ఓట్ల దొంగలకు శిక్ష తప్పదు..ఏదో ఓ రోజు..చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ

ఓట్ల దొంగలకు శిక్ష తప్పదు..ఏదో ఓ రోజు..చర్యలు తీసుకుంటాం: రాహుల్ గాంధీ
  • ఈసీ, అధికారులకు రాహుల్ గాంధీ హెచ్చరిక
  • మీరు రాజ్యాంగంపై దాడి చేస్తే.. మేం మీపై దాడి చేస్తాం 
  • సైన్డ్ డిక్లరేషన్ ఎందుకు.. ఆల్రెడీ పార్లమెంట్​లో ప్రమాణం చేశా 
  • బెంగళూరులో ‘వోట్ అధికార్ ర్యాలీ’లో కాంగ్రెస్ నేత స్పీచ్ 
  • ఈసీకి ఐదు ప్రశ్నలు సంధించిన లోక్​సభ ప్రతిపక్ష నేత 
  • ఆరోపణలు నిజమైతే డిక్లరేషన్​ ఎందుకివ్వట్లే?: ఈసీ

బెంగళూరు: దేశంలో ఓట్ల చోరీకి పాల్పడ్డ అధికారులకు ఏదో ఓ రోజు శిక్ష తప్పదని లోక్​సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఓటర్ల జాబితాల్లో అక్రమాలపై ఆధారాలను సంతకంతో కూడిన డిక్లరేషన్​తో సమర్పించాలన్న ఎన్నికల సంఘం(ఈసీ) డిమాండ్​పై ఆయన మండిపడ్డారు. తాను ఆల్రెడీ పార్లమెంట్​లో ఎంపీగా రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకుని ప్రమాణం చేశానన్నారు.

శుక్రవారం బెంగళూరులోని ఫ్రీడమ్ పార్క్ వద్ద నిర్వహించిన ‘వోట్ అధికార్ ర్యాలీ’లో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కర్నాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఇతర నేతలతో కలిసి రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల్లో ఓట్ల చోరీని మీరు కవర్ చేయలేరు. లేదా దాచిపెట్టలేరు. ఏదో ఓ రోజు మీరు చర్యలను ఎదుర్కోక తప్పదు. 

ప్రతి అధికారి, ఎన్నికల కమిషనర్ దీనిని బాగా అర్థం చేసుకోవాలి. గత ఎన్నికల్లో మోదీ, బీజేపీ నాయకులు రాజ్యాంగంపై దాడి చేశారు. భారతీయ సంస్థలను ధ్వంసం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని నేను ఆధారాలతో సహా చెప్తున్నా. రాజ్యాంగంపై దాడి చేసి, తప్పించుకుంటామని ఇలాంటి అధికారులు అనుకోవచ్చు. మీరు రాజ్యాంగంపై దాడి చేస్తే.. మేం మీపై దాడి చేస్తాం. 

మీపై చర్యలు తీసుకునేందుకు సమయం పట్టవచ్చు. కానీ మీరంతా ఏదో ఓ రోజు ఒకరి తర్వాత ఒకరు పట్టుబడక తప్పదు” అని ఆయన హెచ్చరించారు. లోక్ సభ ఎన్నికల్లో ప్రజల ఓట్లను దొంగిలించడం కోసం బీజేపీ, ఎన్నికల సంఘం కుమ్మక్కు అయ్యాయని మరోసారి ఆరోపించారు. తాను రిలీజ్ చేసిన డేటా ఆధారంగా ప్రజలు ప్రశ్నిస్తుండటంతో మధ్యప్రదేశ్, రాజస్తాన్, బిహార్ రాష్ట్రాల్లో ఈసీ వెబ్ సైట్లను మూసేశారని అన్నారు.  

ఓట్ల చోరీతో మోదీ గద్దెనెక్కారు.. 

నరేంద్ర మోదీ కేవలం 25 సీట్ల మార్జిన్​తోనే ప్రధాని సీటును దక్కించుకున్నారని రాహుల్ గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వోటర్ డేటా తమకు అందితే గనక.. భారత ప్రధాన మంత్రి ఓట్లు దొంగతనం చేసి గద్దెనెక్కారని ప్రూవ్ చేస్తామన్నారు. ‘‘2024 లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో మా కూటమి గెలిచింది. కానీ 4 నెలల తర్వాత మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. 

ఆ ఎన్నికల ఫలితాలపై మేం షాక్ అయ్యాం. కారణమేంటని కనుక్కోవడంతో ఆ 4 నెలల కాలంలోనే కొత్తగా కోటి మంది ఓటర్లు నమోదు అయ్యారని తేలింది. కొత్త ఓటర్లు ఓటేసిన అన్ని చోట్లా బీజేపీ గెలిచింది” అని రాహుల్ వెల్లడించారు. అలాగే కర్నాటకలో 15 నుంచి 16 ఎంపీ సీట్లను గెలుస్తామని అనుకున్నాం. ‘‘పోలింగ్​లో16 సీట్లలో ఆధిక్యంలో ఉన్నా.. 9 సీట్లలోనే గెలిచాం. 

ఓటర్ లిస్ట్ సాఫ్ట్ కాపీ, వీడియో రికార్డులు అడిగితే ఈసీ తిరస్కరించింది. తర్వాత చట్టాన్ని మార్చి.. 45 రోజుల తర్వాత పోలింగ్ వీడియోలను ధ్వంసం చేయాలని అంటోంది. ఈసీ డేటా ఇవ్వకపోతే.. లోక్ సభ ఎన్నికల్లో 35 వేల ఓట్ల మార్జిన్​తో బీజేపీ గెలిచిన 25 చోట్లా డేటాను సేకరిస్తాం” అని రాహుల్ హెచ్చరించారు. కర్నాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఓట్ల చోరీ నేరంపై దర్యాప్తు చేసి, చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈసీకి 5 ప్రశ్నలు.. 

ఎన్నికల సంఘం తనను బెదిరించే ముందు తాను వేసే 5 ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని రాహుల్ డిమాండ్ చేశారు. ‘‘ఓటర్ లిస్టులను డిజిటల్ మెషీన్ రీడబుల్ ఫార్మాట్​లో ఎందుకు ఇవ్వట్లేదు? వీడియో ఎవిడెన్స్​ను ఎందుకు ధ్వంసం చేస్తున్నారు? ఓటర్ లిస్టుల్లో ఈసీ ఎందుకు మోసానికి పాల్పడుతోంది? ప్రతిపక్షం ప్రశ్నలకు బదులివ్వకుండా బెదిరింపులకు పాల్పడుడేంది? ఈసీ ఎందుకు బీజేపీ ఏజెంట్​గా వ్యవహరిస్తోంది?” అని ఆయన ప్రశ్నించారు. 

ఆరోపణలు నిజమైతే డిక్లరేషన్ ఎందుకివ్వట్లే?: ఈసీ

న్యూఢిల్లీ:  ఓటర్ లిస్టుల్లో ఫేక్ ఓట్లు నమోదై, నిజమైన ఓటర్లను తొలగించినట్టు ఆధారాలు ఉంటే వాటితోపాటు సంతకంతో కూడిన డిక్లరేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం (ఈసీ) సూచించింది. ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగింది వాస్తవమేనని రాహుల్ అనుకుంటే డిక్లరేషన్​తోపాటు ఆధారాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. 

ఈసీపై చేసిన ఆరోపణలు నిజమని ఆయన నమ్మినట్లయితే, డిక్లరేషన్ ఇచ్చేందుకు అభ్యంతరం కూడా ఉండబోదని పేర్కొంది. ‘డిక్లరేషన్​పై సంతకం చేయబోనంటే.. ఆ ఆరోపణలను ఆయనే విశ్వసించట్లేదని అర్థం. అలా అయితే, నిరాధార ఆరోపణలు చేసినందుకు దేశానికి ఆయన క్షమాపణలు చెప్పాలి’ అని ఈసీ డిమాండ్ చేసింది.  

ఎన్నికల్లో ఓట్ల చోరీని మీరు దాచిపెట్టలేరు 

ఏదో ఓ రోజు మీరు చర్యలను ఎదుర్కోక తప్పదు

ప్రతి అధికారి, ఎన్నికల కమిషనర్ దీనిని బాగా అర్థం చేసుకోవాలి. గత ఎన్నికల్లో మోదీ, బీజేపీ నాయకులు రాజ్యాంగంపై దాడి చేశారు.  సంస్థలను ధ్వంసం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని నేను ఆధారాలతో చెప్తున్నా. రాజ్యాంగంపై దాడి చేసి, తప్పించుకుంటామని ఇలాంటి అధికారులు అనుకోవచ్చు. మీరు రాజ్యాంగంపై దాడి చేస్తే.. మేం మీపై దాడి చేస్తాం. మీపై చర్యలు తీసుకునేందుకు సమయం పట్టవచ్చు. కానీ మీరంతా ఏదో ఓ రోజు ఒకరి తర్వాత ఒకరు పట్టుబడక తప్పదు.

- రాహుల్ గాంధీ