
- వాటిలో 15 సీట్లు తగ్గినా.. మోదీ ప్రధాని కాకపోతుండె: రాహుల్ గాంధీ
- 2014 నుంచే ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతున్నది
- మాకు 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటూ రాకపోవుడేంది?
- ఎన్నికల్లో అక్రమాలపై 100% ప్రూఫ్స్ ఉన్నయ్
- దేశంలో ఎన్నికల సంఘం డెడ్ అయింది
- ఏఐసీసీ ‘రాజ్యాంగ సదస్సు’లో ప్రసంగం
- మోదీ చేతిలో ఈసీ కీలుబొమ్మ: ఖర్గే
- రాజ్యాంగం బందీ అయింది: సోనియా
న్యూఢిల్లీ, వెలుగు: లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని, లేకపోతే నరేంద్ర మోదీ ప్రధాని అయ్యేవారే కాదని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 70 నుంచి 100 సీట్లలో రిగ్గింగ్ జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. వీటిలో కనీసం 15 సీట్లు తగ్గినా మోదీ ప్రధాని అయ్యేవారే కాదన్నారు. దేశంలో ఎన్నికల సంఘం డెడ్ అయిందని ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో రిగ్గింగ్ ఎలా జరిగిందన్నది వివరించేందుకు తమ వద్ద 100 శాతం ఆధారాలు ఉన్నాయని, త్వరలోనే వాటిని బయటపెడతామన్నారు. శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఏఐసీసీ లా, హ్యూమన్ రైట్స్ అండ్ ఆర్‌టీఐ విభాగం- ఆధ్వర్యంలో 'రాజ్యాంగ సవాళ్లు: దృక్పథం, మార్గాలు' థీమ్‌తో సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఏఐసీసీ చీఫ్ ఖర్గే, అగ్రనేతలు రాహుల్, ప్రియాంక, ఏఐసీసీ మెంబర్లు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు, పార్టీ శ్రేణులు, న్యాయనిపుణులు, మేధావులు, విద్యార్థులు హాజరయ్యారు.
సదస్సులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. వారణాసిలో స్వల్ప మెజారిటీతోనే మోదీ గెలవడం, 70 నుంచి 100 సీట్లలో బీజేపీ గెలవడంపై అనుమానం ఉందన్నారు. మహారాష్ట్రలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల మధ్య కేవలం 4 నెలల్లోనే కోటి మంది కొత్త ఓటర్లు నమోదయ్యారని చెప్పారు. అందులో ఎక్కువ మంది బీజేపీ వాళ్లే ఉన్నారన్నారు. రిగ్గింగ్ జరుగుతోందని 2014 నుంచే తనకు అనుమానాలు ఉన్నాయన్నారు. రిగ్గింగ్ జరగకపోతే.. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఒక్క సీటూ రాకపోవడమేంటని అన్నారు.
అరుణ్ జైట్లీ నన్ను బెదిరించారు..
కేంద్రంలోని బీజేపీతో పోరాడితే ఎవరినైనా సరే ఆ పార్టీ టార్గెట్ చేస్తుందని రాహుల్ గాంధీ అన్నారు. ఇందులో భాగంగానే తనపై 30 కేసులు నమోదు చేసిందని, వాటితో పోరాడుతున్నానని చెప్పారు. కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలపై రైతులకు మద్దతు ఇవ్వొద్దని తనను అప్పటి బీజేపీ అగ్ర నేత అరుణ్ జైట్లీ బెదిరించారని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. ‘‘అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రోజుల్లో జరిగిన ఒక సంఘటన నాకు గుర్తుంది. నన్ను బెదిరించేందుకు అరుణ్ జైట్లీని పంపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అగ్రి చట్టాలపై పోరాటం చేస్తే.. నాపై చర్యలు తీసుకుంటామని ఆయన బెదిరించారు. నేను ఆయన వంక చూసి.. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో మీకు తెలియదనుకుంటా. ఎందుకంటే మేం కాంగ్రెస్ వాళ్లం. పిరికోళ్లం కాదు. మేం తలవంచం. బ్రిటిష్ సామ్రాజ్యానికే భయపడలేదు. మీకు భయపడతామా?” అని తేల్చి చెప్పానన్నారు.
ఇండియాలోనే అలా జరగలేదు..
రాఫెల్ ఒప్పందంలో ప్రధాని కార్యాలయం, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ (ఎన్ఎస్ఏ) జోక్యం చేసుకున్నారని స్పష్టంగా పేర్కొన్న ఒక డాక్యుమెంట్‌పైనా రాహుల్ గాంధీ స్పందించారు. ప్రపంచంలోని ఏ దేశంలోనైనా ఇలా జోక్యం చేసుకుని ఉంటే ప్రభుత్వాలు కూలిపోయేవన్నారు. కానీ, ఇండియాలో మాత్రం అలా జరగలేదన్నారు. ఆ డాక్యుమెంట్ ఎక్కడికి వెళ్లింది, ఎలా కనుమరుగైందో దేశ ప్రజలకు తెలుసన్నారు. తన చేతిలోని రాజ్యాంగం 5 వేల ఏండ్లకు పైగా దేశ చరిత్ర, సంస్కృతికి చిహ్నమని అన్నారు. ఈ రాజ్యాంగాన్ని రక్షించడం ద్వారా ప్రజల జీవన విధానాన్ని కాపాడుకుంటామని చెప్పారు. మతంపేరుతో ఇతరులపై దాడి చేస్తున్న వారిని మహాత్మా గాంధీ తీవ్రంగా విమర్శించారని అన్నారు.
ఆధారాలు ఆటంబాంబుల్లా పేల్తయ్..
ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందనేందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని రాహుల్ గాంధీ చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలను బీజేపీ ఎలా తారుమారు చేసిందో చెప్పడానికి ఆరు నెలలు తీవ్రంగా కష్టపడి ఆధారాలు, సాక్ష్యాలను సేకరించినట్లు తెలిపారు. ఉదాహరణకు కర్నాటకలోని ఓ అసెంబ్లీ నియోజకవర్గంలో 6.5 లక్షల మంది ఓటర్లు ఉండగా, ఇందులో 1.5 లక్షల ఫేక్ ఓట్లు ఉన్నట్టు తేలిందన్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేయబోయే డేటాతో ఎన్నికల వ్యవస్థలోని తతంగం తెలుసుకుని దేశం షాక్ అవుతుందన్నారు. ఎన్నికల్లో అక్రమాలపై తన వద్ద 100 శాతం ఆధారాలు ఉన్నాయని, వాటిని బయటపెట్టగానే ఆటంబాంబుల్లా పేలుతాయన్నారు. వాస్తవానికి దేశ ఎన్నికల వ్యవస్థ ఇప్పటికే డెడ్ అయిందని, ఇప్పుడు అది ఉనికిలోనే లేదన్నారు.
నేను రాజును కాను.. ఆ విధానానికే వ్యతిరేకం
తాను రాజును కాదని, ఆ విధానానికే వ్యతిరేకం అని రాహుల్ అన్నారు. సదస్సులో స్పీచ్ ప్రారంభిస్తుండగా హాల్ లోని చాలా మంది ‘‘ఈ దేశానికి రాజు ఎలా ఉండాలంటే.. రాహుల్ గాంధీ లెక్క ఉండాలి(ఇస్ దేశ్ కా రాజా కైసా హో, రాహుల్ గాంధీ జైసా హో)” అంటూ నినాదాలు చేశారు. దీంతో రాహుల్ స్పందిస్తూ.. “నో బాస్. నేను రాజును కాదు. రాజు కావాలనీ అనుకోవడం లేదు. అసలు రాజు అనే కాన్సెప్ట్ కే నేను వ్యతిరేకం” అంటూ స్పీచ్ ప్రారంభించారు.
మత రాజ్యం కోసం బీజేపీ కుట్ర: సోనియా గాంధీ
బీజేపీ పాలనలో రాజ్యాంగం బందీ అయిందని, ఆ పార్టీ అధికార బలంతో రాజ్యాంగ వ్యవస్థలను నాశనం చేస్తోందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) చైర్ పర్సన్ సోనియా గాంధీ ఫైర్ అయ్యారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అంతం చేసి, మత రాజ్యం తెచ్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని ఆరోపించారు. సోనియా గాంధీ పంపిన సందేశాన్ని కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షిద్ సదస్సులో చదివి వినిపించారు. ‘‘లీగల్ చార్టర్ కంటే రాజ్యాంగం గొప్పది. ఇది న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వమే మూలస్తంభాలుగా నిర్మితమైంది. త్యాగాలు, దార్శనికత ద్వారా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ రూపుదిద్దుకున్నది. 1928లో నెహ్రూ రిపోర్ట్ నుంచి 1934లో కాన్ స్టిట్యూయెంట్ అసెంబ్లీ కోసం డిమాండ్ వరకూ మహాత్మా గాంధీ, నెహ్రూ రాజ్యాంగానికి పునాది వేశారు. ముసాయిదా కమిటీ చైర్మన్ గా డా. అంబేద్కర్ ఈ ఆదర్శాలకు రూపం ఇచ్చారు. సామాజిక, ఆర్థిక న్యాయం లేకుండా.. రాజకీయ ప్రజాస్వామ్యం కేవలం ఒక అలంకరణ మాత్రమే అవుతుంది. దీన్ని గుర్తించి హక్కుల విస్తరణ, సంస్థల బలోపేతానికి చేశాం. కానీ నేడు రాజ్యాంగం ముట్టడిలో ఉంది’’ అని సోనియా తన సందేశంలో పేర్కొన్నారు. ఎన్నడూ స్వేచ్చ, సమానత్వం కోసం పోరాడని బీజేపీ, ఆర్ఎస్ఎస్.. ఇప్పుడు వాటిని లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు.