
- ఓట్ల దొంగతనాన్ని ఇండియా కూటమి అడ్డుకొని తీరుతుంది
- సరైన ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఇవ్వాల్సిందే
- దీనిపై తాము వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వెల్లడి
- అరారియాలో ఓటర్ అధికార్ యాత్ర
పాట్నా: దేశంలో బీజేపీ ఏజెంట్‌గా ఎన్నికల సంఘం(ఈసీ) పనిచేస్తున్నదని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ అన్నారు. బిహార్‌లో ఓటరు జాబితా సమగ్ర సవరణ (సర్) పేరుతో ఓట్ల చోరీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. అరారియాలో రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్‌తో కలిసి ఓటర్అధికార్ యాత్ర నిర్వహించారు. అనంతరం మీడియా సంయుక్త సమావేశంలో రాహుల్ మాట్లాడారు. మొన్నటివరకూ పబ్లిక్ సెక్టార్‌ను ప్రైవేటైజేషన్చేసిన బీజేపీ.. ఇప్పుడు ఈసీ సహకారంతో ప్రతిపక్షాల ఓట్లను లాక్కుంటోందని ఫైర్అయ్యారు. బిహార్‌లో ఓట్ల చోరీ జరగనీయబోమని అన్నారు. సరైన ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు.
‘సర్’ రాజ్యాంగ విరుద్ధం
దేశంలోని ప్రతి పౌరుడికి రాజ్యాంగం సమాన హక్కులను కల్పించిందని రాహుల్‌గాంధీ తెలిపారు. ఓటును లాక్కుంటున్న ‘సర్’ రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. బిహార్‌లో ఓట్ల చోరీని ఇండియా కూటమి అడ్డుకొని తీరుతుందని తెలిపారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలకు బిహార్ప్రజలు తగిన సమాధానం ఇస్తారని అన్నారు. ఓట్ల చోరీపై తమ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడంలో ఈసీ విఫలమైందని రాహుల్ మండిపడ్డారు.
తాను అఫిడవిట్ సమర్పించకుంటే ఆరోపణలు నిరాధారమని భావించాల్సి వస్తుందని ఈసీ చెబుతున్నదని, మరి వయనాడ్‌లో అవే ఆరోపణలు చేసిన బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్‌ను అఫిడవిట్ సమర్పించాలని ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. దీన్నిబట్టి ఈసీ తటస్థంగాలేదని, బీజేపీతో కలిసి పనిచేస్తున్నదని అర్థమవుతున్నదని అన్నారు. మహాకూటమిలోని పార్టీలన్నీ బిహార్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కలిసి పనిచేస్తున్నాయని తెలిపారు.
పెండ్లిపై జోకులు
బిహార్‌లో ఓటర్ అధికార్ యాత్ర నిర్వహిస్తున్న రాహుల్ గాంధీ తన పెండ్లిపై జోకులు పేల్చారు. తమ కుటుంబ స్నేహితుడు, రాజకీయ మిత్రుడైన ఆర్జేడీ ప్రెసిడెంట్ లాలూ ప్రసాద్ యాదవ్‌తో పెండ్లి చర్చలు కొనసాగుతున్నాయని వ్యాఖ్యానించారు. బిహార్‌లో ఆర్జేడీకి కాంగ్రెస్ అనుచర పార్టీ అంటూ లోక్‌జనశక్తి పార్టీ (రామ్‌విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ చేసిన కామెంట్స్‌ను మీడియా సమావేశంలో ఓ విలేకరి ప్రస్తావించగా.. తేజస్వీ యాదవ్ స్పందించారు.
తనకు తాను ప్రధాని మోదీకి హనుమాన్‌లాంటి వాడినని పోల్చుకునే చిరాగ్ పాశ్వాన్.. ముందు పెండ్లి చేసుకోవాలని చురకలంటించారు. దీంతో పక్కనే రాహుల్ గాంధీ మైక్ తీసుకొని ఈ సలహా తనకూ వర్తిస్తుందని అనడంతో అక్కడ నవ్వులు విరబూశాయి. ఈ విషయంపై లాలూతో చర్చలు కొనసాగుతు న్నాయంటూ చమత్కరించారు. రెండేండ్ల క్రితం పాట్నాలో జరిగిన విలేకరుల సమావేశంలో లాలూ మాట్లాడుతూ.. ‘‘రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోవాలని మేం కోరుకుంటున్నాం. ఇది ఆయన తల్లి సోనియా గాంధీ ఆకాంక్ష కూడా. మేం ఆయనను పెండ్లి కొడుకుగా చూడాలని, ‘బరాత్’లో స్టెప్పులేయాలని ఉత్సాహంగా ఉన్నాం” అని వ్యాఖ్యానించారు.
రాహుల్‌ను హత్తుకున్న అగంతకుడు
ఓటర్ అధికార్ యాత్ర సందర్భంగా అనూహ్య పరిణామం చోటు చేసుకున్నది. గుర్తు తెలియని వ్యక్తి ఒకరు అకస్మాత్తుగా రోడ్డుపైకి దూసుకొచ్చి రాహుల్ గాంధీని హత్తుకొని, ముద్దుపెట్టే ప్రయత్నం చేశాడు. ఈ సంఘటన పూర్నియా జిల్లాలో జరిగింది. బైక్ నడుపుతున్న రాహుల్ గాంధీని పట్టుకొని, ముద్దుపెట్టుకునే ప్రయత్నం చేయడంతో ఆయన భద్రతా సిబ్బంది వేగంగా స్పందించారు. యువకుడిని పక్కకు లాగేశారు. బ్యాల్సెన్స్ తప్పకుండా బైక్‌ను కంట్రోల్ చేసుకున్న రాహుల్ గాంధీ.. ముందుకు సాగిపోయారు.
బుల్లెట్ నడిపిన రాహుల్..
బిహార్‌లో ‘ఓటర్ అధికార్ యాత్ర’ సందర్భంగా రాహుల్‌గాంధీ బుల్లెట్ బండి నడిపారు. అరారియాలో తేజస్వీ యాదవ్‌తో కలిసి నిర్వహించిన ఈ యాత్రలో వెనుక కార్యకర్తను కూర్చొపెట్టుకొని బైక్ డ్రైవ్ చేశారు.