Vote Chori: రాహుల్ గాంధీ ఆటం బాంబ్ ప్రూఫ్.. ఒకే ఓటర్.. వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు బూత్లలో ఓట్లు !

Vote Chori:  రాహుల్ గాంధీ ఆటం బాంబ్ ప్రూఫ్.. ఒకే ఓటర్.. వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు బూత్లలో ఓట్లు !

ఎన్నికల అవకతవకలపై బాంబు పేల్చుతానంటూ హెచ్చరిస్తూ వస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. గురువారం (ఆగస్టు 07) ఆటం బాంబునే పేల్చారు. ఢిల్లీలోని ఇందిరా భవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఓట్ల చోరీకి సంబంధించిన ఎవిడెన్స్ ను వెల్లడించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని ఆరోపించారు. బీజేపీకోసం ఎన్నికల సంఘం ఓట్ల దొంగతనానికి పాల్పడిందని సంచలన ఆరోపణలు చేశారు.  మహారాష్ట్ర, హర్యాణా, కర్ణాటక రాష్ట్రాలలో ఓట్ల చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు. 

కర్ణాటకలోని మహదేవ్ పుర అసెంబ్లీ నియోజకవర్గాన్ని శాంపుల్ గా తీసుకుని అక్కడ జరిగిన ఓట్ల చోరీకి సంబంధించిన డేటాను సేకరించినట్లు చెప్పారు రాహుల్. అందుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు. ఒకే ఓటర్ పేరున.. ఒకే ఫోటో పేరున.. ఒకే వ్యక్తికి సంబంధించి వేర్వేరు బూత్ లలో.. వేర్వేరు రాష్ట్రాలలో నమోదైనట్లు ఆధారాలతో సహా చూపించారు రాహుల్ గాంధీ.

షకున్ రాణి:

కర్ణాటక మహదేవ్ పుర అసెంబ్లీలో 70 ఏళ్ల షకున్ రాణి.. పేరు మీద రెండు బూత్ లలో రెండు సార్లు ఓటేసినట్లు చెప్పారు. సీసీ టీవీ ఫూటేజ్ ఆధారంగా ఆమె రెండు సార్లు ఓటేసినట్లు నిర్ధారించినట్లు చెప్పారు. ఆమెకు రెండు ఓటర్ ఐడీలు ఉన్నట్లు గుర్తించారు. పేరులో చిన్న చిన్న మార్పులతో వేర్వేరు ఓటర్ కార్డులు క్రియేట్ అయినట్లు చెప్పారు. ఈమె రెండు బూత్ లలో ఓట్లేయగా.. రెండు ఓట్లు కౌంట్ అయినట్లు చెప్పారు. ఓట్ల చోరీకి ఇది నిదర్శనమని అన్నారు రాహుల్. 

మూడు రాష్ట్రాల్లో ఓటేసిన ఆదిత్య శ్రీవాత్సవ:

 ఆదిత్య శ్రీ వాత్సవ అనే ఒకే వ్యక్తి మూడు రాష్ట్రాలలో ఓట్లేసినట్లు ఆరోపించారు రాహుల్. ఉత్తరప్రదేశ్ మహారాష్ట్రలో ఒక్కోసారి ఓటేయగా.. కర్ణాటకలో రెండు సార్లు ఓటేసినట్లు చెప్పారు.  అదే విధంగా  గురు కిరాత్ సింగ్ అనే వ్యక్తి ఒకే నియోజకవర్గంలో 4 పోలింగ్ బూత్ లలో నాలుగు సార్లు ఓట్లేసినట్లు చెప్పారు. ఇలా వేల సంఖ్యలో ఓట్లు నమోదైనట్లు చెప్పారు. ఇది తాను సొంతంగా చెబుతున్న విషయం కాదని.. ఎన్నికల సంఘం ఇచ్చిన డేటా ఆధారంగానే నిరూపిస్తున్నట్లు చెప్పారు. ఇలాంటి ఓటర్లు మహదేవ్ పుర ఒక్క అసెంబ్లీలోనే  11 వేల 965 ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి అవినీతి జరిగినందుకే ఎన్నికల కమిషన్ సీసీటీవీ ఫూటేజ్ ను ధ్వంసం చేసినట్లు ఆరోపించారు.

ఐదు రకాలుగా ఓట్ల చోరీ:

ఇటీవలి ఎన్నికల్లో మొత్తం ఐదు రకాలుగా ఓట్ల చోరీ జరిగినట్లు ఆరోపించారు రాహుల్. 

1. డ్యూప్లికేట్ ఓటర్స్ - Duplicate Voters 
2. తప్పుడు, చెల్లని అడ్రస్ లు - Fake & Invalid Addresses 
3. ఒకే అడ్రస్ లో బల్క్ ఓటర్స్ - bulk voters in single address 
4. చెల్లని ఫోటోలు- invalid photos 
5. ఫామ్ 6 నిరుపయోగం - misuse of Form 6