మా పార్టీని తక్కువగా అంచనా వేయొద్దు: రాహుల్​

 మా పార్టీని తక్కువగా అంచనా వేయొద్దు: రాహుల్​
  •     కాంగ్రెస్ పని అయిపోయిందని అనుకోవడం భ్రమ
  •     కోట్లాది మంది కార్యకర్తలే కాంగ్రెస్​ పార్టీ బలం
  •     పార్టీని వీడాలనుకునేవారు వెళ్లవచ్చని వ్యాఖ్య

జైపూర్: కాంగ్రెస్ పార్టీని తక్కువగా అంచనా వేయొద్దని, బీజేపీని ఓడించే సత్తా కేవలం తమ పార్టీకి మాత్రమే ఉందని కాంగ్రెస్ మాజీ చీఫ్, వయనాడ్​ ఎంపీ రాహుల్​ గాంధీ పేర్కొన్నారు. భారత్​ జోడో యాత్ర వంద రోజులు పూర్తిచేసుకున్నసందర్భంగా రాజస్థాన్​ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీని ఓడించే సత్తా ఉన్న ఏకైక పార్టీ కాంగ్రెస్​ మాత్రమేనని పేర్కొన్నారు. బీజేపీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీలకు విజన్  లేదని రాహుల్​ పేర్కొన్నారు. బీజేపీలాగా తమ పార్టీ ఫాసిస్టు భావజాలంతో నడవదని అన్నారు. దేశాన్ని విడగొట్టడం, విద్వేషం చిమ్మడమే బీజేపీకి తెలుసని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్  పార్టీని వీడాలనుకునే వారు వెళ్లవచ్చని, బీజేపీపై పోరాడలేని వారు తమకు అవసరం లేదని ఆయన స్పష్టంచేశారు.

‘‘కాంగ్రెస్  పని అయిపోయిందని చాలా మంది ఓ భ్రమలో ఉన్నారు. అయితే, కాంగ్రెస్​ పార్టీకి అంతమనేది లేదు. నా మాటలు గుర్తుపెట్టుకోండి. బీజేపీని మేము ఓడిస్తం. కొన్ని కోట్ల మంది కార్యకర్తలే కాంగ్రెస్  బలం. వారి సేవలను సద్వినియోగం చేసుకుంటే వచ్చే రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో మేము భారీ విజయం సాధిస్తం”  అని రాహుల్  అన్నారు. ఇక భారత్  జోడో యాత్రకు రాజస్థాన్​తో పాటు హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ఊహించని స్పందన వస్తోందని చెప్పారు. ప్రజలకు ఇప్పటికీ కాంగ్రెస్  అంటే అభిమానం ఉందన్నారు. రాజస్థాన్​లో వర్గపోరు వల్ల తన యాత్ర ఫెయిల్  అవుతుందని విమర్శకులు భావించారని, కానీ వారి అంచనాలను తలకిందులు చేస్తూ తన యాత్రకు మంచి స్పందన వస్తోందని పేర్కొన్నారు.

ఆప్  లేకపోయుంటే, బీజేపీని ఓడించేవాళ్లం

గుజరాత్  అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్  పోటీచేసి ఉండకపోతే, తాము బీజేపీని ఓడించేవాళ్లమని రాహుల్ అన్నారు. తమ పార్టీ గెలుపు అవకాశాలపై ఆప్​ ప్రభావం చూపిందన్నారు. బీజేపీకి ఆప్​ బీ టీమ్ అని, కాంగ్రెస్​ను ఓడించడానికి అవి రెండూ కుమ్మక్కయ్యాయని రాహుల్​ ఆరోపించారు.

రాహుల్ వెంట నడిచిన హిమాచల్  సీఎం 

హిమాచల్​ ప్రదేశ్​లో భారత్  జోడో యాత్రలో ఆ రాష్ట్ర సీఎం సుఖ్విందర్  సింగ్  సుఖూ, డిప్యూటీ సీఎం ముకేశ్  అగ్నిహోత్రి రాహుల్  గాంధీ వెంట నడిచారు. హిమాచల్ కాంగ్రెస్  చీఫ్​ ప్రతిభా సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ తో పాటు కొత్తగా అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఏఐసీసీ ఇన్ చార్జి రాజీవ్ శుక్లా కూడా భారత్​ జోడో యాత్రలో పాల్గొన్నారు.