ఒడిశాలో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంది : రాహుల్ గాంధీ

ఒడిశాలో ఆ రెండు పార్టీల మధ్య పొత్తు ఉంది : రాహుల్ గాంధీ

బాలాసోర్: తెలంగాణ తరహాలో ఒడిశాలోనూ ప్రజాప్రభుత్వాన్ని నెలకొల్పుతామని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ అన్నారు. ‘‘తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ మధ్య పొత్తు ఉంది. ఆ రెండు పార్టీలపై కాంగ్రెస్ పోరాడి విజయం సాధించింది. ఇప్పుడక్కడ ప్రజాప్రభుత్వం ఏర్పడింది. పేదల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నది. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ జర్నీ అమల్లోకి తెచ్చింది. తెలంగాణ లెక్క ఒడిశాలోనూ ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తాం. ఇక్కడ బీజేడీ, బీజేపీ మధ్య పొత్తు ఉంది. ఈ రెండు పార్టీలనూ ఓడిస్తాం” అని తెలిపారు.

గురువారం ఒడిశాలోని భద్రక్ లోక్ సభ నియోజకవర్గంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో రాహుల్ పాల్గొని మాట్లాడారు. బీజేడీ, బీజేపీ ఒక్కటేనని, ఆ రెండు పార్టీలు ఒడిశా ప్రజలను దోచుకుంటున్నాయని ఆయన విమర్శించారు. ‘‘బీజేడీ, బీజేపీ పేదలను విస్మరించాయి. కొంతమంది పెద్దల కోసమే పని చేస్తున్నాయి. ఒడిశా ప్రభుత్వాన్ని సీఎం నవీన్ పట్నాయక్ నడిపించడం లేదు. ఆయన సన్నిహితుడు వీకే పాండియన్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నాపై 24 పరువునష్టం, క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఎందుకంటే నేను కేంద్రంపై కొట్లాడుతున్నాను. కానీ కేంద్రంపై కొట్లాడుతున్నానని చెబుతున్న నవీన్ పట్నాయక్ పై మాత్రం ఒక్క కేసు కూడా లేదు” అని అన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రైతుల పంట రుణాలు మాఫీ చేస్తామని, మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చారు. ‘‘కేంద్రం అగ్నిపథ్​ పథకాన్ని తీసుకొచ్చి జవాన్లను మజ్దూర్లుగా మార్చింది. మా ప్రభుత్వం వచ్చినంక అగ్నిపథ్ పథకాన్ని రద్దు చేస్తాం” అని తెలిపారు.

ఆర్ఎస్ఎస్ వాళ్లకు గాంధీ గురించి ఏమి తెలుసు? 

‘గాంధీ’ సినిమా వచ్చిన తర్వాతే మహాత్మాగాంధీ గురించి ప్రపంచానికి తెలిసిందంటూ ప్రధాని మోదీ చేసిన కామెంట్లపై రాహుల్ మండిపడ్డారు. ఆర్ఎస్ఎస్ తో అనుబంధం ఉన్నోళ్లకు గాంధీ గురించి ఇంతకుమించిన అవగాహన ఏముంటుందని విమర్శించారు. ‘‘ఆర్ఎస్ఎస్ లో శిక్షణ పొందినోళ్లందరూ గాడ్సే ఫాలోవర్లు. వాళ్లకు గాంధీ, హిందూస్తాన్, సత్యం గురించి ఏమీ తెలియదు. అందుకే ప్రధాని మోదీ అలా మాట్లాడారు” అని అన్నారు. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, నెల్సన్ మండేలా, ఐన్ స్టీన్ లాంటి వాళ్లెందరో గాంధీ నుంచి స్ఫూర్తి పొందారని చెప్పారు.