- సైలెన్స్ కల్చర్ దురాశను పెంచుతుంది: రాహుల్ గాంధీ
తిరువనంతపురం:భారత్ గొప్ప దేశమవ్వాలంటే ప్రజలు మౌనం వీడాలని కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అన్నారు. సైలెన్స్ కల్చర్ దురాశను పెంచుతుందని హెచ్చరించారు. ప్రజలు తమ అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తపరిచి, వాటి కోసం పోరాడినప్పుడే గొప్ప దేశాలు నిర్మితమవుతాయని చెప్పారు.
దేశంలో అధికారాన్ని కేంద్రీకృతం చేసేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. సోమవారం ఆయన కేరళలోని ఎర్నాకుళం జిల్లా కలమస్సేరీలో జరిగిన కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. మలయాళ రచయిత్రి డా. ఎం. లీలావతికి కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) తరపున 'ప్రియదర్శిని సాహిత్య అవార్డు'ను అందజేశారు.
అనంతరం రాహుల్ కొచ్చి మెరైన్ డ్రైవ్‌లో నిర్వహించిన యూడీఎఫ్ మహాపంచాయత్ సభకు వెళ్లారు. అక్కడ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో (పంచాయతీ, మున్సిపాలిటీ, కార్పొరేషన్) గెలిచిన సుమారు 7,800 మంది కాంగ్రెస్/యూడీఎఫ్ ప్రతినిధులను సన్మానించారు. వీరిని "రియల్ వారియర్స్" అని ప్రశంసించారు.
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.."భారత్ గొప్ప దేశం కావాలంటే అన్యాయాలపై ప్రజలు నోరు విప్పాలి. నాకు కావాల్సినది దొరుకుతున్నపుడు మిగతా విషయాలు నాకెందుకనే ధోరణిలో ఉండొద్దు. ఇతరులు అవమానాలకు గురవుతున్నా, హత్యలు జరుగుతున్నా చూసి ఊరుకోవద్దు.
నేను బాగుంటే చాలు అనే మనస్తత్వం వల్ల, ఈ సైలెంట్ కల్చర్ వల్ల దురాశ పెరుగుతుంది. మనం ఎదురు మాట్లాడకపోతే కార్పొరేట్లు మాత్రమే వృద్ధి చెందేలా నిర్ణయాలు తీసుకుంటారు" అని హెచ్చరించారు.
అధికారాన్ని కేంద్రీకృతం చేసేందుకు కుట్ర
ఆర్ఎస్ఎస్, బీజేపీ అధికారాన్ని కేంద్రీకృతం చేసేందుకు కుట్ర చేస్తున్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. కాంగ్రెస్ మాత్రం అధికార వికేంద్రీకరణకు నిబద్ధతతో కృషి చేస్తున్నదని తెలిపారు. 73వ, 74వ రాజ్యాంగ సవరణల ద్వారా పంచాయతీ రాజ్ వ్యవస్థను యూపీఏ పాలనతో బలోపేతం చేశామని గుర్తుచేశారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ ప్రజల గొంతును అణచివేస్తున్నాయని మండిపడ్డారు. తద్వారా దేశ ఆస్తులను కొద్దిమంది కార్పొరేట్లు నియంత్రించేలా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఈ విధానాన్ని కేరళ ప్రజలు మౌనంగా చూస్తు ఉండలేరు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల ద్వారా తమ గొంతును వినిపిస్తారని 100% కచ్చితంగా నమ్ముతున్నట్లు రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
