దేశ చరిత్ర తెల్సుకోవాలని రాహుల్ గాంధీకి హితవు​

దేశ చరిత్ర తెల్సుకోవాలని రాహుల్ గాంధీకి హితవు​

సీఎం గెహ్లాట్​ సొంతగడ్డ జోధ్​పూర్​లో భారీ సభ

జోధ్​పూర్: రాజస్థాన్​లో కాంగ్రెస్  ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాలు మాత్రమే చేస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​షా విమర్శించారు. ఉదయ్​పూర్​ టైలర్​ కన్హయ్య లాల్​మర్డర్​తో పాటు కరౌలీలో జరిగిన హింసాకాండపై ఆయన విరుచుకుపడ్డారు.  దసరా పరేడ్​ గ్రౌండ్​లో నిర్వహించిన బీజేపీ బూత్​ లెవల్​ వర్కర్​ సభలో ఆయన మాట్లాడారు. ‘‘పార్లమెంట్​లో రాహుల్​ చేసిన ప్రసంగాన్ని మరోసారి గుర్తు చేస్తాను. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్​ చదవడమే రాహుల్​ బాబాతో పాటు ఇతర కాంగ్రెస్​ నేతల పని. ఇండియా దేశం కాదని ఎవరు చెప్పారు..? ఏ బుక్​లో చదివారు..? ఇండియా దేశం కాదన్న రాహుల్​.. రూ.41వేలు విలువైన ఫారిన్​ టీ షర్ట్స్​ వేసుకుని భారత్​ జోడో యాత్ర చేస్తున్నడు. ముందు ఇండియా హిస్టరీ గురించి తెలుసుకో”అంటూ ​షా విమర్శించారు.

తనోట్​ మాతా టెంపుల్​లో ప్రత్యేక పూజలు

రాజస్థాన్​ సీఎం అశోక్​ గెహ్లాట్​ సొంతగడ్డ జోధ్​పూర్​ నుంచి అమిత్​షా అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. శుక్రవారం జోధ్​పూర్​ చేరుకున్న అమిత్​షాకు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్​ సతీష్​ పునియా, కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, మాజీ సీఎం వసుంధర రాజే, ప్రతిపక్ష నేత గులాబ్​ చంద్​ కటారియా స్వాగతం పలికారు. 1,500 మంది కార్యకర్తలు భారీ మోటర్​ సైకిల్​ ర్యాలీ తీశారు. జోధ్​పూర్​లో టూరిజం డెవలప్​మెంట్​ ప్రాజెక్ట్​కు భూమి పూజ చేశారు. తర్వాత జైసల్మేర్​లోని తనోట్ రాయ్ మాతా టెంపుల్​వెళ్లారు. ‘విజయ్​ స్తంభ్’కు పూలమాల వేసి నివాళులర్పించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి... టెంపుల్​ ఆవరణలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తర్వాత దబ్లాలోని సౌత్​ సెక్టార్​ హెడ్​క్వార్టర్స్​లో బీఎస్​ఎఫ్​ జవాన్లతో అమిత్​షా సమావేశం అయ్యారు. జోధ్​పూర్​లో నేషనల్​ లెవల్​ బీజేపీ ఓబీసీ మోర్చా మీటింగ్​కు అమిత్​షా హాజరయ్యారు.