రఘురాములును భార్యే చంపించింది..హత్య కేసును ఛేదించిన పోలీసులు

రఘురాములును భార్యే చంపించింది..హత్య కేసును ఛేదించిన పోలీసులు

దేవరకొండ, వెలుగు: నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణంలో ఈ నెల 26న జరిగిన పులిజాల రఘురాములు హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆయన భార్యతో పాటు మరో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. శుక్రవారం డీఎస్పీ నాగేశ్వర్‌‌‌‌ రావు మీడియాకు కేసు వివరాలు వెల్లడించారు. దేవరకొండ పట్టణంలో స్టాంప్​ వెండర్‌‌‌‌గా పని చేస్తున్న రఘురాములు జల్సాలకు అలవాటు పడి విచ్చలవిడిగా అప్పులు చేశారు. చాలావరకు అప్పులు తీర్చినా ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో  భార్య శ్రీలక్ష్మి భర్తను చంపాలని నిర్ణయించుకుంది.  

తన ఇంట్లో బట్టలు ఉతికే మహిళ సుచిత్రను ఇందుకు సహకరించాలని కోరగా.. ఆమె హైదరాబాద్‌‌లో నివాసం ఉండే చిలకరాజు అరుణ్‌‌ పరిచయం చేసింది.  ఇతనితో కలిసి ఏడాదిగా భర్తను చంపేందుకు ప్రయత్నిస్తూనే ఉంది.  ఒకసారి అధిక మోతాదులో వయగ్రా ట్యాబ్​లెట్స్‌‌ను ఇచ్చారు.  మరో సారి రోడ్డు ప్రమాదంలో చంపాలని చూశారు.  ఇంకోసారి మద్యంలో సైనేడ్‌‌ను కలిపి ఇచ్చారు. ఈ సమయంలో రఘురాములు అస్వస్థతకు గురై కోలుకున్నాడు.  ఈ సారి ప్లాన్ మార్చి భర్తకు అరుణ్‌‌​వద్ద రూ. లక్ష ఇప్పించింది.  

తర్వాత అరుణ్‌‌ అప్పు వసూలు కోసం రఘురాములుపై ఒత్తడి తీసుకొచ్చాడు. ఈ నెల 26 సాయంత్రం అరుణ్, భాను,రవితేజ, సుచిత్రతో కలిసి దేవరకొండకు వచ్చి రఘురాములుకు ఫోన్ చేశాడు. తాము మిషన్​కాంపౌండ్​వద్ద ఉన్నామని డబ్బులు తీసుకొని రావాలని కోరగా..  రూ.10 వేలు వారి వద్దకు వెళ్లాడు. నలుగురు కలిసి రఘురాములును తీవ్రంగా కొట్టి నోట్లో సైనేడ్‌‌ పోసి చంపేశారు.  అరుణ్‌‌ అదే రోజు రాత్రి పదిగంటలకు మృతుడి భార్య శ్రీలక్ష్మికి ఫోన్​చేసి విషయం చెప్పారు.  

కేసు నమోదు చేసి కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు శుక్రవారం భార్య శ్రీలక్ష్మితో పాటు,చిలకరాజు అరుణ్, ముక్కెర భాను,పెనుగొండ్ల రవితేజ అరెస్ట్​ చేశారు. మరో నిందితురాలు  సుచిత్ర పరారీలో ఉందని డీఎస్పీ తెలిపారు.