వనవాసీ పదంతో బీజేపీ గిరిజనులను అవమానిస్తోంది: రాహుల్ గాంధీ

వనవాసీ పదంతో బీజేపీ గిరిజనులను అవమానిస్తోంది: రాహుల్ గాంధీ

ఆదివాసీలకు బదులుగా 'వనవాసీ' అనే పదాన్ని వాడుతూ బీజేపీ  గిరిజనులను అవమానిస్తుందని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్‌లో కాంగ్రెస్ నిర్వహించిన  బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. దేశంలో పేదరికం ఒక్కటే కులం అని చెప్పిన ప్రధాని మోదీ.. ఇప్పుడు తాను ఓబీసీని అని ఎందుకు చెప్పుకుంటున్నారని రాహుల్ మండిపడ్డారు.

నరేంద్ర మోదీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు వనవాసీ అనే కొత్త పదాన్ని తీసుకొచ్చారని.. బీజేపీ నేతలు తమ ప్రసంగాల్లో ఆదివాసీకి బదులు వనవాసీ అని వాడుతున్నారని చెప్పారు. వనవాసీ, ఆదివాసీ పదాల మధ్య చాలా వ్యత్యాసం ఉందన్నారు. మధ్యప్రదేశ్‌లో ఓ గిరిజన యువకుడిపై బీజేపీ నేత మూత్ర విసర్జన చేసి ఆ ఘటనను చిత్రీకరించారని.. ఆ తర్వాత దాన్ని వైరల్ చేశారని తెలిపారు. ఇది బీజేపీ ఆలోచన అని.. మిమ్మల్నీ అడవిలో జంతువులలా చూస్తున్నారని చెప్పారు.

ఆదివాసీ అనేది విప్లవాత్మకమైన పదమని, ఆదివాసీలు అంటే దేశానికి అసలు యజమానులని రాహుల్ అన్నారు. బీజేపీ ఈ పదాన్ని ఉపయోగించదని... ఎందుకంటే, మీ భూమి, నీరు, అడవులను తిరిగి మీకు ఇవ్వాలి వస్తుందని  అన్నారు. వనవాసీ అనే పదం గిరిజనులను అవమానించడమేనని, దానిని కాంగ్రెస్ అంగీకరించదని రాహుల్ చెప్పారు.

దేశంలో  దళితులు, ఆదివాసీలు, వెనుకబడినవారు ఉన్నారని.. కానీ  పేదరికం ఒక్కటే కులం అని  మోదీ  అన్నారని.. మరి, దేశంలో ఒకే కులం ఉంటే తాను ఓబీసీ అని చెబుతున్నారని రాహుల్ ప్రశ్నించారు. కాగా, ఛత్తీస్ గఢ్ లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 7, 17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి.