
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ కోసం ఎన్నికల సంఘం ఓట్ల గోల్ మాల్‌కు పాల్పడుతున్నదన్నారు. ఇందుకు సంబంధించి తమ వద్ద అణు బాంబులాంటి ఆధారాలున్నాయని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన పార్లమెంట్ బయట మీడియాతో మాట్లాడారు. "ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయని మాకు ఎప్పటి నుంచో అనుమానం ఉంది. మధ్యప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల తర్వాత మరిన్ని అనుమానాలు పెరిగాయి.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల టైంలో ఓటర్ల లిస్టులో అదనంగా 1 కోటి కొత్త ఓటర్లను చేర్చినట్లు తెలియడంతో మా అనుమానాలు బలపడ్డాయి. మా ఫిర్యాదులపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోదని అర్థమైంది. అందుకే మేమే ఆరు నెలలుగా స్వతంత్ర దర్యాప్తు నిర్వహించారు. అప్పుడే మాకు అణుబాంబులాంటి ఆధారాలు దొరికాయి. అది పేలినప్పుడు ఎన్నికల సంఘానికి దాక్కునే చోటు కూడా ఉండదు. ఓటర్ల జాబితాలో అవకతవకలు దేశద్రోహం కంటే తక్కువేం కాదు. ఓట్ల చోరీలో పాల్గొన్న వారిని ఎవరినీ వదిలిపెట్టం. ఎక్కడ ఉన్నా, రిటైరయినా, మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదు" అని రాహుల్ పేర్కొన్నారు.
అవన్నీ నిరాధారమే: ఈసీ
ఓట్ల జాబితాలో గోల్ మాల్ జరిగిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతోపాటు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) ఖండించింది. ఓట్ల చోరీ అంటూ రాహుల్ చేస్తున్న కామెంట్లను పట్టించుకోవద్దని కోరింది. ఆయన చేసేవన్నీ నిరాధార ఆరోపణలేనని కొట్టిపారేసింది. ఇలా రోజూ వచ్చే బెదిరింపులను పట్టించుకోవద్దని.. న్యాయంగా, పారదర్శకంగా పనిచేస్తూనే రాహుల్ గాంధీ చేస్తున్న బాధ్యతారాహిత్య వ్యాఖ్యలను విస్మరించాలని ఎన్నికల అధికారులందరిని కోరింది.