ముస్లిం లీగ్‌‌ సెక్యులర్ పార్టీ.. వాషింగ్టన్​లో రాహుల్​ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు

ముస్లిం లీగ్‌‌ సెక్యులర్ పార్టీ.. వాషింగ్టన్​లో రాహుల్​ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు
  • కాంగ్రెస్, బీజేపీ మాటల యుద్ధం
  • కాంగ్రెస్‌‌కు ఎంఐఎం, ఎంఎల్ సెక్యులర్‌‌‌‌గా, పీఎఫ్‌‌ఐ కల్చరల్‌‌గా కనిపిస్తాయి: బీజేపీ
  • పాకిస్తాన్ పర్యటనలో జిన్నాను అద్వానీ పొగడలేదా?: కాంగ్రెస్

వాషింగ్టన్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదమయ్యాయి. లండన్‌‌లో చేసిన వ్యాఖ్యల వ్యవహారం ఇంకా చల్లారకముందే.. ఇప్పుడు అమెరికాలో చేసిన కామెంట్లు కొత్త కాంట్రవర్సీకి కారణమయ్యాయి. ముస్లిం లీగ్‌‌ను సెక్యూలర్ పార్టీగా ఆయన అభివర్ణించడం.. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. ఇండియాలో రిజిస్టరైన ఐయూఎంఎల్‌‌ గురించే రాహుల్ మాట్లాడారని, పాకిస్తాన్‌‌కు చెందిన ముస్లిం లీగ్ గురించి కాదని కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. పాకిస్తాన్ పర్యటనలో జిన్నాను అద్వానీ పొగిడిన విషయాన్ని, ఐయూఎంఎల్‌‌తో శ్యామా ప్రసాద్ ముఖర్జీ పొత్తు పెట్టుకున్న విషయాన్ని ప్రస్తావించింది. ఎంఐఎం, ముస్లిం లీగ్, ఐఎస్ఎఫ్ లాంటి పార్టీలు కాంగ్రెస్‌‌కు సెక్యులర్‌‌‌‌గా కనిపిస్తాయని, పీఎఫ్‌‌ఐ లాంటి నిషేధిత ర్యాడికల్ సంస్థలు కల్చరల్ ఆర్గనైజేషన్లలా కనిపిస్తాయని బీజేపీ మండిపడింది. రాహుల్ ఓ రాజకీయ నేతగా మాట్లాడటం లేదని, ఇండియాకు శత్రువులా మాట్లాడుతున్నారని ఆరోపించింది.

రాహుల్ ఏమన్నారంటే..

ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ.. వాషింగ్టన్‌‌లోని నేషనల్ ప్రెస్ క్లబ్‌‌లో నిర్వహించిన న్యూస్ కాన్ఫరెన్స్‌‌లో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం గురించి మాట్లాడుతూనే.. కేరళలో ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్)తో పొత్తు పెట్టుకోవడంపై మీడియా ప్రశ్నించింది. రాహుల్ బదులిస్తూ.. ‘‘ముస్లిం లీగ్ అనేది పూర్తిగా సెక్యులర్ పార్టీ. ఆ పార్టీ విషయంలో నాన్ సెక్యులర్ అంటూ ఏమీ లేదు” అని చెప్పారు. 

ముస్లిం లీగ్‌‌పై బీజేపీకే ఎక్కువ ప్రేమ: కాంగ్రెస్

‘‘రాహుల్ ప్రస్తావించిన పార్టీ.. ముస్లిం లీగ్‌‌కి భిన్నమైనది. నిజానికి ముస్లిం లీగ్‌‌పై బీజేపీకే ఎక్కువ ప్రేమ ఉంది” అని కాంగ్రెస్ విమర్శించింది. బ్రిటీషర్ల పాలనలో బెంగాల్‌‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు హిందూ మహా సభ ప్రెసిడెంట్‌‌గా పని చేసిన శ్యామా ప్రసాద్ ముఖర్జీ.. ముస్లిం లీగ్‌‌తో పొత్తు పెట్టుకోలేదా? అని ప్రశ్నించింది. ‘‘గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు బెంగాల్ ప్రభుత్వంలో ముస్లిం లీగ్‌‌ ఉన్న కూటమిలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఉన్నారు. బెంగాల్ విభజనకు ముఖర్జీ ఒక్కరే కారణం” అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ విమర్శించారు. ‘‘బీజేపీ–ఆర్‌‌‌‌ఎస్‌‌ఎస్‌‌లకు పాకిస్తాన్ రాజకీయాల గురించి, జిన్నా ముస్లిం లీగ్ గురించి ఎక్కువ అవగాహన ఉంది. ఎందుకంటే వారి మధ్య చారిత్రక ‘జుగల్‌‌బందీ’ ఉంది”అని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా విమర్శించారు.

మూల్యం చెల్లించక తప్పదు: బీజేపీ

మొహమ్మద్ అలీ జిన్నా ఏర్పాటు చేసిన ‘ఆల్ ఇండియా ముస్లిం లీగ్’ మైండ్‌‌సెట్‌‌తోనే ఐయూఎంఎల్ ఏర్పాటు చేశారని బీజేపీ చెప్పుకొచ్చింది. ‘‘వీరంతా దేశ విభజన తర్వాత ఇక్కడే ఉండిపోయిన వాళ్లు. విభజన తర్వాత  ఇండియన్​ యూనియన్​ ముస్లిం లీగ్‌‌ను స్థాపించి ఎంపీలు అయ్యారు. వీరంతా అదే ముస్లిం లీగ్‌‌లో భాగమే. రాహుల్, కాంగ్రెస్ నేతలు.. హిందూత్వలో టెర్రరిజాన్ని చూస్తారు. కానీ ముస్లిం లీగ్ మాత్రం వాళ్లకు సెక్యులర్‌‌గా కనిపిస్తుంది” అని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ మండిపడ్డారు. ‘‘అమేథీ నుంచి రాహుల్ ఓడిపోయాడు. ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న వయనాడ్‌‌ నుంచి మరోసారి పోటీ చేయబోతున్నాడు. అందుకే పలు దేశాల్లో బ్యాన్ అయిన ‘ముస్లిం బ్రదర్‌‌హుడ్‘, ముస్లిం లీగ్ వంటి సంస్థలకు అనుకూలంగా మాట్లాడుతున్నాడు” అని ఆరోపించారు. రాహుల్ ఇండియాకు శత్రువులా మాట్లాడుతున్నారని బీజేపీ జమ్మూకాశ్మీర్ చీఫ్ రవీందర్ అన్నారు. ఆయన ఇందుకు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

వచ్చే ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు

రానున్న మూడు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ పడగొడుతుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. భారత ప్రజల్లో ఎక్కువ మంది మద్దతులేని బీజేపీని ఓడించడానికి అవసరమైన ప్రాథమిక అంశాలు తమకు ఉన్నాయని చెప్పారు. “ఆర్‌‌ఎస్‌‌ఎస్, బీజేపీలను ఆపలేమనే ధోరణి ప్రజల్లో ఉండేది. ఇప్పుడు అలా కాదు. మేం నేరుగా బీజేపీతో పోరాడుతం. వచ్చే మూడు లేదా నాలుగు ఎన్నికల్లో ఆ పార్టీ పతనాన్ని మీరు చూస్తారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గడ్డు పరిస్థితులను ఎదుర్కోబోతున్నది” అని చెప్పారు. ‘‘60 శాతం ఇండియన్లు బీజేపీకి, నరేంద్ర మోడీకి ఓటు వేయరని తెలుసుకోండి. బీజేపీ చేతిలో శబ్దం చేసే సాధనాలు ఉన్నాయి.. కాబట్టి వారు అరవగలరు, కేకలు వేయగలరు, వక్రీకరించగలరు. కానీ వారికి భారతీయులలో ఎక్కువమంది సపోర్ట్ చేయరు” అని అన్నారు. బీజేపీని ఓడించే శక్తి కాంగ్రెస్‌‌కి ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆశ్చర్యకర ఫలితాలు వస్తాయని అన్నారు. భారత ప్రజాస్వామ్యం ప్రపంచ ప్రజాహితాన్ని కోరుకుంటుందని, అది కుప్పకూలితే.. ప్రపంచంపై ప్రభావం పడుతుందని అన్నారు.‘‘భారతదేశం చాలా పెద్దది. కాబట్టి ఇండియాలో ప్రజాస్వామ్యం పతనమైతే.. ప్రపంచంపై ప్రభావం చూపుతుంది. కాబట్టి మీరు భారత ప్రజాస్వామ్యానికి ఎంత విలువ ఇవ్వాలో ఆలోచించండి” అని అన్నారు.