ట్రంప్ చెప్పింది నిజమే ..మనది ‘డెడ్ ఎకానమీ’: రాహుల్ గాంధీ

ట్రంప్ చెప్పింది నిజమే ..మనది ‘డెడ్ ఎకానమీ’: రాహుల్ గాంధీ
  • మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని అందరికీ తెలుసు
  • ప్రధానికి, ఆర్థిక మంత్రికి మాత్రమే తెలియదు
  • వాళ్లు కేవలం అదానీ కోసమే పనిచేస్తున్నరని విమర్శ

న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ చేసిన వ్యాఖ్యలను తాను సమర్థిస్తున్నానని, ఆయన చెప్పింది వాస్తవమేనని, మనది ‘డెడ్ ఎకానమీ’ అని లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్​గాంధీ అన్నారు. ‘‘ఇండియాది డెడ్ ఎకానమీ అంటూ ట్రంప్ వాస్తవాన్ని చెప్పినందుకు సంతోషిస్తున్న. మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందని అందరికీ తెలుసు. ప్రధాని నరేంద్ర మోదీకి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​కు మాత్రమే ఈ విషయం తెలియదు. వాళ్లు గౌతమ్ అదానీ వంటి బిలియనీర్ల కోసం దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చారు’’ అని రాహుల్ గురువారం పార్లమెంట్ ఆవరణలో మీడియాతో అన్నారు. కేంద్రంలోని ఎన్డీయే సర్కార్​ దేశ ఆర్థిక వ్యవస్థ, రక్షణ వ్యవస్థ, విదేశాంగ వ్యవస్థ.. ఇట్ల అన్ని వ్యవస్థలను భ్రష్టుపట్టించిందని మండిపడ్డారు.

 ట్రేడ్ డీల్ విషయంలో ట్రంప్​ చెప్పినదానికి మోదీ తల ఊపుతారని, గతంలో కూడా తాను ఇదే చెప్పానన్నారు. ఇప్పుడు ట్రంప్ వేసిన టారిఫ్​లే అందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ‘‘మన ఫారిన్ పాలసీ అద్భుతంగా ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ చెప్తున్నారు. ఒకవైపు అమెరికా.. మరోవైపు చైనా వేలెత్తి చూపిస్తున్నా.. ఆయన మాత్రం అద్భుతంగా ఉందని అంటున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత మన ప్రతినిధుల బృందాలు వివిధ దేశాల్లో పర్యటించినప్పుడు ఆయా దేశాలతో పాకిస్తాన్ తీరును ఎందుకు ఖండింపజేయలే” అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. ‘‘రెండురోజుల కింద పార్లమెంట్​లో ప్రధాని మోదీ మాట్లాడినప్పుడు ట్రంప్​ తీరుపై, చైనా తీరుపై ఎందుకు స్పందించలే. ఆ పేర్లు ఎందుకు ఎత్తలే. దీని వెనుక కారణం ఏమిటి?” అని ప్రశ్నించారు. 

మోదీ జీ.. మౌన వ్రతం వీడండి: ఖర్గే  

ఇండియాపై ట్రంప్ 25 శాతం టారిఫ్, పెనాల్టీ విధిస్తే ప్రధాని మోదీ మాత్రం ‘మౌన వ్రతం’ పాటిస్తున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే గురువారం ‘ఎక్స్’లో విమర్శించారు. ట్రంప్ ప్రకటించిన సీజ్ ఫైర్ అంశంపై కూడా పార్లమెంట్​లో మోదీ  నోరు మెదపడం లేదని మండిపడ్డారు. ఇలాంటి విషయాల్లో దేశ ప్రయోజనాలే ముందు ఉండాలని, కాంగ్రెస్ ఎప్పుడూ దేశంతోనే ఉంటుందని ట్వీట్​చేశారు. ట్రంప్ విధించిన టారిఫ్​లు దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతాయని తెలిపారు. ఎంఎస్ఎంఈలు, రైతులు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు. 

ఇండియాపై ట్రంప్ ఇష్టమొచ్చినట్లు కామెంట్లు చేస్తుంటే.. ప్రధానమంత్రిగా స్పందించాల్సిన బాధ్యత మోదీకి లేదా? అని ప్రశ్నించారు. ‘‘మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు.. ఇండియాకు అమెరికా ఎంతో సహకరించింది. పాకిస్తాన్ పేరు ప్రస్తావిస్తూ ఇండియాను ట్రంప్ బెదిరిస్తుంటే మోదీ ఏం చేస్తున్నారు?’’ అని ఖర్గే ఫైర్ అయ్యారు. ఇండియాపై ట్రంప్ నోరు పారేసుకుంటుంటే.. ప్రధాని మోదీ సైలెంట్​గా ఉండటం.. దేశ ప్రయోజనాలకు నష్టమని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్ విమర్శించారు.  

అమెరికా ఒత్తిడికి తలొగ్గొద్దు : శశి థరూర్

భారత్ పై ట్రంప్ టారిఫ్ లు పూర్తిగా అసమంజసమని, అమెరికా ఒత్తిడికి భారత్ లొంగకుండా మన దేశ ప్రయోజనాలను పరిరక్షించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. గురువారం ఢిల్లీలో పార్లమెంట్ వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. ట్రంప్ సుంకాలు భారత వాణిజ్యాన్ని నాశనం చేస్తాయన్నారు. "అమెరికా మనకు చాలా పెద్ద మార్కెట్. మన ఎగుమతులు సుమారు 87-నుంచి 90 బిలియన్ డాలర్ల విలువైనవి. ఈ సుంకాలు అమలైతే, మన జీడీపీలో సగం శాతం నష్టం వాటిల్లే అవకాశం ఉంది" అని ఆయన అన్నారు. అమెరికా డిమాండ్లు అసమంజసంగా ఉంటే, వాటిని తిరస్కరించే హక్కు భారత్ కు  ఉందని థరూర్ స్పష్టం చేశారు.  అలాగే,  ట్రంప్ ది బేరసారాల వ్యూహం కూడా కావచ్చని పేర్కొన్నారు.