విద్వేషంపై .. న్యాయం గెలిచేనా?

విద్వేషంపై .. న్యాయం గెలిచేనా?

పార్లమెంట్​లో జరిగిన స్మోక్ బాంబు దాడి మీద ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరినందుకు, అటు రాజ్యసభ సహా 146 మంది విపక్ష ఎంపీలను ప్రభుత్వం సస్పెండ్ చేసి, తాను నిర్ణయించుకున్న బిల్లు లన్నింటిని, ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదించుకున్నది కేంద్రం. అందులో క్రిమినల్ చట్టాల్లో  మార్పు బిల్లు కూడా ఉంది. ఇలా కేంద్రం తన తానాషాహీగిరిని కొనసాగించేసింది. తన నియంతృత్వ విధానాల కారణంగా ప్రజలకు అంతా అన్యాయమే చేసింది. ఇలా అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజలతో ఎంపిక కాబడిన పార్లమెంట్ సభ్యులను సైతం మాట్లాడనీయకుండా  వారిని అన్యాయంగా, అప్రజాస్వామ్యంగా సస్పెండ్ చేసి నిషేధం విధించినట్లు చేసింది. పూర్తిగా అంతా అప్రజాస్వామ్యమే! రాజ్యాంగ వ్యతిరేక చర్యే అంటే అతిశయోక్తి కాదు!ఈ నేపథ్యంలో రాహుల్ తన రెండవ విడత భారత్ జోడో యాత్రలో భాగంగా 'న్యాయ్ యాత్ర'ను ప్రారంభించారు. 

మణిపూర్ టూ ముంబై  (6200 కిలోమీటర్లు14 రాష్ట్రాల్లోని 85 జిల్లాల్లో ) కాంగ్రెస్ నేత రాహుల్ న్యాయ్ యాత్ర ప్రారంభం అయ్యింది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లి కార్జున్ ఖర్గే సహా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ మధు యాష్కీ, కర్ణాటక సీఎం సిద్ద రామయ్య తదితరులు పాల్గొన్నారు. ఓట్ల కోసం, హక్కుల కోసం, సెక్యులరిజం కోసం, సోషల్ జస్టిస్ కోసం, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని  కాపాడడానికి ఈ యాత్ర అని, ఈ సందర్భంగా జెండా ఊపి యాత్ర ను ప్రారంభించిన ఖర్గే పేర్కొన్నారు. న్యాయమైన హక్కులను సాధించేవరకు తన యాత్ర కొనసాగుతుందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. 

మోదీ అయోధ్య మంత్రం, రాహుల్​ న్యాయం కోసం

పార్లమెంట్ ఎన్నికలు చాలా దగ్గరగా ఉన్నాయి. ఒకవైపు ఇండియా కూటమిలో ఉన్న పార్టీలతో కాంగ్రెస్ సీట్ల సర్దుబాటు మీద చర్చ ప్రారంభించింది. అటు హడావిడిగా బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వహిందు పరిషత్​లు అయోధ్యలో ఈ నెల 22 న రామమందిరం ప్రారంభోత్సంలో బిజీ అయిపోయాయి. దేశం అంతా అక్షింతలు పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. పీఎం నరేంద్ర మోదీ కటౌట్లు వెలిసిన పరిస్థితి ఉంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి మైలేజ్​ను పెంచుకునేవిధంగా రాజకీయ ప్రచారం చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. కాంగ్రెస్ రామమందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఆహ్వానాన్ని  తిరస్కరించి హిందూ వ్యతిరేకిగా కనిపిస్తుంది అని ఒక టూల్ కిట్ బూని పెద్ద ఎత్తున ప్రచారాన్ని  బీజేపీ మొదలు పెట్టేసింది. మందిరం నిర్మాణం పనులు పూర్తి కాకుండా ఇలా ప్రాణ ప్రతిష్ఠ మంచిది కాదని, శాస్త్రాలకు వ్యతిరేకం అని శంకరచార్యులు ఒకవైపు మొత్తుకుంటున్నారు. శంకరాచార్యుల మాటను అసలు లెక్క చేసే వారు లేరు! 

విద్వేషం వర్సెస్​ ప్రేమపంపకం

 ఎన్నికల్లో ఈసారి చెప్పుకోవడానికి, బీజేపీకి వేరే అస్త్రాలు ఏవీ లేవు. నల్లధనం వెలికి తీసి, పౌరుల ఖాతాల్లో 15 లక్షలు వేస్తాం  అని పీఎం మోదీ చెప్పిన హామీ నెరవేరలేదు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ నెరవేర్చలేదు. అధిక ధరలు, నియామక పరీక్షల పేపర్ లీక్​లు, ప్రభుత్వ రంగం కార్పొరేటీకరణ, పేదరికం, అసమానతలు పెరిగిపోయాయి. ప్రశ్నించేవారిని జైళ్లలో పెట్టడం, విపక్షాల మీద కక్ష సాధింపులు, ఈడీ, ఐటి, సీబీఐ దాడులు చేయడం ద్వారా ఉక్కిరిబిక్కిరి చేసే పరిస్థితి ఉన్నది. మరోవైపు దేశం మీద దాదాపు ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంక్ అప్పులు  రూ.165 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంతా అస్తవ్యస్త పరిస్థితి ఉన్నది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ న్యాయ్ యాత్ర ప్రభావం ఉండి తీరే పరిస్థితులు ఉన్నాయి. దేశంలో విద్వేష రాజకీయాలు చేస్తున్న వారి నడుమ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ  ఏడాదిన్నరగా ప్రేమను పంచుతున్నారు. విద్వేష ఉపన్యాసాలు, కులం, మతం పేరిట ఓట్ల కోసం అతి నీచమైన రాజకీయాలు కేవలం అధికారం కోసం చేస్తున్నారని పేర్కొన్నారు. భారత్ జోడో యాత్రలో  రాహుల్ గాంధీ ఈ విషయాన్ని పదే పదే చెప్పారు. రాహుల్​ను లెక్క చేయకుండా చిత్తం వచ్చినట్లు విమర్శలు చేసిన వారికి ఇప్పుడు చెమటలు పడుతున్నాయి. ఆగమాగం అవుతున్నారు.

ఆందోళనలో బీజేపీ

రాహుల్ ప్రభావం అటు కర్ణాటక, ఇప్పుడు తెలంగాణ లో కాంగ్రెస్  ప్రభుత్వం ఏర్పాటుకు కారణం అయ్యింది. సౌత్ ఇండియా అంతా రాహుల్ గాంధీ ప్రభావం ఉంది. రాహుల్​కు  జన బాహుళ్యంలో ఇప్పుడు మంచి పేరు ఉన్నది. రాహుల్ ఒక డౌన్ టు ఎర్త్ నేత అయిపోయాడు. అయన ఎక్కడికి వెళ్లినా, అక్కడ ఆయనకు వస్తున్న రెస్పాన్స్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర భారత్​లోని యువతకు, దిశా నిర్దేశాన్ని చూయించింది. మార్గ దర్శనం చేసింది. నేల మీద నిజం మాత్రమే విజయం సాధిస్తుంది. అబద్దపు రాజ్యం పునాదులు ఇప్పుడు మరో మారు రాహుల్  న్యాయ్ యాత్రతో కదిలే పరిస్థితి వచ్చింది! కాబట్టి నిరంతరం రాహుల్ గాంధీ మీద ఒక అబద్ధపు టూల్ కిట్ పట్టుకుని ట్వీట్​లు చేస్తూ అయన క్యారెక్టర్ ను, అస్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ విఫలం అవుతున్న పరిస్థితి ఉంది. మంత్రులు, నేతలు, చివరికి పీఎం మోదీ కూడా ఇప్పుడు ఆందోళనలో పడిపోయే పరిస్థితి ఉంది. తనని బద్నామ్ చేయడానికి, బీజేపీ వేల కోట్లు ఖర్చు చేసిందని రాహుల్ గాంధీ స్వయంగా పలు మార్లు పేర్కొనడం జరిగింది. జనం దృష్టిని మళ్లించడానికి హిందూ, ముస్లిం, సిఖ్, ఇసాయి అంటూ ఎప్పుడు విద్వేష ప్రసంగాలు చేయడం తప్ప దేశ ఆర్థిక పరిస్థితి, సమగ్రత మీద శ్రద్ధే లేదు! 

భారత్​ జుడ్​ రహా హై! హర్​ దిల్​ మిల్​ రహా హై!

ఇండియా కూటమిలోని పార్టీల నేతలు కూడా ఈసారి రాహుల్ న్యాయ్ యాత్రలో, ఆయా రాష్ట్రాల్లో కలిసి వచ్చే అవకాశం ఉంది. రాజకీయాల్లో సద్భావన, ప్రేమ సందేశం ఇచ్చిన భారత్ జోడో యాత్ర అయినా,  న్యాయ్ యాత్ర అయినా చాలా ప్రత్యేకమైనది. రేపు ఈ యాత్ర ప్రభావం రానున్న పార్లమెంట్ ఎన్నికల మీద ఎంత? అనే చర్చ బీజేపీ శ్రేణుల్లో తీవ్రంగా కొనసాగుతున్నది. కేవలం అధికారం కోసమే రాజకీయాలు చేసే వారికి  రానున్న పార్లమెంట్ ఎన్నికలు గుణపాఠం కావాలి! ఈ యాత్ర దేశంలోని మనుషులను కలిసి మెలిసి ప్రేమతో ఉండడానికి, మార్గదర్శనం కావాలి! విద్వేషపూరిత ఉపన్యాసాలు, విభజన రాజకీయాలు చేసే  నేతలను సమాజం నుంచి వెలివేసే ఆ రోజు ఏమంత దూరంగా లేదు అనిపిస్తున్నది. సామాన్య జనం సైతం నేల మీద కు వచ్చిన కాంగ్రెస్ పార్టీ నేతను దగ్గరగా చూసి చర్చించే అవకాశం లభించింది.  యాత్రల్లో రాహుల్​ అందరితో కలిసి పోతున్న తీరు చూసి జనం ముచ్చట పడిపోయే పరిస్థితి వచ్చింది.  రాహుల్ జీ భారత్ జుడ్ రహా హై, హర్ దిల్ మిల్ రహా హై! ప్రొసీడ్! దేశం అంతా ప్రేమమయం అయిపోయి, సకల జనులకు సమాన న్యాయం లభించే పరిస్థితి రావాలని కోరుకుందాం!  నిరుద్యోగం, ఆకలి, అసమానతలు, విద్య, వైద్యం లాంటి సమస్యలు తీరే పరిస్థితి రావాలని కోరుకుందాం!

యాత్రకు మేధావుల సంఘీభావం

విద్వేషాలు వ్యాప్తి చేయడంలో  ప్రభుత్వం ఒడిలో మీడియా ప్రధాన పాత్ర పోషించిందని రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. నిరుద్యోగం, అసమానతలు, అధిక ధరలు, పేదరికం, ప్రదానంగా విద్వేషాల రాజకీయాలకు వ్యతిరేకంగా రాహుల్ మాట్లాడుతున్నారు. ఒక నాయకుడు ఇండియాను విద్వేషాలు లేకుండా ఐక్యం చేయడానికి వేల కిలోమీటర్లు దేశంలో నడుస్తుంటే, అయనకు తోడుగా కొంతదూరం అయినా నడవడానికి వచ్చామని గత భారత్ జోడో యాత్రలో కలిసి వచ్చి, ఆయనతో నడిచిన ఎందరో విద్యావంతులు, రైతులు, మహిళలు, కార్మికులు పేర్కొనడం చూశాం! 

-  ఎండి.మునీర్,
సీనియర్ జర్నలిస్ట్, విశ్లేషకుడు