నవంబర్ 2న మేడిగడ్డకు రాహుల్ గాంధీ.. హెలికాప్టర్ ల్యాండింగ్కు ఈసీ అనుమతి

నవంబర్ 2న మేడిగడ్డకు రాహుల్ గాంధీ.. హెలికాప్టర్ ల్యాండింగ్కు ఈసీ అనుమతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గురువారం (నవంబర్ 2వ తేదీన) రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. మహాదేవపూర్ మండలంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని పరిశీలించనున్నారు. ఇటీవల పిల్లరు కుంగిపోవడంతో దాన్ని చూసేందుకు రాహుల్ గాంధీ వెళ్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌‌ గాంధీ పర్యటన కోసం పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేయనున్నట్లు తెలుస్తోంది. 

గురువారం రోజు రాహుల్ గాంధీ హెలికాఫ్టర్ లో అంబటిపల్లికి వెళ్లనున్నారు. మంథని నియోజకవర్గంలోని అంబటిపల్లిలో హెలికాఫ్టర్ ల్యాండింగ్ కు ఈసీ అనుమతి ఇచ్చింది. ముందుగా పర్మిషన్ ఇవ్వలేదు. ఆ తర్వాత హెలికాప్టర్ ల్యాండింగ్ కు పర్మిషన్ ఇచ్చింది. మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు బుధవారం (నవంబర్ 1న) హెలిపాడ్ స్థల పరిశీలన చేశారు. గురువారం రోజు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద కుంగిన పిల్లర్లను రాహుల్ పరిశీలించనున్నారు. అనంతరం అంబటిపల్లి నూతన గ్రామపంచాయతీ సమీపంలో ఏర్పాటు చేయబోయే మహిళా సదస్సులో పాల్గొనున్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాల గురించి మహిళలకు వివరించనున్నారు. రాహుల్ పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు దగ్గరుండి చూసుకుంటున్నారు. 

 మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన తర్వాతే రాహుల్ గాంధీ అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ ఘటన రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మేడిగడ్డ బ్యారేజీలోని పిల్లర్లు కుంగిపోవటం బీఆర్ఎస్ ను ఇరుకున పెడుతోంది. కేసీఆర్ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పిస్తున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ పదే పదే ఆరోపిస్తోంది.