
- ఇంటికి వెళ్లి నివాళి.. ఫ్యామిలీకి ఓదార్పు
- బాధితులకు దేశం అండగా నిలుస్తుందని వెల్లడి
- అమేథిలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, ఆసుపత్రి సందర్శన
కాన్పూర్, అమేథీ: పహల్గాం టెర్రరిస్టు దాడిలో మరణించిన శుభమ్ ద్వివేది కుటుంబాన్ని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పరామర్శించారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడటానికి పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్టు తెలిపారు. బుధవారం అమేథిలో పర్యటించిన రాహుల్ అక్కడి నుంచి కాన్పూర్ వెళ్లి శుభమ్ ద్వివేదికి నివాళి అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ‘‘పహల్గాం టెర్రరిస్టు దాడిలో ప్రాణాలు కోల్పోయిన శుభమ్ ద్వివేది కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చాను. ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు దేశమంతా మద్దతుగా నిలుస్తున్నది.
ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలి, బాధిత కుటుంబాలకు న్యాయం జరగాలి. ఇందుకోసం ప్రతిపక్షాలన్ని ఐక్యంగా ప్రభుత్వానికి మద్దతు ప్రకటించాయి. అలాగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని కోరాయి” అని రాహుల్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. అంతకు ముందు అమేథి పర్యటనలో రాహుల్ గాంధీ మున్షిగంజ్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, అదే క్యాంపస్‌లోని ఇండో -ఆసియన్ రైఫిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్‌ను సందర్శించారు. అక్కడ తయారవుతున్న రైఫిల్స్‌ను పశీలించారు.
2007లో యూపీఏ ప్రభుత్వ హయాంలో రాహుల్‌గాంధీ ఈ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేయగా.. 2019 మార్చి 3న ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించారు. అనంతరం సంజయ్ గాంధీ ఆసుపత్రిని రాహుల్ సందర్శించారు. సుమారు రూ.3.5 కోట్లతో నిర్మించిన కొత్త హార్ట్ యూనిట్‌ను ఓపెన్ చేశారు. అంబులెన్స్ సర్వీసును కూడా ప్రారంభించారు. తర్వాత ఇందిరా గాంధీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ డెవలప్మెంట్ను కూడా సందర్శించారు. అక్కడ స్టూడెంట్లు, ప్రొఫెసర్లతో మాట్లాడి కాలేజీ కార్యకలాపాలను సమీక్షించారు.