వడ్ల పోరాటానికి రాహుల్ వస్తడు

వడ్ల పోరాటానికి రాహుల్ వస్తడు
  • ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటారన్న రేవంత్​
  • కార్యకర్తలకు రూ.2 లక్షల బీమా వర్తిస్తుందన్న పీసీసీ చీఫ్
  • ఢిల్లీలో రాహుల్​ను కలిసిన రాష్ట్ర కాంగ్రెస్ నేతలు

న్యూఢిల్లీ, వెలుగు: వడ్ల కొనుగోలు విషయంలో రాష్ట్ర రైతులు చేపట్టే పోరాటంలో కాంగ్రెస్ జాతీయ నేత రాహుల్​గాంధీ ప్రత్యక్షంగా పాల్గొంటారని పీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్​రెడ్డి చెప్పారు. ఏప్రిల్ 1 నుంచి క్షేత్ర స్థాయిలో ప్రజా పోరాటాలను నిర్మించి, ప్రజా సమస్యల పరిష్కారం కోసం దీర్ఘ కాలిక పోరాట కార్యాచరణతో ముందుకెళ్తామని అన్నారు. రైతులు, నిరుద్యోగులు, మహిళలు, అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులకు సంబంధించిన సమస్యలపై పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. బుధవారం ఢిల్లీ తుగ్లక్ రోడ్ లోని రాహుల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌‌ నేతలు ఆయనతో భేటీ అయ్యారు. 30 నిమిషాలకు పైగా ఈ మీటింగ్ సాగింది. ఇటీవల రాష్ట్రంలో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో దాదాపు 40 లక్షల మంది సభ్యత్వాలు తీసుకున్నట్లు రాహుల్​కు వివరించారు. ఆ కార్యకర్తలకు సంబంధించి రూ.2లక్షల బీమా కోసం రూ.6.34 కోట్ల ప్రీమియం చెక్కును ఆయన చేతుల మీదుగా న్యూ ఇండియా ఇన్సూరెన్స్‌‌ కంపెనీ ప్రతినిధులకు అందజేశారు. 
పెద్ద సంఖ్యలో పార్టీ సభ్యత్వాలను నమోదు చేసిన స్టేట్ లీడర్లను రాహుల్ గాంధీ అభినందించారు. బీజేపీ, టీఆర్ఎస్ ను ఎదుర్కొనే దిశలో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలతో చర్చించారు.

ఏప్రిల్​1 నుంచి బీమా 
భేటి తర్వాత రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏప్రిల్‌ 1వ తేదీ నుంచి క్రియాశీలక సభ్యులకు రూ.2 లక్షల భీమా వర్తిస్తుందని వెల్లడించారు. దేశంలోనే క్రీయాశీల సభ్యత్వ నమోదులో తెలంగాణ ఫస్ట్ ప్లేస్ లో ఉందని చెప్పారు. వడ్ల కొనుగోలు విషయంలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చేపట్టే పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొనాలనే తమ వినతిపై రాహుల్ సానుకూలంగా స్పందించారని చెప్పారు. పార్టీ చేపట్టే కార్యచరణలో తప్పక పాల్గొంటానని హామీ ఇచ్చారని వెల్లడించారు. రాహుల్ తో భేటిలో కాంగ్రెస్​ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మాణిక్కం ఠాగూర్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి, ఎంపీ ఉత్తమ్‌ తో పాటు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, దామోదర రాజనర్సింహ, గీతారెడ్డి, అజారుద్దీన్, షబ్బీర్‌ అలీ, మధుయాష్కీ గౌడ్, మహేశ్వర్‌రెడ్డి, మహేశ్‌గౌడ్, బలరాం నాయక్, మల్లు రవి తదితరులు పాల్గొన్నారు.

ఏప్రిల్ 4న రాహుల్ తో మరోసారి భేటీ
తెలంగాణలో పార్టీ బలోపేతం, రాబోయే ఎన్నికలకు సంబంధించి అనుసరించాల్సిన వ్యూహాలపై ఏప్రిల్ 4, మరోసారి రాష్ట్ర నేతలతో రాహుల్ గాంధీ భేటీ కానున్నారు.  ఈ భేటీలో ఎన్నికల వ్యూహకర్తను, రాష్ట్ర నాయకులకు పరిచయం చేయనున్నట్లు సమాచారం. ఇందుకోసం ఏప్రిల్ 4, లేదా 5 తేదీల్లో ఢిల్లీకి రావాలని కోరారు. రాష్ట్ర ఎన్నికల వ్యూహకర్త పరిచయం, పార్టీలో కొంతకాలంగా కలవరపెడుతోన్న అంతర్గత వివాదాలు, సీనియర్ల మధ్య మనస్పర్థలపై రాష్ట్ర నాయకత్వానికి దిశా నిర్దేశం చేయనున్నట్టు సమాచారం.