
బఖ్తియార్ పూర్/పాలిగంజ్/జగదీశ్ పూర్ : ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేస్తామని కాంగ్రెస్ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ తెలిపారు. సోమవారం ఆయన బిహార్ లో పర్యటించారు. పాట్నా లోక్ సభ నియోజకవర్గంలోని బఖ్తియార్ పూర్, పాటలీపుత్ర సెగ్మెంట్ లోని పాలిగంజ్, ఆరా సెగ్మెంట్ లోని జగదీశ్ పూర్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీల్లో పాల్గొని మాట్లాడారు. జవాన్లను ప్రధాని మోదీ కార్మికులుగా మార్చారని రాహుల్ విమర్శించారు. ‘‘ఆర్మీని కేంద్ర ప్రభుత్వం రెండు కేటగిరీలుగా విభజించింది. అందులో అగ్నివీర్ ఒకటి.
ఒకవేళ అగ్నివీర్ గాయపడినా, మరణించినా నష్టపరిహారం రాదు.. అమరవీరుడిగా గుర్తింపు కూడా దక్కదు. ఎందుకీ వివక్ష?” అని ప్రశ్నించారు. తనను తాను గొప్ప దేశ భక్తుడిగా చెప్పుకునే మోదీ.. అగ్నిపథ్ స్కీమ్ ను అమలు చేసి, జవాన్లను అవమానిస్తున్నారని అన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే అగ్నిపథ్ స్కీమ్ ను చెత్తబుట్టలో పడేస్తామని చెప్పారు. మహిళలకు ప్రతినెలా రూ.8,500 అకౌంట్ లో వేస్తామని హామీ ఇచ్చారు. దీంతో ప్రతి కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని పేర్కొన్నారు. ఈసారి ఇండియా కూటమి తప్పకుండా అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘దేశవ్యాప్తంగా ఇండియా కూటమి సునామీ వస్తున్నది. మోదీ మరోసారి ప్రధాని కాలేరు” అని అన్నారు.
మోదీ కామెంట్లకు కౌంటర్..
ప్రజలకు సేవ చేయడానికే దేవుడు తనను పంపించాడని ప్రధాని మోదీ చేసిన కామెంట్లకు రాహుల్ కౌంటర్ ఇచ్చారు. ‘‘జూన్ 4 తర్వాత మోదీని అవినీతిపై ఈడీ ప్రశ్నిస్తే.. ‘నాకేం తెలియదు. దేవుడు చెప్పినట్టే చేశాను’ అని ఆయన అంటారేమో. అందుకే దేవుడి దూతను అని చెప్పుకుంటున్నారు. బిలియనీర్లకు సేవ చేయడానికే మోదీని దేవుడు పంపించాడా?” అని ప్రశ్నించారు. మోదీ 22 మందిని బిలియనీర్లను చేశారని, కానీ ఇండియా కూటమి అధికారంలోకి వస్తే కోట్లాది మందిని లక్షాధికారులను చేస్తుందని చెప్పారు. ‘‘మోదీ పేదలను దోచుకుని పెద్దలకు పంచిపెట్టారు. తన బిలియనీర్ దోస్తులకు చెందిన రూ.16 లక్షల కోట్ల లోన్లను మాఫీ చేశారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని, రిజర్వేషన్లను కాపాడుకునేందుకు జరుగుతున్న ఎన్నికలివి” అని అన్నారు.
కూలిన స్టేజీ.. రాహుల్ కు త్రుటిలో తప్పిన ప్రమాదం
రాహుల్ గాంధీకి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఆయన ఎక్కిన స్టేజీ సడెన్‌గా కూలింది. దీంతో ఆయన కింద పడకుండా మీసా భారతి (ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ కూతురు) వెంటనే రాహుల్ చెయ్యి పట్టుకున్నారు. బిహార్‌లోని పాల్ గంజ్‌లో సోమవారం ఈ ఘటన జరిగింది. ఇక్కడ మీసా భారతికి మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు రాహుల్ హాజరయ్యారు. ఆయనతో పాటు మీసా భారతి, ఆర్జేడీ, కాంగ్రెస్ నేతలు వేదిక ఎక్కారు. ఇంతలోనే వేదికలో ఓ భాగం అకస్మాత్తుగా కూలిపోయింది. అయితే, అందరూ అప్రమత్తమై కింద పడకుండా ఒకరి చేతిని ఒకరు పట్టుకున్నారు. దీంతో ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకుండా తప్పించుకున్నారు.