
న్యూఢిల్లీ / రాంచీ: భారత్‌పై భారీగా టారిఫ్‌లు విధిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే బెదిరిస్తున్నప్పటికీ ప్రధాని నరేంద్ర మోదీ మౌనంగా ఉంటున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మండిపడ్డారు. అదానీ గ్రూపుపై అమెరికాలో విచారణ జరుగుతున్నందునే ఆయన సైలెంట్‌గా ఉంటున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని దేశ ప్రజలందరూ అర్థం చేసుకోవాలని కోరారు. ఈ మేరకు బుధవారం సోషల్ మీడియా ‘ఎక్స్’లో రాహుల్ పోస్టు పెట్టారు.
‘‘భారతీయులారా.. అర్థం చేసుకోండి. భారత్‌పై భారీగా టారిఫ్‌లు వేస్తామని అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పదేపదే బెదిరిస్తున్నారు. అయినప్పటికీ ప్రధాని మోదీ మౌనంగానే ఉంటున్నారు. ఎందుకంటే.. అమెరికాలో అదానీ గ్రూపుపై విచారణ జరుగుతున్నది. మోదీ, ఏఏ (అదానీ, అంబానీ), రష్యా ఆయిల్ డీల్స్ మధ్య ఉన్న ఆర్థిక వ్యవహారాలను బయటపెడతామంటూ ప్రధాని మోదీ చేతులు కట్టేశారు” అని ట్వీట్‌లో పేర్కొన్నారు.
పరువునష్టం కేసులో రాహుల్‌కు బెయిల్
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యలకు సంబంధించిన పరువునష్టం కేసులో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి బెయిల్ వచ్చింది. జార్ఖండ్ చైబాసాలోని ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.2018 నాటి ఈ కేసులో నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ కాగా, కోర్టు ఆదేశాల మేరకు రాహుల్ విచారణకు హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాహుల్ తరఫు లాయర్లు వాదిస్తూ.. విచారణకు ఆయన పూర్తి స్థాయిలో సహకారం అందిస్తారని కోర్టుకు హామీ ఇచ్చారు. ఇరువైపులా వాదనలు విన్న జడ్జి జస్టిస్ సుప్రియా రాణి.. విచారణకు హాజరు కావాలన్న షరతుతో రాహుల్‌కు బెయిల్ మంజూరు చేశారు.