

రఘుపతి గుట్ట జాతర ప్రారంభం
  •     సీతారామచంద్ర స్వామి ఆలయ పునర్నిర్మాణంతో కొత్త కళ

రామాయంపేట, వెలుగు: మండలంలోని డి.ధర్మారంలో గల రఘుపతి గుట్టపై శ్రీరామ నవమి జాతర ఉత్సవాలు శనివారం మొదలయ్యాయి. తొలిరోజు వైదిక కార్యక్రమాలు జరిగాయి. ఆదివారం ఆదివాసాలు, హోమాలు, సోమవారం యంత్ర స్థాపన, మంగళవారం శాంతి కల్యాణం, 17న బుధవారం శ్రీరామ కల్యాణం, 18న బండ్ల ఊరేగింపు కార్యక్రమాలు ఉంటాయి. ఈ జాతరలో అన్ని కులాలకు, మతాలకు జాతరలో భాగస్వామ్యం ఉంటుంది.

దళిత క్రిస్టియన్ ఆధ్వర్యంలో..

రఘుపతి గుట్ట వద్ద రామాలయం నిర్మించాలన్న గ్రామస్తుల ఆలోచన మేరకు మాజీ సర్పంచ్ శంకర్ ఆలయ నిర్మాణానికి నడుం బిగించాడు. శంకర్ దళిత క్రిస్టియన్ అయినప్పటికీ ఏడాదిగా రామాలయం కోసం కష్టపడి నిర్మాణం పూర్తి చేయించాడు. యాబై ఏండ్ల కిందట జాతర ప్రారంభానికి పూనుకున్న రామశర్మ పంతులు కొడుకు మధుసూదన్​ రావు​విఠల మళ్లీ ఆలయానికి అన్నివిధాలా అండదండగా నిలిచారు. లక్షల రుపాయలు ఖర్చు చేసి ధ్వజ స్తంభం, సీతా లక్ష్మణ సమేత శ్రీ రామ మూలవిరాట్ విగ్రహాలను ఆలయానికి అందించారు. ధర్మారం స్కూల్​కు టీచర్​గా వచ్చి ఇక్కడే స్థిర పడిన సత్యనారాయణ కొడుకు నవాత్ సూర్యకిరణ్ సైతం భారీగా విరాళాలు అందజేసి ఆలయ నిర్మాణానికి తోడ్పడ్డారు. 

పునర్నిర్మాణం సంతోషకరం

డి.ధర్మారం గ్రామంలో రాములోరి ఆలయాన్ని పునర్నిర్మించడం చాలా సంతోషకరం. ఇందులో గ్రామస్తులందరూ భాగస్వాములు కావడం హర్షణీయం. దాదాపు యాబై ఏళ్ల కింద గ్రామస్తులు శ్రీరామనవమి జాతర ప్రారంభించారు. ఇందులో మా తండ్రి రామ శర్మ భాగస్వాములుగా ఉండగా, ఇపుడు శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయ పునర్నిర్మాణంలో నేను భాగస్వామి కావడం అదృష్టంగా భావిస్తున్నాను. 
- మధుసూదన్​రావు​ విఠల