
ఇండియా వాల్, టీమిండియా మాజీ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ కుమారులు ఇద్దరూ తండ్రికి తగ్గ తనయులు అనిపించుకుంటున్నారు. తండ్రి బాటలోనే నడుస్తూ క్రికెట్లో అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. ఇప్పటికే ద్రావిడ్ పెద్ద కుమారుడు సమిత్ సీనియర్ జట్టులో చోటు కోసం పోటీ పడుతుండగా.. చిన్న కుమారుడు అన్వయ్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు.
ఈ క్రమంలోనే 2025 వినూ మన్కడ్ ట్రోఫీలో కర్ణాటక జట్టు కెప్టెన్‌గా అన్వయ్ ద్రావిడ్ ఎంపికయ్యాడు. ఈ 16 ఏళ్ల చిచ్చర పిడుగు వినూ మన్కడ్ ట్రోఫీలో కర్ణాటక జట్టును ముందుండి నడిపించడంతో పాటు వికెట్ కీపర్‌గా వ్యవహరించనున్నాడు. గతంలో కూడా వివిధ టోర్నీల్లో కెప్టెన్‌గా పని చేసిన అనుభవం అన్వయ్‌కు ఉంది.
ఈ క్రమంలోనే వినూ మన్కడ్ ట్రోఫీలో కర్నాటక జట్టు పగ్గాలు అన్వయ్‌కు అప్పగించారు. ఎస్. మణికాంత్ కర్నాటక వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అన్వయ్ అన్నయ్య సమిత్ కూడా గతంలో కర్నాటక జట్టు తరుఫున వినూ మన్కడ్ ట్రోఫీ ఆడిన విషయం తెలిసిందే. కాగా, భారత మాజీ ఆల్ రౌండర్ వినూ మన్కడ్ పేరు మీద ఏర్పాటు చేసిన ఈ ట్రోఫీ2025 ఎడిషన్ అక్టోబర్ 9-17 వరకు డెహ్రాడూన్ వేదికగా జరగనుంది.
వినూ మన్కడ్ ట్రోఫీకి కర్ణాటక జట్టు:
అన్వయ్ ద్రవిడ్ (కెప్టెన్, వికెట్ కీపర్), నితీష్ ఆర్య, ఆదర్శ్ డి ఉర్స్, S మణికాంత్ (వైస్ కెప్టెన్), ప్రణీత్ శెట్టి, వాసవ్ వెంకటేష్, అక్షత్ ప్రభాకర్, సి వైభవ్, కుల్దీప్ సింగ్ పురోహిత్, రథన్ బిఆర్, తేజ శర్మ, వైభవ్ సున్వి శర్మ, వైభవ్ శర్మ, రెహాన్ మహమ్మద్ (wk)